
మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి జవదేకర్‌తో డిప్యూటీ సీఎం కడియం. చిత్రంలో ఎంపీ మల్లారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఈ ఏడాది నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బాలికా విద్యపై పలు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో ఏర్పాటైన సబ్ కమిటీ దేశంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు, బాల్య వివాహాలను అరికట్టేందుకు, పాఠశాలల్లో బాలికల చేరిక సంఖ్యను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సిఫార్సులు చేసింది. అందులో ప్రధానమైన కేజీబీవీల్లో 12వ తరగతి వరకు విద్యను అందించడానికి కేంద్రం అంగీకరించింది.
బాలికా విద్యపై సబ్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను ఢిల్లీలో కలసి సిఫార్సుల అమలుపై చర్చించారు. కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జవదేకర్ హామీ ఇచ్చినట్టు కడియం మీడియాకు తెలిపారు. ఈ ఏడాది నుంచే కేజీబీవీల్లో 12వ తరగతి వరకు విద్యనందించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కేజీబీవీల్లో 8వ తరగతి వరకే కేంద్రం ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. 9, 10వ తరగతులకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. 8వ తరగతి వరకు కల్పిస్తున్న మధ్యాహ్న భోజనం సౌకర్యాన్ని 12వ తరగతి వరకు కల్పించాలని కోరామని, యూనిఫాంలను అందించాల ని విజ్ఞప్తి చేశామని కడియం తెలిపారు. ప్రస్తుతం 12వ తరగతి వరకు విద్యనందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, మధ్యాహ్న భోజనం, యూనిఫాం సౌకర్యాల కల్పనను పరిశీలిస్తామని జవదేకర్ హామీ ఇచ్చారన్నారు.
హైదరాబాద్‌కు ఐఐఎం!
వచ్చే విద్యా సంవత్సరం హైదరాబాద్‌లో ఐఐఎం ప్రారంభానికి జవదేకర్ సానుకూలంగా స్పందించినట్టు కడియం తెలిపారు. హైదరాబాద్ నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఐఐఎం మంజూరు చేయాలని కోరామని, ఈ ఏడాది ప్రకటించే ఐఐఎంల్లో తప్పుకుండా ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని జవదేకర్ హామీ ఇచ్చారన్నారు. బాలికా విద్యకు పెద్దపీట వేస్తున్న తెలంగాణలో మహిళా వర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సాయం చేయాలని, తెలంగాణకు ఒక ట్రిపుల్ ఐటీని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.