ప్రజల్లో విద్వేషాల్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావడమే బీజీపీ ఎజెండా అని కాంగ్రెస్ మండిపడింది.
న్యూఢిల్లీ: ప్రజల్లో విద్వేషాల్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావడమే బీజీపీ ఎజెండా అని కాంగ్రెస్ మండిపడింది. ప్రజల్లో ఉన్న సమైక్యతను దెబ్బతీయటమే వారి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ చేపట్టనున్న యాత్రను ఉద్దేశించి మాట్లాడారు. బీజీపీ కార్యాచరణ కొత్తగా ఏమీలేదని, వారే చేసే యాత్ర కూడా ఆశ్చర్యానికి గురి చేయలేదని దిగ్విజయ్ తెలిపారు. వారి ప్రధాన ఎజెండా మాత్రం విద్వేషాలని రెచ్చగొట్టడమే అని పేర్కొన్నారు.
కాగా, అయోధ్యలో విశ్వహిందూపరిషత్ తలపెట్టిన యాత్ర ప్రారంభానికి ముందే ప్రకంపనలు రేపుతోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించినప్పటికీ యాత్ర చేపట్టి తీరాలని వీహెచ్‌పీ నిర్ణయించింది. యాత్రకు యూపీ సర్కారు అనుమతి ఇవ్వకపోవడంపై బీజేపీ, వీహెచ్‌పీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం మతస్వేచ్చను అడ్డుకుంటోందని వీహెచ్‌పీ నాయకుడు అశోక్ సింఘాలు విమర్శించారు. పోలీసు బలంతో యాత్రను ఆపాలనుకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ నెల 25 నుంచి దాదాపు 20 రోజులు కొనసాగే ఈ యాత్రకు అనుమతి ఇవ్వాలని వీహెచ్‌పీ నేతలు.. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్, సమాజ్‌వాదీ చీఫ్ ములాయంసింగ్‌యాదవ్‌లను కలిసి విజ్ఞప్తి చేశారు. ఐతే శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని, అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలే శిరోధార్యమని ములాయం స్పష్టం చేశారు.