మనసులో తాళిబింబం మౌనరాగం

Mani Ratnam's first  success to ''mouna ragam'' - Sakshi

డబ్బింగ్‌ క్లాసిక్స్‌–01

పెళ్లయి అప్పటికి నాలుగంటే నాలుగు రోజులు కూడా కాలేదు. ఆమెను తీసుకుని అతడు బజారుకు వచ్చాడు. కొత్త భార్య. ఏదైనా కానుక ఇస్తే బాగుండని భావన. ‘ఏం కావాలి?’ అడిగాడు. ‘ఏం వద్దు’ అందామె. ‘మొదటిసారి తీసుకువచ్చాను. ఏం కావాలన్నా అడుగు’ అన్నాడు. ‘ఏం అడిగినా కొనిస్తారా?’ ఎదురు ప్రశ్నించింది. ‘నా శక్తికి మించనిదైతే కొనిస్తాను’ అన్నాడు. ‘అయితే నాకు విడాకులు కావాలి. కొనివ్వగలవా’ అందామె. అక్కడ నిశ్శబ్దం. చాలా విస్ఫోటనాలకు చప్పుడు ఉండదు. అతడి హృదయం నిశ్శబ్దంగా అతి సూక్ష్మ స్థాయిలో కూడా ముక్కచెక్కలై వేయి వక్కలయ్యింది.

అతడు ఆమెకు పట్టీలు కొన్నాడు. మువ్వలు ఉన్న తెల్లగా మెరుస్తున్న వెండి పట్టీలు. భార్య పాదాలకు పట్టీలు తొడిగి ఒక ముద్దు పెట్టడం ఏ భర్తకైనా మురిపెం. ‘నీ కోసం తెచ్చాను. తీసుకో’ అని చేయి పట్టుకున్నాడు. ‘చేయి వదలండి’ అందామె. ‘ఏం నేను పట్టుకోకూడదా?’ అని అడిగాడు. ‘అలా అని కాదు. నాకు బాగనిపించడం లేదు’ ‘ఏం?’ ‘మీరు పట్టుకుంటే గొంగళిపురుగు పాకినట్టుగా ఉంది’
అతడు ఒకడుగు వెనక్కి వేశాడు. ఆమె కోసం అతడు అగ్ని చుట్టూ ఏడు అడుగులు వేశాడు. ఇప్పుడు ఏ అడుగు వేయాలి? ముందుకా వెనక్కా?
 
అది ఢిల్లీ. రేవతిని పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెట్టాడు మోహన్‌. కాని కాపురం చేదుగా ఉంది. చక్కెర లేని టీలా ఉంది. కాదు పాలు లేని టీలా ఉంది. కాదు కాదు అసలక్కడ టీయే లేదు. ఉన్నది ఖాళీ కప్పే. ఆమె మనసులో అతడు లేడు. అతడు కట్టిన తాళి లేదు. ఆమె ఒక కట్టె ముక్కలా అతడికి తల వంచింది. పెద్దలు పంపితే రైలెక్కి ఢిల్లీ చేరుకుంది. విడాకులిచ్చి పంపించేస్తే వెళ్లిపోతానని అంటుంది. ఇంకొకడైతే చెంప పగలగొట్టి ఉండేవాడేమో. అతడు మాత్రం ఎంతో ఓర్పుగా ‘ఎందుకు?’ అని అడుగుతాడు. ఆమెకు ఒక ప్రేమ కథ ఉంది. ఇంకా ఆమె మనసులో సజీవంగా ఉన్న ప్రేమ కథ. ఏనాడో అందులోని ప్రేమికుడు మరణించిన ప్రేమ కథ.

ఆమె కాలేజీలో చదువుతుండగా కార్తీక్‌ పరిచయయ్యాడు. అతి చల్లటి నీళ్లు తల మీద కుమ్మరించినట్టుగా ఉక్కిరిబిక్కిరి చేసే పరిచయం అతడిది. అతడు చురుకైన కుర్రాడు. విలువలున్న కుర్రాడు. నవ్వుతూ ఉండే కుర్రాడు. నిజంగా విల్లులా ఉండే కుర్రాడు.ఆమెతో కాఫీ తాగడానికి వెళ్లి హోటల్లో పక్క టేబుల్‌ మీద తండ్రిని చూసి ఆమె భయపడుతుంటే ‘మిస్టర్‌ చంద్రమౌళి’ అంటూ ఆ తండ్రిని ధైర్యంగా పిలిచి ఆమెను దడిపించేంత అల్లరి కుర్రవాడు. లైబ్రరీలో ఆమెకు ‘ఐ లవ్‌ యూ’ చెప్తే.. ‘వెళ్లి మైక్‌ పెట్టి ఊరంతా చెప్పుకోపో’ అని ఆమె చికాకు పడితే నిజంగానే మైక్‌ పెట్టి ఊరంతా చెప్పడానికి సిద్ధమైన దూకుడు కుర్రవాడు. భూతమైతే వీణ్ణి సీసాలో బంధించవచ్చు. కాని ఒళ్లంతా, హృదయమంతా నిండిపోయే ఉత్సవం అయితే ఎలా ఊడపెరకడం? తీసి పారేయడం. ఆమె అతణ్ణి ప్రేమించింది. ఆవేళ రిజిస్టర్‌ ఆఫీసులో పెళ్లి చేసుకోవాలనుకుంది. కాని ఆ ఆఫీసు మెట్ల మీదే అతడు బుల్లెట్‌ దెబ్బకు కుప్పకూలాడు. ఆమె కళ్లముందే కన్నుమూశాడు. ఆ బింబం ఆమెలో అలాగే ఉండిపోయింది. ఫ్రీజ్‌ అయ్యింది. దాని మీద ఏ కొత్త బింబమూ రావడం లేదు. ఇప్పుడు వచ్చిన భర్త బింబం అసలే ముద్ర పడటం లేదు. అదీ ఆమె సమస్య. ఆ సమస్యను చెప్పుకుంది.
అతడేం చేయాలి?

అయిష్టంగా ఇచ్చిన అమృతం కూడా విషమే. మనసు లేని భార్యతో సంసారం శవంతో సంసారమే. అతడు ఆమెను గౌరవించదలుచుకున్నాడు. ఆమె కోరిన విడాకులు ఇవ్వదలిచాడు. కాని అందుకు సంవత్సరకాలం గడువు ఉంటుందని చట్టం చెప్పింది. ఈ సంవత్సర కాలం వాళ్లిద్దరూ ఒకే కప్పు కింద ఉండాలి. కాని భార్యాభర్తలుగా మాత్రం కాదు. అపరిచితుల్లాగానే. అతడు ఆ మేరకు సిద్ధమవుతాడు. ఆమె నుంచి పూర్తిగా డిటాచ్‌ అయిపోతాడు. తన పనులు తాను. తన తిండి తాను. తన పక్క తాను. ఉన్నప్పుడు విలువ తెలియదు. కోల్పోతున్నప్పుడే తెలుస్తుంది. ఆమెకు మెల్లమెల్లగా ఆమె ఏం కోల్పోతున్నదో అర్థమవుతుంది. అతడు దూరమయ్యే కొద్దీ అతడి మీద ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఎంత చక్కనివాడు. సంస్కారవంతుడు. తన సంతోషం కోసం సహనం పాటించినవాడు. అంతకుమించి తనను ఎంతో అభిమానిస్తున్నవాడు. కాని అప్పటికే విషయం చేయి దాటిపోయింది. సంవత్సరం గడిచిపోయింది. విడాకులు చేతికి వచ్చేశాయి. అతడు దగ్గరుండి ట్రైన్‌ కూడా ఎక్కించేశాడు.ట్రైన్‌ బయలుదేరింది. కొందరికి ట్రైన్‌ తప్పితే జీవితం తప్పుతుంది. కాని ఆమెకు ఈ ట్రైన్‌ ముందుకెళితే జీవితం తప్పుతుంది.మనసులో పాత బింబం చెరిగిపోయింది. భర్త బింబం సంపూర్ణంగా స్థిరపడిపోయింది. ఆమెకు అతడు కావాలి.చైన్‌ లాగడం.. ట్రైన్‌ ఆగడం... గతం ఆ ఇనుప చక్రాల కింద నలిగిపోయి కొత్త జీవితానికి పచ్చ జెండా ఊపడం... ఒక మనోహరమైన జీవితం ఇప్పుడే మొదలైంది.

మణిరత్నం తొలి సక్సెస్‌
1986లో మణిరత్నం ఐదవ సినిమాగా వచ్చిన ‘మౌనరాగం’ అతడికి తొలి సక్సెస్‌ నమోదు చేసింది. ‘మౌనరాగం’తోనే మొదటిసారిగా మణిరత్నం పి.సి.శ్రీరాం జోడి ఖరారైంది. ఆ తర్వాత ఆ జంట ఎంత మేజిక్‌ చేసిందో తెలుసు. రేవతి స్థానంలో మొదట నదియాను, సుప్రియా పాఠక్‌ను అనుకున్నారు మణిరత్నం. కాని ఆ పాత్ర రేవతికి రాసి పెట్టి ఉంది. ‘పరిచయం లేని భార్యాభర్తలు ఎలా ఒకరికొకరు అడ్జస్ట్‌ అవుతారు’ అనే పాయింట్‌ తీసుకుని రాసుకున్న ఈ కథలో చివరి నిమిషంలో కార్తీక్‌ ఎపిసోడ్‌ జత పడింది. సినిమాలో నిజంగా మెరిసింది ఈ ఎపిసోడే. రేవతి పక్కింటి సిక్కుకి తప్పుల తెలుగు నేర్పించడం మంచి హాస్యం. ఇక ఇళయరాజా చేసిన ‘చిన్ని చిన్న కోయిలల్లే’, ‘మల్లెపూల చల్లగాలి’, ‘చెలి రావా’ పాటలు పెద్ద హిట్స్‌.
– కె.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top