యూపీలోనూ గెలుస్తాం..! | We also win in UP | Sakshi
Sakshi News home page

యూపీలోనూ గెలుస్తాం..!

Jun 13 2016 1:57 AM | Updated on Mar 29 2019 9:31 PM

యూపీలోనూ గెలుస్తాం..! - Sakshi

యూపీలోనూ గెలుస్తాం..!

ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అక్కడి సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.

- 2019లో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తాం 
- బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ధీమా
 
 సమాజ్‌వాదీ సర్కారు నిస్సహాయంగా ఉంది
- మథుర, కైరానా ఘటనలను నియంత్రించలేకపోయారు
- యూపీ, ఇతర రాష్ట్రాల ఎన్నికలకు సమాయత్తం కావాలి
- బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం
- హాజరైన మోదీ, కేంద్ర మంత్రులు, అద్వానీ
 
 అలహాబాద్: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అక్కడి సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఇటీవలి మథుర, కైరానా హింసాత్మక ఘటనలను ప్రస్తావిస్తూ సీఎం అఖిలేష్ యాదవ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. హింసను తాళలేక పశ్చిమ యూపీలోని కైరానాలో హిందువులు వలసవెళ్లారని మండిపడ్డారు. ఆదివారం ప్రారంభమైన రెండ్రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అమిత్‌షా ప్రారంభ ఉపన్యాసం చేశారు.

2017 సంవత్సరం పార్టీకి పెద్ద సవాల్ లాంటిదని, యూపీతోపాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయని చెప్పారు. అందువల్ల పార్టీ కార్యకర్తలు మోదీ విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అమిత్‌షా పిలుపునిచ్చారు. అమిత్ ప్రసంగం సమయంలో ప్రధాని మోదీతోపాటు, కేంద్ర సీనియర్ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఉన్నారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.

 2019లో మళ్లీ కేంద్రంలో...
 ఈ సందర్భంగా అమిత్ షా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్ రోజురోజుకీ బలహీనపడుతోంది. రెండేళ్లుగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకునే విధానాలను అవలంబిస్తూ కృశిస్తోంది. దీంతో బీజేపీ కార్యకర్తలు కఠోర శ్రమ, నిబద్ధతతో పనిచేస్తే తదుపరి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో అధికారం కైవసం చేసుకోవచ్చు’ అని అన్నారు. అలాగే, 2019లో కేంద్రంలోనూ తిరిగి అధికారం కైవసం చేసుకుంటామన్నారు. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధాన విజయాలను, రెండు ఇస్లాం దేశాలు అత్యున్నత పౌర పురస్కారాలను మోదీకి ప్రదానం చేయడాన్ని  ప్రస్తావించారు. ‘కొంతమంది మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన సందర్శించిన అన్ని ఇస్లామిక్ దేశాల్లో ఉగ్రవాదంపై పోరాటం చేయాలన్న గళం వినిపించి వారి మనసును గెలిచారు. ఆసియాలో భారత్ సుస్థిరతకు మూలమన్న విషయాన్ని వారు గుర్తించారు’ అని చెప్పారు.

 మంచి భవిష్యత్‌కు ఇది నాంది.. ఇటీవల అస్సాం ఎన్నికల్లో విజయం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఓటుశాతం పెరిగిన అంశాలను ప్రస్తావిస్తూ మంచి భవితకు ఇది ఆరంభమని అమిత్ షా అన్నారు. కేరళ, ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడుతోపాటు బెంగాల్లోనూ పార్టీ పటిష్టం కావడంపై దృష్టిపెట్టాలన్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ ఈ రాష్ట్రాల్లో పెద్దగా సీట్లను సాధించలేదని గుర్తుచేశారు. మోదీ రెండేళ్ల పాలనను, యూపీఏ పదేళ్ల పాలనతో పోల్చిచెప్పారు. యూపీఏ ప్రభుత్వం స్కాంలలో మునిగిఉంటే, మోదీ పాలన అవినీతిరహితంగా, పారదర్శకంగా, ప్రజారంజకంగా ఉందన్నారు.

ఎన్డీఏ  నిర్ణాయక నాయకత్వం వల్ల గ్రామీణ-పట్టణాభివృద్ధి, సంస్కరణలు-ప్రజాసంక్షేమం.. ఇలా అన్నింటా సంతులనం పాటించిందన్నారు. బీజేపీ దళితులకు వ్యతిరేకమన్న ప్రచారం నేపథ్యంలో.. మోదీ అమెరికా చట్టసభలో చేసిన ప్రసంగంలో అంబేడ్కర్ గురించి మాట్లాడటాన్ని అమిత్‌షా ప్రస్తావించారు. అయితే పార్టీకి కీలకమైన అయోధ్య రామాలయ నిర్మాణం గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. తొలిరోజు భేటీలో క్లుప్తంగా మాట్లాడిన మోదీ పార్టీ పటిష్టతపై మాట్లాడినట్లు తెలిసింది. సోమవారం ముగింపు  భేటీ,  బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు.

 సీఎం అభ్యర్థిపై నిర్ణయం లేదు
 ఈ సమావేశంలో యూపీ సీఎం అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని రవిశంకర్ ప్రసాద్ స్పష్టంచేశారు. ఇలాంటి నిర్ణయాలు పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్డు తీసుకుంటుందన్నారు. కైరానాలో హిందూ వలసల నేపథ్యంలో పార్టీ మతం అంశంపై దృష్టి పెడుతుందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ... తాము మతవాదంపై మాట్లాడబోమని, జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అభివృద్ధికీ, సుపరిపాలనకూ దూరంగా ఉందని, ఇది చాలా ఆందోళనకరమని అమిత్ షా చెప్పారన్నారు. రాష్ట్రంలో చెలరేగుతున్న హింస, ఘర్షణలను నియంత్రించడంలో ఎస్పీ సర్కారు నిస్సహాయత వ్యక్తంచేస్తోందని మండిపడ్డారు.  

 ఆర్థిక వృద్ధి పరుగులు
 ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి మందగమనంతో ఉన్నప్పటికీ ప్రధాని మోదీ విధానాల వల్ల దేశం వృద్ధిలో పరుగులు తీస్తోందంటూ బీజేపీ కొనియాడింది. దీనివల్ల దేశంలోని పేదల జీవితాల్లో మార్పులొస్తాయని విశ్వాసం వ్యక్తం చేసింది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వృద్ధి తిరోగమనంలో నడిచిందని దుయ్యబట్టింది. ఈమేరకు జాతీయ కార్యవర్గ  సమావేశంలో ఆర్థిక తీర్మానాన్ని ఆమోదించారు.

 హైకోర్టును సందర్శించిన మోదీ
 ఈ సమావేశాల కోసం అలహాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీ చారిత్రక హైకోర్టును సందర్శించారు. హైకోర్టు 150వ వసంతాలను జరుపుకుంటున్న నేపథ్యంలో వచ్చిన మోదీ గంటపాటు అక్కడ గడిపారు.   
 
 రాజ్‌నాథ్‌వైపే మొగ్గు!
 2017 ఎన్నికల్లో యూపీలో బీజేపీ సీఎం అభ్యర్థిగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేరుపై పార్టీ రాష్ట్ర శాఖ ఆసక్తితో ఉన్నప్పటికీ ఆయన విముఖంగా ఉన్నట్లు తెలిసింది. మోదీ, అమిత్‌షాలు ఈ విషయమై రాజ్‌నాథ్‌కు చెప్పగాఆయన అయిష్టత వ్యక్తంచేసినట్లు సమాచారం. అయితే పార్టీ వర్గాలు మాత్రం రాజ్‌నాథ్‌నే యూపీ సీఎం అభ్యర్థిని చేస్తారంటున్నాయి.  భవిష్యత్‌లో అంతర్గత భద్రతకు సంబంధించి  కేంద్రం చేపట్టనున్న భారీ ఆపరేషన్ వల్ల రాజ్‌నాథ్‌కు పరపతి పెరుగుతుందని, తర్వాత ఆయనను సీఎం అభ్యర్థిగా తెరపైకి తెస్తారన్న వాదనా వినిపిస్తోంది. నవంబర్‌కల్లా ఇది జరుగుతుందని పార్టీ నేత ఒకరన్నారు. వరుణ్‌గాంధీ, స్మృతీ ఇరానీల పేర్లు వినిపిస్తున్నప్పటికీ రాజ్‌నాథ్ స్థాయి వారికి లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాజ్‌నాథ్ గతంలోనూ ముఖ్యమంత్రిగా పనిచేశారని, అందువల్ల ఆయననే మళ్లీ తెచ్చే అవకాశముందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement