రాజమౌళిని కీర్తిస్తూ రష్యా ఎంబసీ ట్వీట్‌

Russian Embassy Shared Throwback Pictures OF SS Rajamouli - Sakshi

హైదరాబాద్‌: తెలుగుతో పాటు భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. విడుదలై దాదాపు మూడేళ్లు అవుతున్న ఈ సినిమా క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కాంబినేషన్‌ల వచ్చిన ఈ బ్లాక్‌ బస్టర్‌ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం వార్తల్లో ఉంటుంది. రెండు వారాల క్రితం బాహుబలి 2 సినిమా రష్యా టెలివిజన్‌లో ప్రసారం కావడం పెద్ద చర్చనీయాంశంగా మారిని విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా బాహుబలి సినిమా, దర్శకుడు రాజమౌళిని కీర్తిస్తూ రష్యా ఎంబసీ శుక్రవారం ట్వీట్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. (9న సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ)

39వ మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో(2017లో జరిగింది) బాహుబలి చిత్రాలను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ వేడుకలకు భారత సినీ పరిశ్రమ ప్రతినిధిగా రాజమౌళి హాజరై ప్రసంగించారు. ‘భారతీయ డీఎన్‌ఏలో కుటుంబ విలువలు ఎక్కువగా ఉంటాయి. నా ప్రధాన లక్ష్యం భారతీయ కుటుంబ విలువలను ప్రపంచంతో పంచుకోవడమే. అదే ఈ సినిమాలో చేశాను.. విజయం సాధించాను. బాహుబలి కథ కూడా కుటుంబ విలువల గురించే ఉంటుంది. సోదరులు, తల్లి-కొడుకు, భార్యాభర్తలు ఇలా అనేక రకాల బంధాలతో కుటుంబ విలువలను కాపాడుతున్న వారికి నా ఈ సినిమా అంకితం’ అంటూ రాజమౌళి మాస్కో ఇంటర్నెషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రసంగించారు. (మహేశ్‌వారి పాటలు!)

రాజమౌళి అప్పుడు చేసిన ప్రసంగానికి సంబంధించిన ఫోటోతో పాటు మరెన్నో తీపి జ్ఞాపకాలను రష్యా ఎంబసీ నెమరువేసుకుంటూ తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. కాగా ఈ వేడుకలకు రాజమౌళితో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, తదితరులు పాల్గొన్నారు. ఇక గత నెల 28న బాహుబలి-2 చిత్రం రష్యా భాషల్లోకి అనువదింపబడి అక్కడి టెలివిజన్లలో ప్రసారమైంది. రష్యా భాషలో ప్రసారమైన ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన కనిపించింది అని రష్యా ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top