
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోని కీలక ఘట్టాల నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమాకు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ ను నిర్ణయించినట్టుగా ప్రకటించిన వర్మ, ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. అయితే ఇప్పటికే వర్మ తెరకెక్కించబోయే ఎన్టీఆర్ జీవితకథపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
వర్మ మాత్రం మరోసారి తనదైన స్టైల్ లో విమర్శలు చేస్తున్న వారిపై మాటలదాడి చేస్తున్నాడు. తాజాగా తన ఫేస్ బుక్ పేజ్ లో చేసి కామెంట్ ఆసక్తికరంగా మారింది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడానికి నాకు అపారమయిన బలమిస్తున్న కేవలం ఒకే ఒక శక్తి ఎవరంటే అది ఎన్టీఆర్ అనే వ్యక్తి.. ఆ మహానుభావుడి ఆత్మ రోజూ నా కలలోకి వచ్చి నాకు స్క్రీన్ ప్లే రాయడానికి సహకరిస్తోంది'. అంటూ కామెంట్ చేశాడు వర్మ. వర్మ తెరకెక్కించబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను 2018 ఫిబ్రవరిలో ప్రారంభించి అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.