శబరిమలలో కొత్త చరిత్ర

2 Women Below 50 Enter Sabarimala, Temple Reopens After "Purification" - Sakshi

అయ్యప్ప ఆలయంలో అడుగుపెట్టిన ఇద్దరు మహిళలు

రక్షణగా నిలిచిన పోలీసులు వెంటనే గర్భగుడిని శుద్ధిచేసిన పూజారులు

కేరళలో పెల్లుబికిన నిరసనలు

శబరిమల/తిరువనంతపురం: కొత్త ఏడాది వేళ.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ప్రస్థానంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. శతాబ్దాల సంప్రదాయాన్ని ధిక్కరిస్తూ రుతుస్రావ వయసులో ఉన్న ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. కేరళకు చెందిన కనకదుర్గ(44), బిందు(42) బుధవారం వేకువ జామున పోలీసు రక్షణతో అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. అన్ని వయసుల మహిళల్ని శబరిమల ఆలయంలోకి అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత రుతుస్రావ దశ (10–50 ఏళ్ల మధ్య)లో ఉన్న మహిళలు అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. దీంతో అత్యున్నత న్యాయస్థానం తీర్పు మూడు నెలల తరువాత అమలుకు నోచుకున్నట్లయింది.

లింగ సమానత్వం కోరుతూ కేరళ వ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు రాష్ట్రం ఒక చివర నుంచి మరో చివర వరకు మానవహారం ఏర్పాటుచేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. మహిళల ప్రవేశం తరువాత ఆలయ ప్రధాన పూజారి భక్తులందరినీ బయటికి పంపించి, తలుపులు మూసి సుమారు గంట సేపు గర్భగుడిలో సంప్రోక్షణ నిర్వహించారు. ఆ తరువాతే ఆలయ తలుపులు తిరిగి తెరుచుకున్నాయి. ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారన్న వార్త తెలియగానే కేరళలోని పలు ప్రాం తాల్లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ పాటించాలని హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి.

అడ్డంకులు లేవు.. నిరసనలు లేవు
పటిష్ట పోలీసు భద్రత నడుమ నల్లటి దుస్తులు, ముఖాలకు ముసుగులు ధరించి కనకదుర్గ, బిందు బుధవారం వేకువజామున 3.38 నిమిషాలకు అయ్యప్ప ఆలయంలో అడుగుపెట్టారు. పంబా నుంచి ఆలయం వైపు మెట్లు ఎక్కుతుండగా, లోపల పూజలు చేస్తున్న సమయంలో తమకు ఎలాంటి నిరసనలు కాలేదని, అంతా సవ్యంగానే సాగిందని వారు తెలిపారు. అక్కడ భక్తులు మాత్రమే ఉన్నారని, వారు తమని అడ్డుకోలేదని వెల్లడించారు. దర్శనం ముగిసిన తరువాత పోలీసులు ఆ ఇద్దరిని గుర్తు తెలియని చోటుకు తరలించారు.

కేరళలోని మలప్పురంకు చెందిన కనకదుర్గ పౌర సరఫరా శాఖలో ఉద్యోగి కాగా, కోజికోడ్‌కు చెందిన బిందు కళాశాల లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. తాజా ఘటన నేపథ్యంలో వారిద్దరి ఇళ్ల వద్ద పోలీసు బలగాల్ని మోహరించారు. ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయ మెట్లు ఎక్కుతున్న దృశ్యాల్ని స్థానిక టీవీ చానళ్లు ప్రసారం చేయడంతో ఈ సంగతి రాష్ట్రమంతా తెలిసిపోయింది. ముఖ్యమంత్రి పి. విజయన్‌ స్పందిస్తూ ‘కొన్ని అడ్డంకుల వల్ల ఇంతకుముందు మహిళలు ఆలయంలోకి ప్రవేశించలేకపోయారు. కానీ ఈ రోజు అలాంటి సమస్యలు లేకపోవడం వల్లే వారు గుడిలోకి వెళ్లగలిగారు. మహిళలు శబరిమల ఆలయంలో అడుగుపెట్టారన్నది నిజం’ అని వ్యాఖ్యానించారు.

విజయన్‌ మొండివైఖరి వల్లే: కాంగ్రెస్‌
అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ సీఎం విజయన్‌పై మండిపడ్డాయి. ఆలయంలోకి మహిళలు అడుగుపెట్టడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇది సీఎం విజయన్‌ మొండివైఖరిని సూచిస్తోందని కాంగ్రెస్‌ నేత రమేశ్‌ చెన్నితాల అన్నారు. విజయన్‌ ఆదేశాల మేరకు నడుచుకున్న పోలీసులు ఆ ఇద్దరు మహిళలకు రక్షణ కల్పించారన్నారు. సంప్రోక్షణ కోసం ఆలయాన్ని మూసివేయడం వందశాతం సరైనదేనన్నారు.

ప్రతిపక్ష కూటమి యూడీఎఫ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతుందని తెలిపారు. కేరళ ప్రభుత్వం భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిందని, సీఎం, కమ్యూనిస్టు నాయకులు, వారి భావి తరాలకు అయ్యప్ప ఆగ్రహం తప్పదని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై హెచ్చరించారు. విజయన్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ‘నామజపం’ ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న శబరిమల కర్మ సమితి డిమాండ్‌ చేసింది.  కొత్త ఏడాదిలో మహిళలకు ఇది గొప్ప ప్రారంభమని సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌ అన్నారు.

అట్టుడుకుతున్న కేరళ
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేరళలో ఉద్రిక్తత రాజేసింది. ఆందోళన బాట పట్టిన బీజేపీ, హిందూ సంస్థల కార్యకర్తలు వీరంగం సృష్టించారు. తిరువనంతపురంలో సచివాలయం బయట బీజేపీ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. అధికార సీపీఎం, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగి పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో అక్కడి వాతావరణం రణరంగాన్ని తలపించింది. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయువు గోళాల్ని ప్రయోగించారు.

అతి కష్టం మీద ఆందోళనలను అణచివేసిన పోలీసులు ఇద్దరు మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సీపీఎం కార్యాలయాలపై దాడులు జరిగాయి. మలప్పురంలో బీజేపీ కార్యకర్తలు సీఎం విజయన్‌ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కొచ్చి, పాతనంతిట్టా, తిరువనంతపురం, కొల్లాంలలో భక్తులు అయ్యప్ప చిత్రపటాలు చేతబూని వీధుల వెంట ర్యాలీలు నిర్వహించారు.


కొచ్చిలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలను పక్కకు లాగేస్తున్న పోలీసులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top