ఇక అటవి భూములను అడ్డంగా కొనుక్కోవచ్చు.!?

Centre Seeks To Change Forest Policy To Promote Industrial Plantations - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మనం తినే తిండీ, తాగే నీరు, పడుకునే మంచం, కూర్చునే సోఫా....ఇలా అన్నీ కార్పొరేట్‌ పరమవుతున్న నేటి పరిస్థితుల్లో చివరకు మనం పీల్చే గాలి కూడా కార్పొరేట్‌ పరం కాబోతోంది. ఎందుకంటే, మానవులు పీల్చే ఆక్సిజన్‌ను అమితంగా అందిస్తూ పర్యావరణ పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అడవులు కార్పొరేట్‌ రంగం కబంధ హస్తాల్లోకి పోనున్నాయి. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త ‘జాతీయ అటవి విధానం’ పేరిట ఓ ముసాయిదా బిల్లును రూపొందించింది. 

దీనిపై ప్రజాభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా బిల్లు ప్రతిని కేంద్ర అడవులు, పర్యావరణం, వాతావరణ మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఈ బిల్లు ముసాయిదాపైనా ప్రజలు, నిపుణులు తమ అభ్యంతరాలను ఏప్రిల్‌ 14వ తేదీలోగా తెలపాల్సిందిగా కూడా కోరింది. ఇంతవరకు మీడియా ప్రతినిధులు వ్యక్తం చేసిన సందేహాలకు మాత్రం సదరు మంత్రిత్వ శాఖ నుంచిగానీ, కేంద్ర ప్రభుత్వం నుంచిగానీ ఎలాంటి సమాధానాలు రాలేదు. వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. ముసాయిదా బిల్లును యథాతధంగా అమలు చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం కనిపిస్తోంది. వాస్తవానికి 2015 సంవత్సరంలోనే దేశంలోని అడవులను కార్పొరేట్‌ రంగానికి ధారాదత్తం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించింది. అందుకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరింది. 

ఈ మార్గదర్శకాలు అమల్లోకి రాకుండా 1988లో పార్లమెంట్‌ ఆమోదించిన ‘జాతీయ అటవి విధానం’ అడ్డుపడింది. 1988 నాటి విధానంలో పేర్కొన్న మార్గదర్శకాలకు బీజేపీ రూపొందించిన మార్గదర్శకాలు పూర్తి భిన్నంగా ఉండడంతో ప్రభుత్వ అటవి భూములను ప్రైవేటు కార్పొరేట్‌ రంగానికి అప్పగించాలంటే కొత్త బిల్లు తీసుకరావడం తప్పనిసరి అయింది. అందుకనే ఇప్పుడు ఈ కొత్త బిల్లు ముసాయిదా ప్రజల ముందుకు వచ్చింది. 

అడవుల పరిరక్షణ, నిర్వహణ, అడవుల వినియోగానికి సంబంధించిన సమస్త చట్టాలు జాతీయ అటవి విధానం పరిధిలోకే వస్తాయి. ఇక్కడ అడవుల వినియోగం అంటే అడవుల నుంచి కలపను ఎంత ఉపయోగించుకోవాలి ? ఎలా ఉపయోగించుకోవాలి ? అడవులపై ఆధారపడి బతుకుతున్న గిరిజనుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తదితర అంశాలన్నీ వస్తాయి. అడవులను ప్రైవేట్‌పరం చేయాలని, వాటికి కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఎప్పటి నుంచో ఒత్తిళ్లు వస్తున్నాయి. మొదటి సారి 1998లో, రెండోసారి 2008లో గట్టిగా కేంద్ర ప్రభుత్వం ముందుకు ఈ ప్రతిపాదనలు రాగా, వాటిని అప్పటి ప్రభుత్వాలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాయి. లాభాపేక్ష కలిగిన కార్పొరేట్‌ సంస్థలు సహజసిద్ధంగా పెంచే చెట్లకన్నా కొట్టేసే చెట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్న భయంతోనే నాటి ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలను పక్కన పడేశాయి. ఈ దేశంలో ఏ అభివృద్ధి అయినా ప్రభుత్వ సంస్థలకన్నా కార్పొరేట్‌ సంస్థల వల్లనే అవుతుందని భావించే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అందుకు శ్రీకారం చుట్టింది. అటవులపై ఆదివాసీలయిన ట్రైబల్స్‌కు మరిన్ని హక్కులు కల్పిస్తూ 2006లోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం కొత్తగా అటవి హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది. 

జాతీయ అటవి విధానాన్ని ఎందుకు సవరించాలంటే: కేంద్రం
1988 రూపొందించిన అటవి విధానానికి నేటికి పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. సహజ అడవుల ఉత్పత్తులు గుణాత్మకంగానే కాకుండా పరిణామాత్మకంగా బాగా తగ్గిపోయాయి. వాతావరణ మార్పుల ప్రభావం పెరిగింది. మానవులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణ పెరిగింది. నీటి కొరత పెరిగింది. ముఖ్యంగా ఈ అటవి రంగంపై పెట్టుబడులు భారీగా తగ్గుతూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ అటవి విధానాన్ని సవరించి, కార్పొరేట్‌ రంగానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. ఈ పరిస్థితిని ఎప్పుడో గుర్తించిన గత కేంద్ర ప్రభుత్వాలు అడవుల అభివద్ధికి మార్గదర్శకాలను విడుదల చేశాయి. కానీ వాటిని సంక్రమంగా అమలు చేయలేకపోయాయి. 

డీగ్రేడెడ్‌ అడవులనే...
అడవులను కార్పొరేట్‌ రంగానికి అప్పగించాల్సి వస్తే దేశంలోని ‘డీగ్రేడ్‌’ అడవులనే ఇవ్వాలంటూ గత ప్రభుత్వాలకు నిపుణులు సూచించారు. అయితే అవికూడా తక్కువేమీ లేవు. దేశంలో 3.40 కోట్ల హెక్టార్లు డీగ్రేడ్‌ అడవులు ఉన్నాయి. ఫారెస్ట్‌ కనోపీ (చెట్ల పైభాగంలో దట్టంగా గుబురుగా ఉండే కొమ్మలు) 40 శాతం కన్నా తక్కువగా ఉన్న అడవులను డీగ్రేడెడ్‌ ఫారెస్ట్‌గా గుర్తిస్తున్నారు. పది శాతం ఫారెస్ట్‌ కనోపి కలిగిన అటవి భూములతో మొదలుపెట్టి 40 శాతం ఫారెస్ట్‌ కనోపి కలిగిన అటవి భూములను కార్పొరేట్‌ రంగానికి బిడ్డింగ్‌ రేట్‌పై ఇవ్వాలని నిర్ణయించినట్లు 2015లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్గదర్శదర్శకాల్లో ఉంది. కానీ నేటి జాతీయ ముసాయిదా బిల్లులో ఆ స్పష్టత కనిపించడం లేదు. 

సహజ అడవులు, ప్రభుత్వ నియంత్రణ అడవులు, ప్రైవేటు ప్లాంటేషన్లను కలుసుకొని మొత్తం దేశంలోని అడవుల్లో ఈ డీగ్రేడెడ్‌ అడవులు 40 శాతం వరకున్నాయి. ఆగ్రో ఫారెస్ట్‌ అడవులు కూడా వీటి పరిధిలోకే వస్తాయి. రైతులు వ్యవసాయం చేసుకుంటూనే పొలాల చుట్టూ చెట్లను పెంచడాన్ని ఆగ్రోఫారెస్ట్‌ అని అంటాం. దేశవ్యాప్తంతా ఆగ్రోఫారెస్ట్‌పై ఆధారపడి బతుకుతున్న రైతులు దాదాపు రెండున్నర కోట్ల మంది ఉన్నారు.

ఇక అడవులపై ప్రత్యంగానూ, పరోక్షంగానూ ఆధారపడి బతుకుతున్న ట్రైబల్స్‌ దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది ఉన్నారు. అడవులను కార్పొరేట్‌పరం చేస్తే వారంతా ఏమవుతారు? వారికి ఎలా పునరావాసం కల్పిస్తారు? వారు కూలీలవుతారా? కర్షకులవుతారా? ఇలాంటి మీడియా ప్రశ్నలకే ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదు. అడవులను ప్రవేటుపరం చేస్తే అడవిబిడ్డలు ఆగమ అవుతారని, వారి జీవితాలు ఆగమాగవుతాయని ట్రైబల్స్‌ హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top