
ఆ సినిమా చూస్తే బిరియానీ ఫ్రీ!
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తాజా సినిమా ‘దొడ్మనేహుడుగ’ విడుదల సందర్భంగా వినూత్న ఆఫర్ ప్రకటించారు.
బెంగళూరు: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్, రాధికా పండిట్‌లు హీరో హీరోయిన్లుగా రెబెల్‌స్టార్ అంబరీశ్, భారతీ విష్ణువర్ధన్ తదితర భారీ తారాగణంతో దునియా సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొడ్మనేహుడుగ’ భారీ చిత్రం ఈనెల 30న విడుదలకానుంది. శాండిల్‌వుడ్‌లో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాపై కన్నడ ప్రేక్షకులు వేయి కన్నులతో వేచి చూస్తున్నారు. ఈ సందర్భంగా అభిమానులు వినూత్న ఆఫర్ ప్రకటించారు. మొదటి ఆట వీక్షించే ప్రేక్షకులకు ఉచిత బిరియానీ, లడ్డూలను పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రంలో హీరో పునీత్‌రాజ్‌కుమార్ రోడ్డుపై బిరియానీ తయారు చేసే పాత్రలో నటిస్తున్నందున అందుకు తగిన విధంగా ‘దొడ్మనే బిరియాని’ పేరుతో ప్రేక్షకులకు ఉచితంగా బిరియానీ అందజేస్తున్నట్లు పునీత్ అభిమానులు తెలిపారు. పునీత్‌కు ఇది 25వ సినిమా కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
మరోవైపు బెంగళూరు నగరంలోని చామరాజ్‌పేటకు చెందిన గణేశ్ స్వీట్స్ యజమాన్యం ఆధ్వర్యంలో ప్రేక్షకులకు రాజ్‌కుమార్ లడ్డూలను పంపిణీ చేయనున్నట్లు సమాచారం.
బిరియానీతో పాటు చిత్రం విడుదల సమయంలో థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న పునీత్‌రాజ్ కుమార్ భారీ కటౌట్‌కు అభిమానులు రూ.25 లక్షలు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.