దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పుడైనా మారేనా!? | Companies To Invest More After Corporate Tax Cut | Sakshi
Sakshi News home page

దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పుడైనా మారేనా!?

Sep 26 2019 4:58 PM | Updated on Sep 26 2019 5:12 PM

Companies To Invest More After Corporate Tax Cut - Sakshi

అలాంటి సూచనలు సుదూరంగా కూడా కనిపించడం లేదు. ఎందుకు? లోపం ఎక్కడ?

సాక్షి, న్యూఢిల్లీ : నానాటికి కునారిల్లుతున్న దేశ ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించేందుకు కార్పొరేట్‌ పన్నును గణనీయంగా తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో దేశంలో స్టాక్‌ మార్కెట్‌ ఎన్నడు లేనంతగా రోదసివైపు దూసుకెళ్లిన విషయం తెల్సిందే. ఆమె తీసుకున్న నిర్ణయం సముచితమని, తద్వారా దేశంలో కార్పొరేట్‌ పెట్టుబడులు భారీగా పెరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆయన ప్రభుత్వంలోని ప్రభువులంతా ప్రశంసలు కూడా కురిపించారు. అలాంటి పరిస్థితే ఉంటే ఇప్పటికే పలు కార్పొరేట్‌ వర్గాల నుంచి సూచనలు అందేవి. అలాంటి సూచనలు సుదూరంగా కూడా కనిపించడం లేదు. ఎందుకు? లోపం ఎక్కడ?

నిర్మలా సీతారామన్‌ ఈ నెల 20వ తేదీన కార్పొరేట్‌ పన్నును 35 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. ఇతర రాయతీలేవీ తీసుకొని కార్పొరేట్‌ కంపెనీలు 22 శాతం పన్నును మాత్రమే చెల్లిస్తే చాలు. ఈ నిర్ణయం వల్ల ఏడాదికి భారత ఖజానాకు 1.45 లక్షల కోట్ల రెవెన్యూ తగ్గిపోయింది. దీని వల్ల ద్రవ్యలోటు మరింతగా పెరుగుతుంది. ముమ్మాటికి ఆర్థిక ద్రవ్యలోటును 3.3 శాతానికి మించనివ్వమంటూ మోదీ ప్రభుత్వం పదేళ్లుగా ప్రామిస్‌ చేస్తూ వచ్చినా అది నేటికి నాలుగు శాతానికి చేరుకుంది. జాతీయ స్థూల ఆదాయం (జీడీపీ) వృద్ధి రేటును రెండంకెలకు తీసుకెళతామని మొదటిసారి అధికారంలోకి వచ్చిన కొత్తలో వాగ్దానం చేసిన మోదీ ప్రభుత్వం నేటికి ఆ వాగ్దానాన్ని తీర్చలే కపోగా ఉన్న వృద్ధిరేటును కూడా నిలబెట్టుకోలేక పోయింది. దేశ జీడీపీ రేటు గత త్రైమాసికంలో ఐదు శాతానికి పడిపోవడంతో పరువు పోతున్నట్లు భావించింది.

ద్రవ్యలోటు విషయంలో ఇచ్చిన మాటను తప్పినా సరేగానీ వృద్ధి రేటు విషయంలో పోతున్న పరువును పరిరక్షించుకోవడం కోసం కార్పొరేట్‌ పన్నును తగ్గించింది. పన్ను రేటు తక్కువగా ఉందని, కొత్త కంపెనీలు ఆశించినంతగా ముందుకు రాకపోయిన పన్ను తగ్గింపు వల్ల లాభ పడిన ప్రస్తుత కంపెనీలు అదనపు పెట్టుబడులకు ముందుకు వస్తాయన్నదే ప్రభుత్వం నిర్ణయం వెనక అసలు లక్ష్యం. అదే జరిగితే ద్రవ్యలోటు తగ్గుతుందీ, వృద్ధి రేటూ పెరుగుతుంది. ప్రస్తుత కార్పొరేట్‌ కంపెనీలు అదనపు పెట్టుబడులు పెట్టకపోయినా, పన్ను మనిహాయింపు వల్ల మిగిలిన సొమ్మునైనా తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు.

ఆటోమొబైల్‌ రంగం నుంచి ఉక్కు, సిమ్మెంట్‌ రంగం వరకు వృద్ధి రేటు ఘోరంగా పడిపోయిన నేపథ్యంలో పలు కంపెనీలు వారం చొప్పున ‘లే ఆఫ్‌’లు ప్రకటిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో పన్ను తగ్గింపు వల్ల వచ్చిన ఊరటకు ఊపిరి పీల్చుకుంటాయే తప్ప, కొత్తగా పెట్టుబడులకు ముందుకు రావు. దేశంలోని వినియోగదారుల కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. వారి కొనుగోలు శక్తి పెరిగితేగాని ఈ కంపెనీలు అదనపు పెట్టుబడులకు ముందుకు రావు. దేశంలో నిరుద్యోగ సమస్య 48 ఏళ్ల గరిష్టానికి చేరకున్న పరిస్థితుల్లో వినియోగదారుల కొనుగోలు శక్తి పెంచడం అంత ఈజీ కాదు. వాస్తవానికి దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యలోటును తగ్గించుకోవాలంటే కార్పొరేటు పన్నులను తగ్గించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకొని కార్పొరేట్‌ పన్నులను పెంచితే చాలు. విలాసాల విషయంలో కార్పొరేట్‌ యజమానులతో నేటి రాజకీయ వేత్తలు పోటీ పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునే అవకాశం లేదు.

కార్పొరేట్‌ రంగం నుంచి అదనపు పెట్టుబడులు రావడం వల్ల నిరుద్యోగ సమస్య తగ్గుతుంది అంటే, కొత్తవారికి ఉద్యోగాలు వస్తాయి. వారు కూడా తోడవుతారు కనుక వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుందని సిద్ధాంతం. మూల సిద్ధాంతాన్ని గుడ్డిగా పాటించడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. (చదవండి: భారత ఆర్థిక వ్యవస్థపై ‘సహస్రాబ్ది జోక్‌’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement