
యూపీలో చూపిన ప్రతిభ వల్లే ఎన్నుకున్నాం
ఉత్తర ప్రదేశ్లో చూపించిన అద్భుత ప్రతిభ కారణంగానే అమిత్షాను బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
ఉత్తర ప్రదేశ్లో చూపించిన అద్భుత ప్రతిభ కారణంగానే అమిత్షాను బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలోని పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన పార్టీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తప్పుడు ఆరోపణలతో నితిన్ గడ్కరీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చిందని, ఇప్పుడు తనకు మంత్రిపదవి రావడంతో ఒక వ్యక్తికి రెండు పదవులు ఉండకూడదన్న నియమం మేరకు తప్పుకొంటున్నానని ఆయన చెప్పారు.
యూపీలో ఇంతకుముందెన్నడూ బీజేపీకి అన్ని స్థానాలు రాలేదని.. అమిత్ షా అనుసరించిన వ్యూహాల కారణంగానే అక్కడ అన్ని స్థానాలు వచ్చాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అందుకే తామంతా బాగా ఆలోచించి మరీ ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. తనవైపు నుంచి, పార్టీలోని అందరు పెద్దల తరఫు నుంచి అమిత్ షాకు అభినందనలు తెలియజేస్తున్నామని, హార్దిక శుభాకాంక్షలు చెబుతున్నామని అన్నారు. ఆ తర్వాత ముందుగా రాజ్నాథ్ సింగ్ దండ వేసి అభినందించగా, ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు స్వీటు పెట్టారు. ఆ తర్వాత ఎల్కే అద్వానీ, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, మురళీ మనోహర్ జోషి, వెంకయ్య నాయుడు, ఇతర సీనియర్ నాయకులు అమిత్ షాను పుష్పగుచ్ఛాలతో అభినందించారు.