
సాక్షి, ముంబయి : ప్రముఖ నటి శ్రీదేవి అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. సోమవారం రాత్రి 10గంటల ప్రాంతంలో ఆమె పార్థీవ దేహం ముంబయి చేరుకోనుంది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రైవేట్ విమానంలో ఆమె పార్థీవ దేహాన్ని తీసుకురానున్నారు. ముంబయి చేరుకున్న తర్వాత కడసారి చూసేందుకు తరలి వచ్చిన ప్రముఖులు, అశేష అభిమానులకోసం శ్రీదేవికి ఇష్టమైన భాగ్య బంగ్లాలో ఆమె భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. మంగళవారం మధ్యాహ్నంగానీ, సాయంత్రంగానీ అంత్యక్రియలు పూర్తి చేసే అవకాశం ఉంది.
శ్రీదేవి మరణం వెనుక ఎలాంటి అనుమానాలు లేవని ఇప్పటికే దుబాయి పోలీసులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆమె మృతి వెనుక ఎలాంటి కుట్రలు లేవని, బలవన్మరణానికి ఆమె పాల్పడలేదని, అనూహ్యంగా తీవ్రంగా వచ్చిన గుండెపోటు కారణంగానే ఆమె ప్రాణాలుకోల్పోయారని చెప్పారు. ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన వ్యవహారాలు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో ఆమె పార్థీవదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.