కల నెరవేరింది! 

BJP fulfills Shyamaprasad Mukherjee wish - Sakshi

జమ్మూకశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు ద్వారా పార్టీ సిద్ధాంతకర్త శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ఆశయాన్ని బీజేపీ నెరవేర్చింది. ‘ఒకే దేశానికి రెండు రాజ్యాంగాలు ఉండవు. ఇద్దరు ప్రధానులు ఉండరు. రెండు జాతీయ చిహ్నాలు ఉండవు’అంటూ ఆయన 1950లలోనే  నెహ్రూ ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కశ్మీర్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో ఆయన్ను 1953 మే 11వ తేదీన అరెస్టు చేశారు. అప్పట్లో ఆ కశ్మీర్‌లోకి ప్రవేశించాలంటే భారతీయులు గుర్తింపుకార్డు చూపించాల్సి ఉండేది. శ్రీనగర్‌లో జైల్లోనే ఆయన అదే ఏడాది జూన్‌ 23వ తేదీన అనుమానాస్పద రీతితో కన్నుమూశారు. కలకత్తా వర్సిటీకి పిన్నవయస్సులోనే వీసీ అయిన డాక్టర్‌ ముఖర్జీ 1929లో భారత జాతీయ కాంగ్రెస్‌ తరఫున బెంగాల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు.

నెహ్రూ తొలి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌ను వదిలి, భారతీయ జన్‌సంఘ్‌ను 1951లో స్థాపించారు. ఇదే బీజేపీకి మాతృసంస్థ. 1952 జూన్‌ 26వ తేదీన పార్లమెంట్‌లో ప్రసంగించిన ముఖర్జీ.. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడంపై నెహ్రూను గట్టిగా నిలదీశారు. ఇలాంటి విధానాలు దేశాన్ని ముక్కలుగా చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖర్జీ మరణాన్ని బీజేపీ మరి చిపోలేకపోయింది. 2004లో మాజీ ప్రధాని వాజ్‌పేయి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ కశ్మీర్‌లోకి ప్రవేశించటానికి ముందుగా పంజాబ్‌లోనే పోలీసులు అరెస్టు చేశారని భావించాం. కానీ, అలా జరగలేదు. కశ్మీర్‌ ప్రభుత్వం, నెహ్రూ కుట్రపన్ని కశ్మీర్‌లోకి అనుమతించిన ముఖర్జీని, తిరిగి వెళ్లకుండా చేశారు. జమ్మూకశ్మీర్‌లోని షేక్‌ అబ్దుల్లా ప్రభుత్వం ఈ కుట్రను అమలు చేసింది’అని పేర్కొనడం గమనార్హం.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top