మహారాష్ట్రలో చిచ్చు పెట్టిన ‘ఫేస్‌బుక్‌ పేజీ’

facebook page fueled tension in Maharashtra Bhima Koregaon - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర దళితుల ఆందోళనతో దద్ధరిల్లిపోవడానికి దారితీసిన భీమా కోరేగావ్‌ సంఘటనకు బాధ్యలెవరు? కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతి ఏటా జనవరి ఒకటవ తేదీన భీమా కోరేగావ్‌ స్థూపం వద్ద ప్రశాంతంగా జరిగే సైనిక సంస్మరణ కార్యక్రమం ఎందుకు ఉద్రిక్తతలకు దారితీసింది?  కాషాయ వస్త్రాలు, జెండాలు ధరించిన మరాఠా మూకలు దాడి చేశారంటూ నీలి రంగు జెండాలతో దేశం నలుమూలల నుంచి వచ్చిన దళితులు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? ఊరూరు నుంచి తరలి వచ్చింది దళితులేనని, ఒక్క ఊరి వారమైనా తాము పరిమిత సంఖ్యలో ఉండి దాడులకు ఎలా సాహసిస్తామని అంటున్న స్థానిక మరాఠాల మాటల్లో నిజమెంత?

మహారాష్ట్రలోని పుణె నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో భీమా నది ఒడ్డునున్న కోరేగావ్‌ గ్రామంలో నాటి నుంచి నేటి వరకు మరాఠాలు, పెషావర్లు, దళితులు ఎక్కువే. 200 సంవత్సరాల క్రితమ అగ్రవర్ణానికి చెందిన పెషావర్ల సైన్యాన్ని బ్రిటీష్‌ సైన్యంతో కలసి దళితులైన మహర్లు తరిమికొట్టారు. దళితులైనప్పటికీ నాటి బ్రిటీష్‌ ఇండియా ప్రభుత్వం వారిని తమ సైన్యంలో చేర్చుకొంది. (సాక్షి ప్రత్యేకం) అప్పటికే సామాజిక న్యాయం కోరుతున్న దళితులు తమకు ఉద్యోగం ఇచ్చిందన్న కతజ్ఞతతో, పెషావర్లపై నున్న ఆగ్రహంతో బ్రిటీష్‌ సైన్యంతో కలిసి యుద్ధం చేశారు. అందులో ప్రాణాలు కోల్పోయిన దళిత హీరోల స్మారకార్థం భీమా కోరేగావ్‌లో 1851లో స్థూపం వెలిసింది. 

కాషాయ జెండాలు కలిగిన హిందూ సంఘాలు తమపై దాడి చేశాయంటూ ఇటు దళితులు, నీలి జెండాలు కలిగిన దళితులే దాడులు చేశారంటూ మరాఠా, ఇతర హిందూ సంస్థల నాయకులు పరస్పరం ఆరోపిస్తున్నారు. సాక్ష్యాలు ఇవిగో అంటూ ఇరువర్గాల వారు వీడియో రికార్డింగ్‌లను చూపిస్తున్నారు. వాటిల్లో ఇరువర్గాలు రాళ్లు విసురుకోవడం, ఘర్షణ పడడం కనిపిస్తోంది. స్థానికంగా ఇరువర్గాల ఇళ్లు, దుకాణాలు తగులబడుతూ కనిపిస్తున్నాయి. పోలీసులకు ఇరువర్గాల వారు ఘర్షణ పడుతున్నారని చెబుతున్నారుగానీ, అసలు ఉద్రిక్తతలకు ఎవరు బాధ్యులన్న విషయాన్ని స్పష్టం చేయడం లేదు. 

మొత్తంగా అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తే ఈ ఉద్రిక్తలకు వారం రోజుల క్రితమే బీజాలు పడ్డాయని, వ్యూహం ప్రకారం గత వారం రోజులుగా ‘ఫేస్‌బుక్‌’లో జరుగుతున్న ప్రచారమే ఈ ఉద్రిక్తతలకు దారితీసిందని స్పష్టం అవుతోంది. కొంత మంది ఔత్సాహిక చరిత్రకారులు ఫేస్‌బుక్‌లో నడుపుతున్న ‘ఇతిహాస ఫాల్ఖుదా’ అనే మరాఠా పేజీ నేటి ఉద్రిక్తతలకు కారణమైంది. ‘భీమా కోరేగావ్‌’ చరిత్రతో దళితులైన మహర్లకు ఎలాంటి సంబంధం లేదని, భీమా కోరేగావ్‌ యుద్ధం కేవలం పెషావర్లకు, బ్రిటీష్‌ సైన్యానికి మధ్య జరిగినది మాత్రమేనని ఆ మరాఠా పేజీలో ఔత్సాహిక చరిత్రకారులు వాదించారు. ఆ యుద్ధం గురించి ప్రస్తావించిన బ్రిటిష్‌ డాక్యుమెంట్లను సాక్షంగా చూపారు. 

మహర్లు నిజంగా యుద్ధం చేసి ఉంటే బ్రిటిష్‌ డాక్యుమెంట్లలో వారి ప్రస్తావన ఉండేదని తర్కం తీసుకొచ్చారు. మహర్‌ రెజిమెంట్‌ ఏర్పాటు కాకముందే దాదాపు 500 మంది మహర్లు బ్రిటిష్‌ తరఫున పోరాటం చేశారని, (సాక్షి ప్రత్యేకం) అందుకు భారత చరిత్రలో సాక్ష్యాధారాలు ఉన్నాయని సావిత్రిభాయ్‌ ఫూలే పుణే యూనివర్శిటీలో చరిత్ర విభాగం ప్రొఫెసర్‌ శ్రద్ధా కుంభోజ్‌కర్‌ తెలిపారు. బ్రిటీష్‌ డాక్యుమెంట్లు తమ సైన్యం చేసిన యుద్ధాల గురించి చెబుతుందిగానీ, ఆ యుద్ధంలో మహర్లు పాల్గొన్నారా? మరొకరు పాల్గొన్నారా? అన్న విషయాన్ని ఎందుకు పేర్కొంటుందని ఆమె ప్రశ్నించారు. 

అగ్రవర్ణాలపై యుద్ధం చేయడానికి భీమా కోరేగావ్‌ దళితులకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని, అంతటి స్ఫూర్తినిచ్చిన యుద్ధంతో వారికి సంబంధం లేదంటూ చరిత్రకు మరోరూపం ఇచ్చేందుకు ఈ ఫేస్‌బుక్‌ పేజి ప్రయత్నించినట్లు అర్థం అవుతోందని ప్రొఫెసర్‌ వివరించారు. దేశంలో గత రెండు, మూడేళ్లుగా చరిత్రకు మరో భాష్యం చెప్పే ప్రయత్నాలు ఎక్కువగానే కొనసాగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్రో పెషావర్లు చేసిన అన్ని యుద్ధాలతోపాటు భీమా కోరేగావ్‌లో మహర్లతో పెషావర్లకు మధ్య జరిగిన యుద్ధం గురించి కూడా ‘మంత్రవేగ్ల’ పుస్తకంలో రచయిత ఎన్‌ఎస్‌ ఇనాంధర్‌ వివరించారు. (సాక్షి ప్రత్యేకం) ఫేస్‌బుక్‌ మరాఠా పేజీలో వారం, పది రోజుల నుంచి జరుగుతున్న చర్చను చదువుకున్న నేటి దళిత యువతలో కొంత మంది తీవ్రంగానే ఖండించారు. ఈసారి పెద్ద ఎత్తున స్మారక దినోత్సవం జరుపుకోవాలని కూడా దళిత సంఘాలు నిర్ణయించాయి. అందులో భాగంగా ఎక్కువ మంది దళితులు కోరేగావ్‌ తరలి వచ్చారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top