
వెనుకబడిన జిల్లాలకు శరాఘాతం
వెనుకబడిన జిల్లాలకు చేయూతనిచ్చేందుకు ఇన్నాళ్లూ పెద్ద దిక్కుగా ఉన్న బీఆర్‌జీఎఫ్(వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్) పథకం నుంచి వైదొలగుతున్నట్టు తాజా బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది.
సాక్షి, న్యూఢిల్లీ: వెనుకబడిన జిల్లాలకు చేయూతనిచ్చేందుకు ఇన్నాళ్లూ పెద్ద దిక్కుగా ఉన్న బీఆర్‌జీఎఫ్(వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్) పథకం నుంచి వైదొలగుతున్నట్టు తాజా బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. ఇకపై ఈ పథకం ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రాలకు సాయం అందదు. మొత్తం 8 కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి వైదొలగుతున్నట్టు తెలిపిన కేంద్రం, వాటిని రాష్ట్రాలు కొనసాగించుకోవచ్చంది.
నేషనల్ ఈ-గవర్నెన్స్ ప్లాన్, బ్యాక్‌వర్డ్ రీజియన్స్ గ్రాంట్ ఫండ్, పోలీసు బలగాల ఆధునీకరణ, రాజీవ్‌గాంధీ పంచాయతీ సశక్తీకరణ్ అభియాన్, ఎక్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసే పథకం, 6 వేల మోడల్ స్కూళ్ల నిర్మాణం పథకం, ఫుడ్ ప్రాసెసింగ్ జాతీయ మిషన్, పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి పథకాల నుంచి వైదొలగుతున్నట్టు పేర్కొంది. మరో 31 కేంద్ర పథకాలను యథాతథంగా, మరో 24 కేంద్ర పథకాల్లో కేంద్ర, రాష్ట్రాల వాటాలను మార్చుతూ కొనసాగిస్తున్నట్టు తెలిపింది. బీఆర్‌జీఎఫ్, మోడల్ స్కూళ్ల నిర్మాణ పథకాలు రద్దవడం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు తీవ్ర నిరాశ మిగల్చనుంది.
తెలంగాణ 9 జిల్లాల్లో...
బీఆర్‌జీఎఫ్ పథకం తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో అమలవుతోంది. వాటికి 2014-15లో దాదాపు రూ.285 కోట్లు కేంద్ర సాయంగా అందింది. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, విజయనగరం జిల్లాలకు రూ.132 కోట్లు అందింది.
మో‘డల్’ స్కూళ్లు..
దేశవ్యాప్తంగా 6 వేల మోడల్ స్కూళ్లు నిర్మించ తలపెట్టిన కేంద్రం.. ఒక్కసారిగా ఈ పథకం నుంచి వైదొలిగింది. ఉమ్మడి ఏపీలో తొలివిడతలో 355 ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లలో చాలావరకు తాత్కాలిక భవనాల్లో నడుస్తున్నాయి. గ్రామీణ నిరుపేదలకు ఆంగ్ల మాధ్యమంలో విద్యనందిస్తున్న ఈ పథకం రద్దవడంతో ఇకపై ఈ పాఠశాలల నిర్వహణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది!