అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో ఢిల్లీలో బుధవారం జరుగనున్న ఎంపవర్డ్ కమిటీ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ ....
జీఎస్‌టీ అమలుపై జైట్లీ సమీక్ష
హైదరాబాద్: అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో ఢిల్లీలో బుధవారం జరుగనున్న ఎంపవర్డ్ కమిటీ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరవనున్నారు. జీఎస్‌టీ అమలుకు సంబంధించి అన్ని రాష్ట్రాల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి ఈటలతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవనున్నారు. అమ్మకపు పన్ను వాటాకు సంబంధించిన సుమారు రూ.5,600 కోట్ల బకాయిలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికీ కేంద్రం నుంచి రావాల్సి ఉంది.
పునర్విభజన చట్టం ప్రకారం అందులో 42 శాతం నిధులు తెలంగాణకు దక్కుతాయి. 2007 నుంచి బకాయి ఉన్న ఈ నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు ఆర్థిక సాయం కోరటంతోపాటు.. ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని సడలించాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో పాటు 13వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది.