వారిది అజరామర ప్రేమ కథ | Prithviraj Chauhan Samyukta Eternal Love | Sakshi
Sakshi News home page

వారిది అజరామర ప్రేమ కథ

Nov 23 2019 3:39 PM | Updated on Nov 23 2019 3:46 PM

Prithviraj Chauhan Samyukta Eternal Love - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

స్వయంవర ప్రాంగణం సందడిగా ఉంది. ఎక్కడెక్కడి నుండో వస్తున్న రాకుమారుల అందాల వెలుగులతో నిండి ఉంది. అదే సమయంలో ఉత్కంఠతో వాతవరణం వేడివేడిగా ఉంది. ‘‘ఎవరు గెలుస్తారు? ఆ భువనైక సుందరి చేయిపట్టుకునే అదృష్టవంతుడెవరో!’’ ఎడతెగని ఊహలు.. అంచనాలు ఈలోపే నవ్వులు‘‘ అటు చూడండి. పృథ్వీరాజ్‌ చౌహాన్‌’’  స్వయం వరం జరిగే మందిరం ముందు.. మట్టితో చేసిన పృథ్వీరాజ్‌ నిలువెత్తు రూపం కనిపిస్తోంది. వీరుడిగా కాదు. ద్వార పాలకుడి రూపంలో! ఢిల్లీ, అజ్మీర్‌.. రెండు రాజధానులతో రాజ్య పాలన చేస్తున్న వీరుడిని ద్వారపాలకుడి రూపంలో చూడడం కొంతమందికి నచ్చలేదు. . అతనిపై కోపం, అసూయ ఉన్న వాళ్లకు మాత్రం బాగా నచ్చింది. కనౌజ్‌(ఉత్తరప్రదేశ్‌) రాకుమారి సంయుక్త అందానికి మారుపేరైతే, పృథ్వీ రాజ్‌ చౌహాన్‌ వీరత్వానికి నిలువెత్తు నిర్వచనం. చౌహాన్‌ గురించి ఆ నోటా ఈ నోటా విన్న సంయుక్త.. అతడి ప్రేమలో పడిపోయింది.

తన ప్రేమను దూతల ద్వారా చౌహాన్‌కు తెలియజేసింది. అలా వారి ప్రేమ ప్రయాణం మొదలై రహస్యంగా కొనసాగుతోంది. ఈ ప్రేమ గురించి సంయుక్త తండ్రి రాజా జైచంద్‌కు ఉప్పందింది. దాంతో వెంటనే స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఈ స్వయంవరానికి చౌహాన్‌ తప్ప రాజులందరినీ ఆహ్వానించాడు. సేవకుడి రూపంలో చౌహాన్‌ బొమ్మను గుమ్మం దగ్గర పెట్టి కసి తీర్చుకున్నాడు. ప్రత్యేక కారణమంటూ ఏదీ లేకపోయినా చాలా మంది రాజులలాగే చౌహాన్‌ అంటే జైచంద్‌కు అసూయతో కూడిన కోపం. అందమైన నగలతో, వాటి కంటే అందమైన చిరు నగువులతో, చేతిలో వరమాలతో నడిచొస్తోంది సంయుక్త. ‘ఆ మాల పడేది నా మెడలోనే’ అనుకుంటున్నారు ఎవరికి వారు. వాళ్లలో తన కూతురు ఎవరిని ఎంచుకుంటుందో అని కుతూహలంగా చూస్తున్నాడు జైచంద్‌. ఒకటి రెండు మూడు ఎందరో రాకుమారుల ముందునుంచి నడుచుకుంటూ పోతోంది సంయుక్త.

అలా వెళ్లి వెళ్లి ద్వారం దగ్గర పెట్టిన పృథ్వీరాజ్‌ చౌహాన్‌ విగ్రహం మెడలో ఆ వరమాల వేసింది. సభాసదులు ఆశ్చర్యపోయారు. అంతలోనే మరో మహాశ్చర్యం..! విగ్రహం వెనకాల దాగున్న చౌహాన్‌ వీరఖడ్గంతో బయటకు వచ్చాడు!! తాము చూస్తున్నది వాస్తవమో కలో అందరూ నిర్ధారించుకునేలోపే.. సంయుక్తను తీసుకుని మాయమయ్యాడు. గుర్రపుబండి వేగంగా వెళుతోంది. ‘‘ఇంకా వేగంగా, వాళ్లకి మనం దొరక్కూడదు’’ అరిచింది సంయుక్త. ఎన్నో రాజ్యాలను ఒంటిచేత్తో జయించి చౌహాన్‌ సామ్రాజ్యం బలోపేతం కావటానికి కారకుడైన పృథ్వీరాజ్‌కు ఇది కొత్త అనుభవం. ‘ మీ సైనికులకు చిక్కినా సరే నీ కోసం హాయిగా చనిపోతాను.’’ అన్నాడు ఆమె కళ్లలోకి చూస్తూ. పృథ్వీరాజ్‌- సంయుక్తల పెళ్లి ఇద్దరు వ్యక్తుల ప్రేమ వ్యవహారంగా మాత్రమే మిగిలిపోలేదు. రెండు రాజ్యాల మధ్య వైర్యాని​ పెంచింది. ఘోరీ సైన్యాల చేతిలో పృథ్వీరాజ్‌ మరణించడానికి కూడా ఈ వైరమే కారణమనే వాదన కూడా ఉంది.

పృథ్వీరాజ్‌ వ్యక్తిత్వాన్ని, సామర్థాన్ని చాలా మంది చాలా రకాలుగా అంచనా వేశారు. అయితే వీటన్నిటిలో ప్రామాణికంగా నిలిచింది మాత్రం పృథ్వీరాజ్‌ బాల్యమిత్రుడు, అతడి ఆస్థాన కవి అయిన చాంద్‌ బర్దా రాసిన ‘పృథ్వీరాజ్‌ రసో’8 కావ్యం. పృథ్వీరాజ్‌ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించిందా కావ్యం. యుద్దఖైదీగా పృథ్వీరాజ్‌ను బంధించి చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, ఆయన మరణాన్ని తట్టుకోలేక సంయుక్త ఆత్మహత్యకు పాల్పడిందనేది ఒక కథనం. నిజానికి వీరి ప్రేమ గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కథనాలు వేరైనా సారాంశం మాత్రం ఒకటే. ప్రేమకు శతృత్వాల సరిహద్దులతో పనిలేదని, శతృవుపై కత్తి దూసే వీరు సైతం ప్రేమ గాలి సోకితే కత్తిని వదిలి గులాబీలను చేతపడతాడని. అందుకే పృథ్వీరాజ్‌, సంయుక్తల గాథ ఓ అజరామర ప్రేమ కథగా చరిత్ర పుటల్లో మిగిలిపోయింది.
- యూకూబ్‌ పాషా


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement