
తిరువల్లూరు: గూడు లేదు, కూడు లేదు.. పని లేదు, పైసా లేదు. లాక్‌డౌన్‌తో అనేక కష్టనష్టాలనుభవిస్తున్నారు వలస కార్మికులు. బతుకుదెరువు కోసం వలస వచ్చిన నగరం నుంచి కన్నీళ్ల వీడ్కోలు తీసుకుంటూ స్వస్థలాలకు బయలు దేరుతున్నారు. ఈ క్రమంలో ఓ ఇసుక బట్టీలో పనిచేసే కూలీలు తమను స్వస్థలాలకు పంపించాలని కోరినందుకు వారిని గొడ్డును బాదినట్టు బాదారు. ఈ అమానుష ఘటన సోమవారం తమిళనాడులో చోటు చేసుకుంది. తిరువల్లూరులోని పుదుక్కాపంలో ఓ ఇటుక బట్టీలో సుమారు 400 మంది వలస కార్మికులు పని చేస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల తాము స్వస్థలాలకు వెళ్లిపోతామని యజమానిని పలుమార్లు అభ్యర్థించారు. వారి అభ్యర్థనకు ఆయన అంగీకరించలేదు. దీంతో కార్మికులు వాగ్వాదానికి దిగగా యజమాని తన అనుచరులతో వారిపై దాడి చేయించాడు. (మన (కరోనా) మహాభారతంలో నెత్తురోడిన పాదాలు)
ఈ దాడిలో ఇద్దరు కూలీలు ఆసుపత్రి పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కాగా ప్రాథమిక విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వలస కార్మికులకు నిత్యావసరాలు సరికదా; కనీసం మంచినీళ్లు కూడా అందించలేదని తేలింది. దీని గురించి మనస్వ అనే కూలీ మాట్లాడుతూ.. "ఐదు రోజులుగా మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదు. అలాంటప్పుడు ఇక్కడెలా ఉండేది? పైగా మమ్మల్నే కాకుండా మా పిల్లల్ని కూడా కొడుతున్నారు. దయచేసి మమ్మల్ని తిరిగి పంపించేయండి" అని కన్నీళ్లతో చేతులెత్తి వేడుకుంది. వీరిని దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేసిన ఇటుక బట్టీ యయజమానుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. (మనమే మాయం చేశాం..సిగ్గుతో తలదించుకోవాలి!)