అందువల్లనే థియేటర్లకు రావడం లేదేమో!

garudavega editer dharmendra kakarala interview - Sakshi

‘‘నా స్వస్థలం ఏలూరు. సినిమాలంటే ఆసక్తి. దర్శకుడు కావాలన్నది నా గోల్‌. నాన్నగారి సలహా మేరకు సత్యజిత్‌ రే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఎడిటింగ్‌లో పీజీ డిప్లొమా చేశా’’ అన్నారు ఎడిటర్‌ ధర్మేంద్ర కాకరాల. రాజశేఖర్‌ హీరోగా ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో ఎం. కోటేశ్వరరాజు నిర్మించిన ‘పి.ఎస్‌.వి గరుడవేగ’ సినిమాకి ధర్మేంద్ర ఎడిటర్‌గా వర్క్‌ చేశారు. ‘‘నా తొలి బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌ ‘గరుడవేగ’ అని ధర్మేంద్ర చెబుతోన్న విశేషాలు...

► ఎడిటర్లు శ్రీకర్‌ప్రసాద్, మార్తాండ్‌ కె. శంకర్‌లు నాకు స్ఫూర్తి. ఎడిటర్‌గా ‘ప్రస్థానం’ నా తొలి సినిమా. ఎడిటర్‌ శ్రవణ్‌ నా బ్యాచ్‌మేట్‌. తను బిజీగా ఉండటంతో ఆ సినిమా అవకాశాన్ని నాకు ఇప్పించారు. ఆ సినిమా తర్వాత అవకాశాల కోసం ఎదురుచూసే అవసరం రాలేదు. ఫిల్మ్‌ ఎడిటింగ్‌కీ, డిజిటల్‌ ఎడిటింగ్‌కీ మాన్యువల్‌ వర్క్‌ తగ్గిందే తప్ప... బ్రెయిన్‌ పరంగా కాదు. డిజిటల్‌ ఎడిటింగ్‌లో సగం టైమ్‌ తగ్గుతోంది. నాగచైతన్య ‘దడ’ ఎడిటర్‌గా నాకు పెద్ద సినిమా. నా మూడో సినిమా కూడా! భారీ డిజాస్టర్‌ అది. అందుకే పెద్ద సినిమా అవకాశాలు రాలేదనుకుంటున్నా.

► మన సినిమాలు జనరల్‌గా 2కె ఔట్‌పుట్‌లోనే ఉంటాయి. ‘బాహుబలి’ తర్వాత ‘గరుడవేగ’కి మాత్రమే 4కె రిజల్యూషన్‌ అవుట్‌పుట్‌ ఇచ్చాం. అందుకే క్వాలిటీకి అంత అభినందనలొస్తున్నాయి. 4కె టెక్నాలజీలో చేయాలంటే ఖర్చు ఎక్కువ. అందువల్ల, నిర్మాతలు ఒప్పుకోరు. ఫిల్మ్‌ క్వాలిటీగా ఉంటేనే... ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. ఇప్పుడు యూట్యూబ్‌లో క్వాలిటీ పెంచుకుని చూస్తే ఎలా ఉంటుందో... స్క్రీన్‌పైనా అలాగే ఉంటోంది. అందుకే, థియేటర్స్‌కి ప్రేక్షకులు తగ్గిపోతున్నారేమో! అని నా ఫీలింగ్‌.

► ట్రైలర్స్‌ కట్‌ చేసేవాళ్లు ఎడిటర్‌ కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. అది పబ్లిసిటీ. ‘గరుడవేగ’ ఎడిటింగ్‌కి 195 రోజులు వర్క్‌ చేశాం.

► రెండేళ్ల తర్వాత డైరెక్షన్‌ చేద్దామనుకుంటున్నా. కథ రెడీ చేసుకుంటున్నా. పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌తో పాటు శ్రేష్ట్‌ మూవీస్‌లో ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం చేయబోతున్న సినిమాలకు నేను పనిచేయబోతున్నా. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top