పీవోకే మనదే..!

Amit Shah Emotional speech in the Lok Sabha - Sakshi

లోక్‌సభలో ఉద్వేగంతో సుదీర్ఘంగా ప్రసంగించిన అమిత్‌ షా

‘370’ రద్దుకు పార్లమెంటు ఆమోదం

తీర్మానం, పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించిన లోక్‌సభ

కశ్మీర్‌ వేర్పాటు వాదులతో చర్చించేది లేదన్న హోంమంత్రి

న్యూఢిల్లీ: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే), చైనా ఆక్రమణలో ఉన్న ఆక్సాయ్‌చిన్‌లు కూడా భారత్‌లో అంతర్భాగమేనని హోం మంత్రి అమిత్‌ షా మంగళవారం లోక్‌సభలో చెప్పారు. కశ్మీర్‌లో శాంతి కోసం తమ ప్రభుత్వం ప్రజలతో చర్చిస్తుందనీ, అంతేకానీ వేర్పాటువాద సంస్థ అయిన హురియత్‌ కాన్ఫరెన్స్‌తో చర్చలేమీ ఉండవని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్‌ను పాకిస్తాన్‌ ఆక్రమించినప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోకుండా, నాడే భారత సైనికులకు స్వేచ్ఛ ఇచ్చి ఉంటే ఈరోజు పీవోకే కూడా సంపూర్ణంగా భారత్‌లో అంతర్భాగంగా ఉండేదని అమిత్‌ షా పేర్కొన్నారు.

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించేందుకు రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసే తీర్మానాన్ని, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టే బిల్లును ఆయన మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది. బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు, ఆ తర్వాత చర్చ సమయంలోనూ అమిత్‌ షా ఎంతో ఆవేశంగా, ఉద్వేగంతో సుదీర్ఘ సమయంపాటు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతుండగా, ప్రతిపక్షాలు వాగ్వాదానికి దిగగా, గట్టిగా బదులిచ్చారు. కాగా, తీర్మానం, బిల్లు రాజ్యసభలో సోమవారమే పాస్‌ అవ్వడంతో వీటికి సోమవారం పార్లమెంటు ఆమోదం లభించనట్లైంది. చర్చ అనంతరం తీర్మానం ఆమోదంపై ఓటింగ్‌ నిర్వహించగా, అనుకూలంగా 351 ఓట్లు, వ్యతిరేకంగా 72 ఓట్లు పడ్డాయి.

ఒక సభ్యుడు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అలాగే జమ్మూ కశ్మీర్‌ను విడగొట్టి, లదాఖ్‌ను అసెంబ్లీ రహిత కేంద్ర పాలిత ప్రాంతంగా, జమ్మూ కశ్మీర్‌ను అసెంబ్లీ సహిత కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు తీసుకొచ్చిన ‘జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019’పై కూడా ఓటింగ్‌ నిర్వహించగా, 370 ఓట్లు అనుకూలంగా, 70 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల బిల్లును మాత్రం లోక్‌సభ నుంచి అమిత్‌ షా వెనక్కు తీసుకుంటూ, ఈ రిజర్వేషన్లు కేంద్రపాలిత ప్రాంతాల్లో వాటంతట అవే అమలవుతాయని అన్నారు. రాజ్యసభ నుంచి కూడా బిల్లును వెనక్కు తీసుకుంటామన్నారు. తీర్మానం, బిల్లును లోక్‌సభ ఆమోదించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా సభలోనే ఉన్నారు.

బిల్లుపై ఓటింగ్‌ జరపడానికి కొద్దిసేపటి ముందు.. ములాయం సింగ్‌ యాదవ్‌ మినహా మిగిలిన ఎస్పీ సభ్యులు, ఎన్సీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌తోపాటు ఎన్డీయేలో భాగమైన జేడీ(యూ)కూడా సభ నుంచి బయటకు వెళ్లిపోయింది. కొందరు కాంగ్రెస్‌ సభ్యులతోపాటు మజ్లిస్‌ పార్టీ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా ఓటింగ్‌కు పట్టుబట్టారు. దీంతో సభలో ఓటింగ్‌ నిర్వహించగా, వైఎస్సార్‌ కాంగ్రెస్, బీజేడీ, టీఆర్‌ఎస్, బీఎస్పీ, అన్నా డీఎంకే తదితర పార్టీలు అనుకూలంగా ఓటు వేశాయి. తీర్మానం, బిల్లు ఆమోదం పొందిన అనంతరం లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. అమిత్‌ షా ప్రసంగం వివరాలు.. 

పీవోకే, ఆక్సాయ్‌చిన్‌లు భారత్‌లో భాగమే.. 
‘పీవోకే, ఆక్సాయ్‌చిన్‌లు భారత్‌లో అంతర్భాగమే. అందులో ఏ సందేహమూ లేదు. నేను జమ్మూ కశ్మీర్‌ అని పలుకుతున్నానంటే అందులో పాక్‌ ఆక్రమిత కశ్మీర్, చైనా ఆక్రమిత ఆక్సాయ్‌చిన్‌లు కూడా కలిసి ఉన్నట్లే లెక్క. ఆ భూభాగాల కోసం తమ ప్రాణాలైనా అర్పించేందుకైనా మేం సిద్ధంగా ఉన్నాం. ఆక్సాయ్‌చిన్‌తో కూడిన లదాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. అలాగే అక్కడి రెండు స్వతంత్ర పాలక మండళ్లు కూడా కొనసాగుతాయి.’ 

పాక్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో భారత్‌కు పూర్తి హక్కులు 
ఐక్యరాజ్య సమితి (ఐరాస) నియమాలను పాక్‌ ఉల్లంఘించినందున జమ్మూ కశ్మీర్‌పై ఏ నిర్ణయమైనా తీసుకునే పూర్తి హక్కులు భారత్‌కు ఉన్నాయి. ఐరాస నియమాలను 1965లోనే పాకిస్తాన్‌ ఉల్లంఘించి దురాక్రమణకు పాల్పడింది. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ అంశం ముగిసింది. ఐరాస నిబంధనల ప్రకారం ఒక దేశ బలగాలు మరో దేశ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసేలా ప్రవర్తించకూడదు. 1965లో పాకిస్తాన్‌ ఎప్పుడైతే నిబంధనలను ఉల్లంఘించి, దురాక్రమణకు పాల్పడిందో అప్పుడే అక్కడ ప్రజాభిప్రాయమన్న అంశం ముగిసింది. కాబట్టి ప్రాదేశిక సమగ్రతపై ఏ నిర్ణయమైనా తీసుకునే పూర్తి హక్కులు భారత్‌కు ఉన్నాయి. ఈ విషయాన్ని ఐరాస కూడా ఒప్పుకుంది. 

నాడు సైనికులకు స్వేచ్ఛ ఉంటే ఇప్పుడు పీవోకే మనదే 
కశ్మీర్‌ అంశాన్ని ఐరాస వరకు తీసుకెళ్లింది ఎవరు? ఏకపక్షంగా 1948లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తెచ్చింది ఎవరు? ఇదంతా తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూయే చేశారు. సైనికులకు ఆనాడే స్వేచ్ఛ ఇచ్చి ఉంటే ఇప్పుడు పీవోకే భారత్‌లో అంతర్భాగంగా ఉండేది. మేం చేస్తున్నది చారిత్రక తప్పిదం కాదు. చారిత్రక తప్పిదాన్నే మేం సరిచేస్తున్నాం. 1989 నుంచి జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం కారణంగా 41,500 మంది మరణించారు. దీనికి కారణం ఆర్టికల్‌ 370, 35–ఏలే.  

ప్రజలతో చర్చిస్తాం.. వేర్పాటువాదులతో కాదు 
కశ్మీర్‌లో వేర్పాటువాద సంస్థ హురియత్‌ కాన్ఫరెన్స్‌తో చర్చలేమీ ఉండవు. కానీ కశ్మీర్‌ ప్రజలతో మాట్లాడేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. జమ్మూ కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత మళ్లీ పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏ మాత్రం సంకోచించదు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను కూడా భారత్‌లో అంతర్భాగంగానే భావిస్తాం.
 
పార్లమెంటు అధికారాన్నే కాంగ్రెస్‌ ప్రశ్నిస్తోంది 

బిల్లులకు అసలు న్యాయబద్ధత ఎక్కడుందని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురీ ప్రశ్నించారు. ‘ఇది దేశ అంతర్గత అంశమని మీరు చెబుతారు. కానీ 1948 నుంచి కశ్మీర్‌లో పరిస్థితిని ఐక్యరాజ్యసమితి పరిశీలిస్తోంది. సిమ్లా ఒప్పందం, లాహోర్‌ ఒప్పందాలూ ఉన్నాయి. అప్పుడు ఇది ద్వైపాక్షిక అంశమో లేక అంతర్గత అంశమో స్పష్టత ఇవ్వాలని నేను కోరుతున్నాను’ అని చౌధురీ అన్నారు. దీనిపై అమిత్‌ షా స్పందిస్తూ ‘కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడంలో పార్లమెంటుకు అధికారాన్నే ఆయన ప్రశ్నిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన దేశభక్తులు ఈ ప్రశ్న వింటే తీవ్రంగా కలత చెందేవారు. హోం మంత్రి ఎందుకంత కోపంగా ఉన్నారని విపక్ష సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పీవోకే భారత్‌లో భాగం కాదని మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను కోపంగా ఉన్నాను’ అని బదులిచ్చారు. 370 రద్దుపై భాగస్వామ్య పక్షాలను కేంద్రం సంప్రదించలేదని ప్రతిపక్ష పార్టీలు నిందించాయి. ఏకపక్షంగా తీసుకున్నారని మండిపడ్డాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసింది.

నినాదాల హోరు
జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందగానే లోక్‌సభలో బీజేపీ సభ్యులు ఆనందోత్సాహాలతో పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. ‘భారత్‌ మాతా కీ జై, ‘వందేమాతరం’, ‘జహాః హుయే బలిదాన్‌ ముఖర్జీ కా, వో కశ్మీర్‌ హమారా హై’.. అనే నినాదాలతో హోరెత్తించారు. చర్చకు అమిత్‌ షా సమాధానమిస్తున్నప్పుడు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. వారితో ప్రధాని మోదీ కూడా జతకలిశారు. షా సమాధానమివ్వడానికి కొద్ది సేపు ముందే సభలోకి మోదీ వచ్చారు. ఆ సమయంలో బీజేపీ సభ్యులు గట్టిగా హర్షధ్వానాలు చేస్తూ ఆయనను స్వాగతించారు. లోక్‌సభ వాయిదా అనంతరం ప్రధాని మోదీ విపక్ష సభ్యుల స్థానాల వద్దకు వెళ్లారు. 

బ్లాక్‌డే.. ఆనాడే: అమిత్‌ 
మనీష్‌ తివారీ వ్యాఖ్యలకు అమిత్‌ షా సమాధానమిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ విషయంలో చాలా చర్చ చేశామని ఆయన చెప్పారు. అయితే ఏం చర్చ చేశారో చెప్పాలి. రాష్ట్ర విభజనకు ఒక తీర్మానం పంపితే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మూడింట రెండొంతుల మెజారిటీతో తిరస్కరించింది. శాసన మండలి కూడా తిరస్కరించింది. ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేశారు. అయినా వారు ఆంధ్రప్రదేశ్‌ను విభజించారు. ఇంక చర్చ ఏం చేశారు? మా పార్టీ విభజనకు మద్దతు ఇచ్చిందా లేదా అన్నది ఇక్కడ విషయం కాదు. నేను విభజన గురించి మాట్లాడడం లేదు. అది మంచిదా కాదా అనే విషయంపై నేను చర్చించడం లేదు. విభజన ప్రక్రియ తీరును మీరు ఇప్పుడు ప్రస్తావించడంతో నేను దానిపై మాట్లాడుతున్నా. అసెంబ్లీ, శాసనమండలితో చర్చించాలని అంటున్నారు.

ఏపీ అసెంబ్లీ, మండలి విభజన వద్దన్నాయి. మీరెందుకు ఏపీని విభజించారు? మీరు చేసి మమ్మల్ని ఎందుకు వద్దంటున్నారో చెప్పండి. మేం ఇంత ప్రశాంతంగా చర్చిస్తున్నాం. కానీ మీరు చేసిన ప్రక్రియ బాగుందని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా? వ్యతిరేకంగా ఉన్న సభ్యులను మార్షల్స్‌తో బయటకు లాగేశారు. పార్లమెంటు తలుపులు మూశారు. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి ఏపీని విభజించారు. బ్లాక్‌ డే ఈరోజు కాదు.. ఆనాడే. నేను ఇక్కడ ఒక్కటి స్పష్టం చేయదలుచుకున్నా. నేను విభజన గురించి మాట్లాడడం లేదు. విభజన ప్రక్రియకు మీరు అనుసరించిన తీరుపై మాట్లాడుతున్నా. విభజన తీరును మనీష్‌ తివారీ ప్రస్తావించడంతో నేను ఏపీ విషయాన్ని లేవనెత్తాను. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top