జీరో బడ్జెట్‌... ఖర్చు లేని సాగు

Costless cultivation with zero budget - Sakshi

ఈ దిశగా ‘సాగా’లన్న ఆర్థిక మంత్రి

సుభాష్‌ పాలేకర్‌ పద్ధతిపై ప్రత్యేక ప్రస్తావన

జీరో బడ్జెట్‌ వ్యవసాయం దిశగా దేశం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు పూర్వ పద్ధతుల వైపు మళ్లాల్సి ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. బడ్జెట్‌ ప్రసంగంలో దేశ వ్యవసాయ స్థితిగతులను ప్రస్తావిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఐక్య రాజ్య సమితికి చెందిన ఆహార – వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) పెట్టుబడులు, రసాయన ఎరువులు అవసరం లేని సహజ వ్యవసాయం చేపట్టాల్సిందిగా పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ తరహా సాగు పద్ధతి అమలు చేస్తున్నారని చెప్పారామె. వ్యవసాయవేత్త సుభాష్‌ పాలేకర్, రైతు సంఘాలు కలసి కర్ణాటకలో దీన్నో ఉద్యమంలా చేపట్టాయని, తర్వాత కొన్ని రాష్ట్రాలు ఈ పద్ధతిని అనుసరించాయని ఆమె తెలిపారు. ఇదివరకే ఈ పద్ధతిని అనుసరించాల్సిందిగా నీతి ఆయోగ్‌ రాష్ట్రాలకు సూచించటం గమనార్హం.

జీరో బడ్జెట్‌.. అంటే!!
సంక్షిప్తంగా చెప్పాలంటే ఖర్చు లేని వ్యవసాయమన్న మాట. విత్తనాలకు, ఎరువులకు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. మార్కెట్‌లో కొనుగోలు చేసి వాడాల్సినవి ఏమీ వుండవు. మట్టిలోని సూక్ష్మ జీవులు, వానపాములే మొక్కల పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి. విత్తనాలను కూడా రైతులే తమ పంట నుంచి తయారు చేసుకుంటారు. ఎరువులు చల్లే పని లేదు. ప్రకృతిలో దొరికే వాటితోనే భూమికి బలాన్నివ్వవచ్చు. అందుకే ఈ సాగు పద్ధతిలో ఖర్చులుండవు. కాబట్టే జీరో బడ్జెట్‌ ఫార్మింగ్‌గా పిలుస్తున్నారు. 

పాలేకర్‌ చెబుతున్నదేమిటి?
దేశీ ఆవు పేడ, మూత్రంతో భూసారం పెంచే ద్రావణాలు (బీజామృతం, జీవామృతం) తయారు చేసుకుని భూమికి తిరిగి జవసత్వాలను అందించడం, రసాయనిక అవశేషాలు లేని ఆహారాన్ని పండించుకోవడం పాలేకర్‌ పద్ధతిలోని ప్రత్యేకత. పొడి సున్నం, పొడి మట్టి, బెల్లం, బావి / బోరు / నది నీరును కూడా ఈ ద్రావణాల్లో కలుపుతుంటారు. ‘భూమి అన్ని పోషకాలున్న అన్నపూర్ణ. పోషకాలను మొక్కల వేళ్లు గ్రహించగలిగే రూపంలోకి మార్చేది సూక్ష్మ జీవరాశి. వాటిని పెంపొందించే జీవామృతం, ఘన జీవామృతం ఇచ్చి.. వీలైన పద్ధతిలో మల్చింగ్‌ చేస్తే చాలు’అంటారు పాలేకర్‌. పొలంలో పలు రకాల అంతర పంటలు వేయడం ద్వారా పంటల జీవ వైవిధ్యాన్ని పెంపెందుకునే వీలుండటం ఈ పద్ధతిలోని మరో ప్రత్యేకత. పండ్ల తోటల సాళ్ల మధ్య అడుగు లోతు కందకాలు తీయడం ద్వారా వాననీటి సంరక్షణ చేపట్టడం, ఆ విధంగా పంటను కరువు పరిస్థితులను తట్టుకునేలా చేయడం ఇంకో ప్రత్యేకత.

రైతాంగ ఆత్మహత్యల నివారిణి
ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 50 లక్షల మంది రైతులు అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల నుంచి విముక్తమయ్యారని పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌ గతంలో ‘సాక్షి సాగుబడి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నాణ్యమైన, పోషక – ఔషధ విలువలతో కూడిన సహజాహారం పండించే రైతులు తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించుకొని, నేరుగా వినియోగదారులకు అమ్మితే వ్యవసాయ సంక్షోభం పరిష్కారమవుతుందని సూచించారు. కేంద్రం ఇప్పుడు దానికే మొగ్గుచూపుతున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రసంగం చెబుతోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top