ప్రభుత్వానికి ప్రజల సహకారం అవసరం

Chiranjeevi Movie Shooting Postponed Due To Coronavirus - Sakshi

కోవిడ్‌ నియంత్రణకు అందరూ సహకరించండి: మెగాస్టార్‌ చిరంజీవి 

తన సినిమా షూటింగ్‌లను వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా ప్రజల సహకారం అవసరమని మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్‌ చిరంజీవి పిలుపునిచ్చారు. ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోందని, మరింత అప్రమత్తం అవసరమని పేర్కొన్నారు. తన సినిమా షూటింగ్‌లను తక్షణం వాయిదా వేసుకుంటున్నట్లు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కోవిడ్‌ నియంత్రణ బాధ్యత ప్రభుత్వాలకే వదిలేయకుండా అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. అందరిలో చైతన్యం కలిగించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానని పేర్కొన్నారు. కోవిడ్‌ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్విముఖ వ్యూహం అనుసరిస్తున్నాయని కొనియాడారు. కరోనా సోకిన వారికి తగిన చికిత్స అందించడం, వైరస్‌ వ్యాప్తి కాకుండా జనాలు గుమికూడకుండా క్రీడల్ని వాయిదా వేయడం, మాల్స్, సినిమా హాల్స్‌ మూసివేయడం, స్కూల్స్, కళాశాలలకు సెలవులు ప్రకటించడం తదితర చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ అందరిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ముందస్తు నివారణ చర్యలు ప్రారంభించినట్లు తెలుసుకున్నానని, పరిస్థితులకు అనుగుణంగా ఆయన కూడా తగిన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, సినిమా షూటింగ్స్‌లో పెద్ద సంఖ్యలో సాంకేతిక నిపుణులు పనిచేయాల్సి ఉంటుందని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 10 నుంచి 15 రోజుల పాటు షూటింగ్స్‌ వాయిదా వేస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతున్న సినిమా షూటింగ్‌ను వాయిదా వేయాలని దర్శకుడు కొరటాల శివతో చెప్పగా, ఆయన అంగీకరించారని వివరించారు. కోవిడ్‌ నియంత్రణలో సినీరంగం కూడా పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top