ఖిల్ తే హై గుల్ యహా...

ఖిల్ తే హై గుల్ యహా...


శోభన్‌బాబు పర్సనల్ బ్రీఫ్‌కేస్‌లో ఎప్పుడూ రెండు ఫొటోలు ఉండేవి.  రెండూ శశికపూర్‌వే. ఒకటి పాతది. ఒకటి కొత్తది. ఒకటి  సన్నగా అందంగా ఉన్న ఫొటో. రెండోది లావుగా ఊబగా అయిపోయిన ఫొటో.  ‘శశికపూర్‌లా నేను మారకూడదు. తిండి దగ్గర ఆరోగ్యం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆ ఫొటోలు’ అని శోభన్‌బాబు చెప్పేవారు.

 

 శశికపూర్ అలా కావాలని అయ్యాడా?నిర్లక్ష్యంగా ఉన్నాడా?

 జెన్నిఫర్- బ్రిటిష్ నటి- నవ్వితే థేమ్స్ నది పలకరింపులా ఉండేది. శశికపూర్‌తో ప్రేమలో పడింది. దేశం కాని దేశం. భాష కాని భాష. సంప్రదాయం కాని సంప్రదాయం. పైగా కపూర్‌ల ఇంటి కోడలి హోదా.  ధైర్యంగా అడుగుపెట్టింది. శశికపూర్ అంటే ఆమెకు ఎంత ప్రేమ అంటే ఊబకాయం శాపంగా ఉన్న ఆ కుటుంబంలో శశి దాని బారిన పడకుండా అతణ్ణి వెజిటేరియన్‌గా మార్చింది. ఆ రోజుల్లోనే ఆర్గానిక్ ఫుడ్‌ను పరిచయం చేసింది. రోజూ ఈతకు వెళ్లాల్సిందే. వ్యాయామం చేయాల్సిందే. అందమైన మొగుణ్ణి అందంగా ఉంచుకోవాలి కదా.

 శశికపూర్ అందంగానే ఉన్నాడు- ఆమె జీవించి ఉన్నంత వరకూ.

 

 ఆ తర్వాత?

 కేన్సర్ జెన్నిఫర్‌ని చాలా చిన్న వయసులో తీసుకెళ్లి

 ్లపోయాక- ఆమె గుర్తుగా అతడికి నలుగురు పిల్లల్ని ఇచ్చి వెళ్లి

 పోయాక- శశికపూర్ మనిషిలా మిగల్లేదు. ఈ పేరూ ప్రతిష్ట డబ్బూ ఐశ్వర్యం ఎందుకు? ఆమే లేనప్పుడు తాను మాత్రం ఎందుకు? ధ్వంసం చేసేశాడు... మనసునూ శరీరాన్నీ. కసి.

 శోభన్‌బాబుకు ఈ కథ తెలిసి ఉండొచ్చు... తెలిసి ఉండకపోవచ్చు.

 కాని ప్రతి పర్యవసానం వెనుకా ఒక తెలియని ఉదంతం ఉంటుంది. ఇలాంటి ఉదంతం. శశికపూర్‌కు బాల్యం నుంచి ఒక్కటే తెలుసు.


 యాక్టింగ్.

 తండ్రి పృధ్వీరాజ్ కపూర్ పెద్ద నటుడు. అన్న రాజ్‌కపూర్ స్టార్. మరో అన్న షమ్మీ కపూర్‌ది అదే దారి. తనకేం తక్కువ? ‘ఆగ్’, ‘ఆవారా’ సినిమాల్లో రాజ్‌కపూర్‌కు చిన్నప్పటి వేషం వేసేశాడు. అందరూ బాగా చేస్తున్నావ్ అన్నారు. ఇంకేంటి? పెద్దయ్యాక స్టార్ కావడమే. పెద్దయ్యాడు. స్టార్ కాలేదు. రోజులు, వారాలు, సంవత్సరాలు గడిచిపోయాయి. తనలాగే వేషాల కోసం తిరుగుతున్న మనోజ్ కుమార్‌కు రూమ్మేట్ అయ్యాడు. అతణ్ణి దొందు అన్నారు. ఇతణ్ణీ దొందే అన్నారు. దొందూ దొందే. మా నాన్న... మా తాత అక్కడ చెల్లవు. నువ్వు గొప్పవాడివా కాదా అది తేల్చు ముందు అన్నారు. ఏవో ఒకటి రెండు సినిమాలు వచ్చాయి. కాస్తో కూస్తో ఆడుతూ ఉన్నాయి. కొన్ని డింకీలు. నెమ్మదిగా పేరు వచ్చింది. ఫ్లాప్ హీరో!

 హీరోయిన్లు శశికపూర్ పేరు చెప్తేనే పారిపోతున్నారు. అతడు తప్ప ఎవరైనా సరే. ఏం చేయాలి? అప్పుడొక ఆపద్బాంధవురాలు అతడికి తారసపడింది. నీకేంవోయ్ చాలా మంచి

 యాక్టర్‌వి అని ధైర్యం చెప్పింది. నీ పక్కన నేను యాక్ట్ చేస్తాను ఉండు అని ముందుకు వచ్చింది.

 హీరోయిన్ నంద! ఇద్దరూ

 కలిశారు. పూలు విరబూసే కాలం వచ్చింది. విరబూశాయి.

 

 జబ్ జబ్ ఫూల్ ఖిలే!

 పెద్ద హిట్. మ్యూజికల్ హిట్. ఒక రొమాంటిక్ హీరో జన్మెత్తాడు. అవును. పులి కడుపున పులే

 పుడుతుంది. కాకుంటే పంజా దెబ్బ కొంత ఆలస్యంగా తగిలింది. శశి

 కపూర్ విజృంభించాడు. ‘నీంద్ హమారి ఖ్వాబ్ తుమ్హారే’, ‘రూఠా న కరో’. ‘మొహబ్బత్ ఇస్కో కెహెతే హై’... అన్నీ నందాతోనే. అన్నీ హిట్. ఇవి వస్తుండగానే  అటు బి.ఆర్.చోప్రా ‘వక్త్’, ఇటు మన  ‘ప్రేమించి చూడు’  రీమేక్ ‘ప్యార్ కియా జా’.... సినిమాల వెంట సినిమాలు. సరిగ్గా అప్పుడే బెంగాల్ నుంచి ఒక పిల్లతెమ్మెర బయలుదేరి బొంబాయి తీరాన్ని తాకింది. పేరడిగితే ‘రాఖీ’ అన్నారు. శశి

 కపూర్‌తో ఒక సినిమా అని కూడా అన్నారు. బంగారం ఉంది. తావి వచ్చింది. బంగారానికి తావి అబ్బడం అంటే ఏమిటో ప్రేక్షకులకు తెలిసింది.

 

 ఖిల్ తే హై గుల్ యహా ఖిల్ కె బిఖర్ నే కో...

 ‘షర్మిలీ’-
సూపర్ డూపర్ హిట్. అందులోని పాటలు... ఇప్పటికీ హిట్.

 సరే... ఇవన్నీ ఎవరైనా చేయగలరు. దేశం ఉలిక్కిపడేలా చేయగలగాలి. అలాంటి పాత్ర ఒకటి తగలాలి. తగిలింది. దీవార్!

 

 అమితాబ్ కంటే శశికపూర్

 వయసులో పెద్దవాడు. కాని ‘దీవార్’లో అతడి తమ్ముడి వేషం వేశాడు. సినీ

 పరిశ్రమ దస్తూర్ అలాగే ఉంటుంది. ‘రోటీ కపడా మకాన్’లో తాను లీడ్ రోల్ చేస్తున్నప్పుడు అమితాబ్ చేతులు

 కట్టుకుని చాలా చిన్నపాత్ర వేస్తున్నాడు. ఇవాళ అతడు స్టార్‌డమ్‌కు వస్తే తాను చిన్న పాత్ర వేస్తున్నాడు. కాని అతడికి తెలుసు. పాత్ర చిన్నదైనా గొప్ప నటుడికి ఒక్క సన్నివేశం చాలు. ఒక్క డైలాగైనా ఏం? ఆ సినిమాలో ఆ నిర్మానుష్యమైన రాత్రి.... ఆ పాతకాలపు వంతెన...

 స్మగ్లర్‌గా మారిన అన్న... నీతి కోసం

 నిలబడిన ఇన్‌స్పెక్టర్ తమ్ముడు.... అన్న తనని తాము సమర్థించుకుంటున్నాడు... తమ్ముడి మీద ఆధిక్యం ప్రదర్శిస్తున్నాడు.

 

 ‘మేరే పాస్ బిల్డింగే హై..

 ప్రాపర్టీహై.. బ్యాంక్ బేలన్స్ హై... బంగ్లా హై... గాడీ హై... తుమ్హారే పాస్ క్యా ైెహ ?’...


 తమ్ముడు జవాబు చెప్పాలి. ఎలా చెప్పాలి?  

 పొగరుగా కాదు. అహంకారంగా కాదు. తల ఎగరేస్తూ కాదు. ఆదర్శం ఎంత వినమ్రంగా ఉంటుందో అంత వినమ్రంగా. జవాబు చెప్పాడు.


 

 ‘మేరే పాస్ మా హై’....

 చిన్న డైలాగ్. దేశమంతా లేచి చప్పట్లు కొట్టింది. ఇవాళ్టికీ కొడుతూనే ఉంది.

 మేరే పాస్ మా హై...

 

 అమితాబ్, ధర్మేంద్ర, రాజేష్‌ఖన్నా, జితేంద్ర, శతృఘ్నసిన్హా... ఈ దుమారంలో వీళ్ల  కంటే ఎక్కువగా బిజీని అనుభవించినవాడు శశి కపూర్. ఎక్కువ సంపాదించినవాడు కూడా. ప్రతి సినిమాలో శశికపూర్ కావాలి. ఏ పాత్ర అయినా అతడే వేయాలి. ఎందుకంటే ఏ పాత్ర వేసినా తాను సినిమాకు బలంగా నిలుస్తాడు. అంతే తప్ప సినిమాను తనకు బలంగా చేసుకోడు. అది గమనించిన అమితాబ్ శశికపూర్‌ను దశాబ్దాల పాటు వదల్లేదు. ‘సుహాగ్’, ‘దో ఔర్ దో పాంచ్’, ‘కాలా

 

 పత్థర్’, ‘కభీ కభీ’, ‘త్రిషూల్’, ‘షాన్’... ఒక దశలో పత్రికలు శశికపూర్‌ని ‘అమితాబ్ ఫేవరెట్ హీరోయిన్’గా కితాబిచ్చాయి. తేడాగా ఉన్నా ప్రశంస ప్రశంసే. బిజీ కొనసాగింది. అది కూడా ఎంతగా అంటే రాజ్ కపూర్ అడిగితే ‘సత్యం శివం సుందరం’కు శశికపూర్ దగ్గర డేట్స్ లేవు! దాంతో ఒళ్లు మండిన రాజ్‌కపూర్ అతడికి ‘టాక్సీ కపూర్’ అని బిరుదు ఇచ్చాడు. రోజుకి రెండు మూడు షిఫ్టుల్లో పని చేస్తూ ఎప్పుడూ ఒక స్టుడియో నుంచి ఇంకో స్టుడియోకి ప్రయాణిస్తూ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సినిమాలు సైన్ చేస్తున్నాడని రాజ్‌కపూర్ కంప్లయింట్.

 కాని తానేం చేయగలడు? అన్నను మించిన తమ్ముడు.

 

 కాని నిజానికి ఇదంతా నటన. కాదు కాదు ఇదసలు నటనే కాదు. శశి కపూర్‌కు ఆ సంగతి బాగా తెలుసు. ‘థర్డ్‌రేట్ స్టంట్‌మేన్‌కు ఇవ్వాల్సిన వేషాలన్నీ నాకిస్తున్నారు’ అని చిరాకు పడ్డాడు చాలాసార్లు. తనలోని నటుణ్ణి అతడు ఈ చెత్త సినిమాలతో మరణశయ్య ఎక్కించలేదు. సజీవంగా ఉంచడానికి తండ్రి వారసత్వంగా వదిలివెళ్లిన ‘పృథ్వీ థియేటర్స్’ బాధ్యతలు తీసుకున్నాడు. ఇంగ్లిష్ నాటకాలు వేశాడు. ఇస్మాయిల్ మర్చంట్‌తో కలిసి అనేక ఇండో

 అమెరికన్ సినిమాల్లో నటించాడు. సత్యజిత్ రే దర్శకత్వంలో సినిమాల కోసం, టీవీ కోసం యాక్ట్ చేశాడు.

 

 అంతటితో

 ఊరుకోక  తానే సొంత నిర్మాణ సంస్థ- ఫిల్మ్ వాలాస్-  స్థాపించి శ్యామ్ బెనగళ్ (కలియుగ్, జునూన్), గోవింద్

 నిహలాని (విజేత), అపర్ణా సేన్ (36 చౌరంగీ లేన్) వంటి

 పారలల్ దర్శకులతో పారలల్ సినిమాలు తీశాడు. డబ్బు సంపాదించడం ఉద్దేశం కానే కాదు. చిన్న ఫ్రేమ్... చిన్న షాట్.. చిన్న డైలాగ్... ఒక నటుడి ఆకలి తీర్చేది. ప్రయోగాలకు వెనుకాడలేదు.  గిరిష్ కర్నాడ్ దర్శకత్వంలో ‘ఉత్సవ్’... శశి కపూర్ ఏదో అనుకుని తీశాడు. దేశం మరేదో అనుకుని చూసింది. పెద్ద హిట్. వెంట వైఫల్యం లేకపోతే మజా ఏముంది? ‘అజూబా’ తీశాడు. ముక్కు కాలింది. మంచిదే.

 

 హిందీ సినిమాల్లో రొమాంటిక్ హీరో అంటే దేవ్ ఆనంద్. తర్వాత?

 శశి కపూర్. అందరు హీరోయిన్లు ఆయన పక్కన నటించడానికి ఇష్టపడ్డారు. సాధన, ముంతాజ్, మౌసమీ చటర్జీ, జీనత్ అమాన్, హేమమాలిని... ఆ

 సినిమాలూ ఆ పాటలూ జనం మెచ్చారు.

 శశికపూర్ ఖాతాలో చాలా హిట్ పాటలున్నాయి. లిస్టు రాస్తే వేళ్లు నొప్పి పుడతాయి. హమ్ చేస్తే అంటుకుని వెంట

 బడతాయి.


 ‘పర్ దేశియోంసే న అఖియా మిలానా’ (జబ్ జబ్ ఫూల్ ఖిలే)

 ‘తుమ్ బిన్ జావూ కహా’ (ప్యార్ కా మౌసమ్)

 ‘లిఖ్ఖే జో ఖత్ తుఝే’ (కన్యాదాన్)

 ‘వాదా కరో నహీ ఛోడోగే తుమ్ మేరా సాథ్’ (ఆ.. గలే లగ్‌జా)

 ‘ఏక్ డాల్ పర్ తోతా బోలే’ (చోర్ మచాయే షోర్)

 ‘కెహదూ తుమ్హే యా చుప్ రహూ’ (దీవార్)

 

 షారూక్‌ఖాన్ చాలా రుణపడి ఉన్నాడు శశికపూర్‌కి. ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ టైటిల్ శశికపూర్ యాక్ట్ చేసిన ‘చోర్ మచాయే షోర్’ సినిమా పాటలోనిదే. ఇటీవల వచ్చిన ‘జానే తూ యా జానేనా’... హిట్ సినిమా కూడా శశికపూర్ పాటే. ఇంకా వేయి పాటలు ఉండవచ్చు.


 కాని శశికపూర్ అంటే ఒకే పాట... ఒకటే జ్ఞాపకం...

 ఖిల్ తే హై గుల్ యహా.. ఖిల్ కే బిఖర్ నే కో...

 దాదాసాహెబ్ ఫాల్కే వచ్చిన సందర్భంగా ఈ అందమైన నటుడికో గులాబీ పూమాల.

 - ఖదీర్


 




 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top