
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో టూరిజం రంగానికి భారీ నష్టం..
గౌహతి : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనలతో అసోంలో టూరిజం పరిశ్రమకు రూ 1000 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. డిసెంబర్‌లో టూరిజం రంగం బాగా దెబ్బతిందని, జనవరిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని అసోం టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జయంత మల్లా బరూ తెలిపారు. దేశీయ పర్యాటకులతో పాటు విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పడిపోయిందని చెప్పారు.
నిరసనల నేపథ్యంలో భారత్ పర‍్యటనకు వెళ్లరాదని పలు దేశాలు తమ టూరిస్టులకు సూచనలు జారీ చేయడంతో పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం పడిందని అన్నారు. అసోంలో పర్యాటక సీజన్ డిసెంబర్ నుంచి మార్చి వరకూ ఉంటుందని, హింసాత్మక నిరసనలతో డిసెంబర్, జనవరి మాసాల్లో నష్టం రూ 1000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నామని చెప్పుకొచ్చారు. సీజన్‌లో నిరసనలు తలెత్తడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పర్యాటకుల సంఖ్య 30 శాతం వరకూ పడిపోతుందని భావిస్తున్నామని అన్నారు.