గాయకుడ్ని కావాలని ఎప్పుడూ అనుకోలేదు | Sakshi
Sakshi News home page

మా బాలు..పాటల రారాజు

Published Tue, Jun 5 2018 11:12 AM

Singer Janaki Prices S P Balasubrahmanyam On Hes Birthday In PSR Nellore - Sakshi

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజును పురస్కరించుకుని ఆశీర్వదించడానికే వచ్చానని ప్రముఖ సినీ నేపథ్యగాయిని గానకోకిల జానకి పేర్కొన్నారు. నగరంలోని పురమందిరం ఓపెన్‌ థియేటర్‌లో సోమవారం రాత్రి విజేత ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో జరిగిన పాటల రారాజ బాలు పుట్టిన రోజు పండగ ఆద్యంతం జ్ఞాపకాల పరంపరగా సాగింది. సినీ రచయిత వెన్నలకంటి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  హాజరైన జానకి మాట్లాడుతూ తనకు సత్కారం చేస్తానంటే, ఈ వేడుకకు రాలేదని, కేవలం పుట్టిన బాలుడు బాలసుబ్రహ్యణ్యాన్ని ఆశీర్వదించడానికే వచ్చానన్నారు.

బాలులో ఉన్న టాలెంట్, కలిసొచ్చిన అదృష్టం, తెలివితేటలు, మాటలతో కట్టిపడేసే నైజం అన్నింటినీ మించి గ్రాస్పింగ్‌వల్లే ఇంతపెద్ద గాయకుడయ్యాడరన్నారు. తన అభివృద్ధికి జానకమ్మే కారణం అని పలుమార్లు బాలు చెబుతుంటాడని, అయితే నెల్లూరు, గూడూరులో జరిగిన పాటల పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో తానిచ్చిన ప్రోత్సాహపు మాటలకు తదాస్థు దేవతల ఆశీర్వాదం వల్ల బాలు పెద్ద గాయకుడై ఉంటారన్నారు. గాయనిగా తన ప్రస్థానం సినిమా నేపథ్య ప్రపంచంలో బాలు, జానకి పాటలు, సంఘటనలను ఆమె వివరించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గాయకుడిని కావాలని తాను ఎప్పడు అనుకోలేదన్నారు. తనకేమి తెలియదో తనకు బాగా తెలుసనీ, ఇంజినీరు కావాలని అనుకున్న లక్ష్యం జానకమ్మ మాటలతో మారిపోయి శృతిపాండిత్యంతో ప్రయత్నించానన్నారు. ఆ తరువాత ప్రస్థానం అందరికీ తెలిసిందేనన్నారు. జానకమ్మ మహా గాయనిఅని మిగిలిన వాళ్లు పాడలేని పాటలు పాడగల దమ్మున్న గాయని అన్నారు.

సంగీతానికి అంతులేదనీ, ఎంతవరకు నేర్చుకున్నాం.. ఎంతవరకు సాధన చేశామనే దానిపైనే కళాకారుల స్థాయి ఆధారపడి ఉంటుందన్నారు. స్వచ్ఛభారత్‌ను ఎవరికి వారు అనుసరించాలని పలు సూచనలు చేశారు. సంగీత, సాహిత్య విశ్లేషకులు వి.ఎ.కె.రంగారావు  జానకి, బాలు పాటలు, నెల్లూరుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. సినీ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ సంగీతం భగవంతుని భాష అని నెల్లూరు నుంచి గంగోత్రి ప్రవాహంలా సాగిన బాలు ప్రస్థానం, జానకమ్మల పాటలను విశ్లేషించారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు విద్యాసాగర్‌ మాట్లాడుతూ సంగీతం పట్ల బాలుకున్న అంకితభావం, పెద్దలను గౌరవించాలనే బాలు తత్వం భావితరాలు అలవర్చుకోవాలన్నారు. ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ మాట్లాడుతూ సంగీత, సాహిత్యంలో బాలు, జానకమ్మలాంటి గొప్పవారితో వేదికను పంచుకోవడం అదృష్టమన్నారు. లాయర్‌ పత్రిక సంపాదకులు తుంగా శివప్రభాత్‌రెడ్డి, మురళీకృష్ణ 70ఎంఎం అధినేత హజరత్‌బాబు, వెంకటగిరి రాజా సాయిజ్ఞయాచేంద్ర, ఎస్పీ శైలజ, ఎస్పీ చరణ్, బాలు కుటుంబసభ్యులు, స్నేహితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సత్కారం కాదు.. నమస్కారం
తాను పుట్టినరోజు సందర్భంగా వివిధ రంగాల్లో ఉన్నవారిని సన్మానించడం ఆనవాయితీ అని అయితే జానకమ్మ అందుకు అంగీకరించకపోవడంతో కేవలం తన ఆశీర్వచనం తీసుకుని తనకు నమస్కరించడం కోసమే ఆమెను ఆహ్వానించామని బాలు పదేపదే స్పష్టంచేశారు. తల్లి శకుంతలమ్మ, కుటుంబసభ్యుల మధ్య బాలు జానకమ్మ వద్ద ఆశీర్వచనం తీసుకున్నారు. ఆమెకు మురళీకృష్ణ విగ్రహాన్ని బహుమతిగా అందజేశారు. జానకమ్మ వద్దని చెప్పిన రూ.లక్ష నగదును స్పర్శ ఆస్పత్రిలో ఆడియో థియేటర్‌ ఏర్పాటుకు అందజేస్తున్నట్లు ప్రకటించారు.

ఆకట్టుకున్న నృత్యం
నూజివీడు ఐఐఐటీ కళాశాల యోగా విభాగ నిర్వాహకులు సత్యశ్రీధర్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన  (ప్ర)యోగాత్మక నృత్యరూప ప్రదర్శన పలువుర్ని ఆలోచింపజేసింది.

1/1

సభలో మాట్లాడుతున్న గానకోకిల జానకి, వేదికపై ఎస్పీబాలు, వెన్నెలకంటి, ఎస్పీ , రామకృష్ణ తదితరులు

Advertisement
Advertisement