అంజలికే అగ్రస్థానం

actress Anjali is keen on the top - Sakshi

తమిళసినిమా: నటి అంజలికే అగ్రస్థానం అంటే ఆసక్తిగా ఉంది కదూ. ఆ ఆరణాల తెలుగమ్మాయి ఏం సాధించింది? ఎందుకు అగ్రస్థానం ఇచ్చారు? లాంటి సందేహాలు కలగడం సాధారణమే. అయితే అంజలి నటిగా మంచి పేరునే తెచ్చుకుంది. ఇటు తమిళంలోనూ, అటు తెలుగులోనూ తనకుంటూ ఒక మార్కెట్‌ను సంపాదించుకుంది. వరుసగా అవకాశాలను అందుకుంటోంది. తాజాగా అదనంగా మలయాళం చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా బహుభాషా నటిగా రాణించడం అంజలి నట కెరీర్‌కు మంచి ప్లస్‌ అయ్యిందనే చెప్పాలి. ఇతర భాషల్లో మార్కెట్‌ ఉన్న తమిళ హీరోలు నటి అంజలి తరహా బహుభాషా నటీమణులను నాయకిగా ఎంపిక చేసుకుంటున్నారు.  అలాంటి హీరోలలో నటుడు, సంగీత దర్శకుడు విజయ్‌ఆంథోని కూడా చేరారు. ఆయన నటించిన పిచ్చైక్కారన్‌ చిత్రం తెలుగులో బిచ్చగాడు పేరుతో అనువాదమై కాసుల వర్షం కురిపిం చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన నటించిన చిత్రాలకు తెలుగులోనూ మంచి డిమాండ్‌ ఏర్పడింది.

తాజాగా విజయ్‌ఆంథోని నటిస్తున్న చిత్రం కాళీ. గతంలో రజనీకాంత్‌ నటించిన టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి చిత్ర వర్గాల్లో మంచి క్రేజ్‌ సంతరించుకుందనే చెప్పాలి. ఇంతకు ముందు వణక్కమ్‌ చెన్నై చిత్రాన్ని తెరకెక్కించిన కృతిక ఉదయనిధి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాళీ. ఇందులో విజయ్‌ఆంథోనికి జంటగా సునైనా, అమృతలను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. తాజాగా నటి అంజలి కూడా ఈ చిత్రంలో భాగమైంది. అంతే కాదు ఆమె క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కాళీ చిత్రంలో మిగిలిన ఇద్దరు హీరోయిన్ల కంటే అంజలికే పాత్ర పరంగా అగ్రస్థానం కల్పించారట. ఇందుకు కారణం తెలుగు వ్యాపారం కోసమేనన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉండదనుకుంటా. అంజలి నటించిన బెలూన్‌ చిత్రం మంచి ఆదరణే అందుకుందన్నది గమనార్హం. 

Back to Top