ఎవరీ చో.. ఏమిటా తుగ్లక్? | cho ramaswamy, a keen critic of jayalalithaa passes away | Sakshi
Sakshi News home page

ఎవరీ చో.. ఏమిటా తుగ్లక్?

Dec 7 2016 8:02 AM | Updated on Sep 4 2017 10:09 PM

ఎవరీ చో.. ఏమిటా తుగ్లక్?

ఎవరీ చో.. ఏమిటా తుగ్లక్?

సినిమా నటుడు, సినిమా స్క్రిప్టు రచయిత, న్యాయవాది, నాటక రచయిత, పత్రికా రచయిత... ఇలా చెప్పుకొంటూ పోతే చో రామస్వామి గురించి బోలెడన్ని అంశాలున్నాయి.

సినిమా నటుడు, సినిమా స్క్రిప్టు రచయిత, న్యాయవాది, నాటక రచయిత, పత్రికా రచయిత... ఇలా చెప్పుకొంటూ పోతే చో రామస్వామి గురించి బోలెడన్ని అంశాలున్నాయి. ఎప్పుడూ నున్నగా గీసిన గుండు, పెద్ద కళ్లజోడు, నుదుటన విభూది బొట్టు.. ఇదీ ఆయన స్వరూపం. 1934 అక్టోబర్ 5వ తేదీన జన్మించిన ఈయన.. 'తుగ్లక్' అనే పత్రికను స్థాపించడంతో దాని సంపాదకుడిగానే ఎక్కువ ప్రసిద్ధి చెందారు. మహ్మద్ బిన్ తుగ్లక్ పేరును ఆయన రాజకీయ వ్యంగ్యాస్త్రంగానే ఉపయోగించారు గానీ.. దానికి, చో రామస్వామికి మధ్య విడదీయలేని బంధం ఉంది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మీద విమర్శ కోసం రాసిన మహ్మద్ బిన్ తుగ్లక్ నాటకాన్ని తొలిసారి 1968లో.. ఆ తర్వాత దాదాపు రెండు వేల సార్లు ఆయన ప్రదర్శించారు. అది ఇప్పటి కాలమాన పరిస్థితులకు కూడా సరిపోతుందని అందరూ అంటారు. నాటకం బాగా విజయవంతం కావడం, అది ఒక బ్రాండ్‌గా స్థిరపడటంతో 1970లో తుగ్లక్ పత్రికను ఆయన స్థాపించారు. పత్రిక ముఖ చిత్రం మీద ఎప్పుడూ రాజకీయ కార్టూన్లే ఉంటాయి. 
 
చో రామస్వామి 12 నాటకాలు రాశారు, 57 సినిమాల్లో నటించారు, 37 సినిమాలకు స్క్రీన్‌ప్లే అందించారు. ఆయన మాటలు సూటిగా, వాడిగా ఉంటాయి. జయలలితను నిశితంగా విమర్శించే ఈయన.. ఆమెకు మంచి సలహాదారు. నిజానికి జయలలిత ఎవరి మాటలు వినరు, ఎవరి సలహా తీసుకోరు. కానీ, ఒక్క చో రామస్వామి సలహాలు మాత్రం తీసుకుంటారు. అసలు ఆమెకన్నా ముఖ్యమంత్రి పదవికి రజనీకాంత్ సరైన వ్యక్తన్నది ఆయన అభిప్రాయం. జయలలిత అవినీతిని కూడా ఆయన ఎండగట్టారు. అయినా ఆయన మాటలంటే 'అమ్మ'కు ఎక్కడలేని గురి. ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలుకొట్టి మాట్లాడటం, నిజాలు నిష్కర్షగా చెప్పడం వల్లే ఆయన అంటే జయలలితకు నమ్మకం అంటారు. 
 
ప్రముఖ సినీనటి రమ్యకృష్ణకు స్వయానా పెదనాన్న అయిన చో రామస్వామి.. రిజర్వేషన్లకు బద్ధ వ్యతిరేకి. రాజకీయాల్లో ఆయన ఎవరికి మద్దతిస్తారంటే చెప్పడం కష్టమే గానీ, ఎవరిని వ్యతిరేకిస్తారంటే.. కమ్యూనిస్టులను అని గట్టిగా చెప్పొచ్చు. అటు తుగ్లక్ పత్రికతోను, ఇటు ప్రత్యక్షంగా కూడా నిశిత రాజకీయ విమర్శలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే చో రామస్వామి.. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, జయలలిత మరణించిన మూడోరోజే మరణించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement