ప్రేమ రుచి చూపి గుండెకు గాయం చేసింది

Kumaraswami Sad Ending Telugu Love Story - Sakshi

నేను ఇంజనీరింగ్‌ చదువుతున్న రోజులవి. రోజూలాగే కాలేజీకి వెళ్లాను. అయితే ఆ రోజు నాకు ల్యాబ్‌ ఉంటుందనే విషయం మర్చిపోయి ల్యాబ్‌ ఆప్రాన్ తీసుకువెళ్లలేదు. ఎప్పటిలాగానే ఆ రోజు కూడా ల్యాబ్‌ అవర్‌ మధ్యాహ్నం​ రెండు గంటలకు ఉంది. నేను లంచ్‌  ముగించుకుని ఆప్రాన్‌ వేటలో పడ్డాను. అనుకోకుండా నా అడుగులు మా జూనియర్స్‌ క్లాస్‌ రూం వైపు పడ్డాయి. జూనియర్స్‌ రూంలోకి వెళ్లాను.  భోజనం ముగించుకుని అమ్మాయిలు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. నేను ఆ అమ్మాయిల వైపు చూస్తూ.. ‘‘ఎవరైనా ఆప్రాన్‌ ఇస్తారా?’’ అని అడిగాను. ఏ మాత్రం ఆలోచించకుండా ఓ అమ్మాయి తన చేతిలో ఉన్న ఆప్రాన్‌ తీసి ఇచ్చింది. అంతమందిలో ఎలాంటి మోహమాటం లేకుండా ఇవ్వడంతో నాకు ఆ అమ్మాయి మీద ఏదో తెలియని ఆకర్షణ కలిగింది. అలాంటి ఆకర్షణ ఇంతకు ముందు ఏ ఇతర అమ్మాయి మీద నాకు కలగలేదు. ఆ రోజు ఆమె ఇచ్చిన ఆప్రాన్‌ వేసుకుని తను నన్ను ప్రేమగా హత్తుకున్నట్లు, నేను తన ఒళ్లో ఒదిగిపోయినట్టు ఫీల్‌ ఆయ్యాను.

అప్పటి నుంచి తనను కాలేజీలో ఫాలో అవటం నాకు ఓ వ్యసనంగా మారింది. తన స్నేహితుడి( మురళీ)తో ఆమె ఫోన్‌ నెంబర్‌ కనుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే తను, నేను మాట్లాడుకోవడానికి మురళీ చాలా కష్టపడ్డాడు అనటంలో సందేహం లేదు. వాడు నా గురించి ఆ  అమ్మాయికి చెప్పి నాకు ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు. ఆ రోజు నాకు ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలిగింది. వెంటనే ఏమాత్రం అలోచించకుండా కాల్‌ చేసి మాట్లాడి! నా మనస్సులో ఉన్న ప్రేమను, తనపై ఉన్న ఇష్టాన్ని చెప్పాను. అదేంటో ప్రేమించిన అమ్మాయితో అంత త్వరగా ఎవ్వరూ ప్రేమను బయటపెట్టరు. కానీ, నేను నిజాయతీగా, స్వచ్ఛంగా ప్రేమిస్తున్నాకదా! ఆ ప్రేమే నాలో ధైర్యాన్ని నింపి ఆమెతో మాట్లాడించింది. తనకు ఇష్టం అయితే పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పేంత ధైర్యం వచ్చింది మరి! అలా నాకు కాలేజీలో తనను చూడకుండా రోజు గడిచేది కాదు. తనతో ఫేస్‌బుక్‌, మొబైల్‌ మెసెజ్‌లతో చాటింగ్‌ చేస్తూ ఉండేవాడిని. నేను ప్రేమ అంటే.. ఆమె స్నేహం అనేది.

స్నేహితుడిగా మాత్రమే చూస్తాను అని చెప్పేది. ప్రేమించిన అమ్మాయితో స్నేహం చేయడం నాకు సాధ్యం కాదన్నాను. నా ప్రేమను అంగీకరించడానికి ఎంత టైం కావాలో తీసుకోండి అని తెలిపాను. తనపై ఎంత ప్రేమ చూపినా నా ప్రేమ తన మనస్సుకు తాకలేదు! నాపై ప్రేమా పుట్టలేదు. ఆపై నాతో ఫోన్‌లో మాట్లాడటం మానేసింది. కానీ, తనపై నా ప్రేమ  సజీవంగా ఉండిపోయింది. ఎప్పటికైనా తన మనస్సు మారుతుందని, నన్ను ప్రేమిస్తుందని గట్టిగా నమ్మేవాడిని. ఆ నమ్మకంతోనే  చాలా రోజుల పాటు తనకు పుట్టిన రోజు, క్రిస్మస్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపేవాడిని, ఏదో రిప్లై ఇవ్వాలి అన్నట్టుగా కృతజ్ఞతలు పంపేది. కొన్ని రోజులకు ఎస్‌ఎంఎస్‌లు పంపి తనను విసిగించవద్దని ఆగ్రహించింది. ప్రేమా లేదు గీమా లేదు అని కరాఖండిగా చెప్పింది. అప్పుడు నా గుండె వెయ్యి ముక్కలు అయినట్టు నా జీవితంలో ఒక్కసారిగా చీకటి అలుముకున్నట్లు తోచింది. కొద్ది రోజులు కోలుకోలేదు. నిజాయతీగా ప్రేమిస్తే అమ్మాయిలు ఎందుకు తిరస్కరిస్తారని కుమిలిపోయేవాడిని. కానీ, తను గుర్తు వచ్చినప్పడు మాత్రం హయ్‌, ఎలా ఉన్నావ్‌ అంటూ.. ఎస్‌ఎంఎస్‌లు పంపడం మానలేదు. వాటికి రిప్లేలు వచ్చేవి కావు.

కానీ నాకు తనకు ఎస్‌ఎంఎస్‌ పంపాను అనే భావన ఒక తృప్తి మిగిల్చేది. ఒక రోజు నేను తనకి హాయ్‌ ఎలా ఉన్నారు? అనే ఎస్‌ఎంఎస్‌ పెట్టాను. కొంత సమయానికి నాకు మురళి నుంచి కాల్‌ వచ్చింది. నేను కాల్‌ ఎత్తగానే ‘  అన్నా తనకు నువ్వంటే ఇష్టం లేదంటా.. కాల్‌, ఎస్‌ఎంఎస్‌లు చేసి ఇబ్బంది పెట్టకూ’’ అంటూ చెప్పి కాల్‌ కట్‌ చేశాడు. మురళి వల్లనే కీర్తితో మాట్లాడగలిగాను. అందుకే వాడి మీద గౌరవంతో​ అమెకు కాల్‌, ఎస్‌ఎంఎస్‌లు చేయడం మానేశాను. కానీ, తనను ప్రేమించడం, నా హృదయాలయంలో ఆరాధించడం మానుకోలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు ఏ అమ్మాయి మీద కలగని గౌరవం, ఇష్టం, ప్రేమ ఆమెపై ఉండటమే కారణం. ఒక ఏడాది తర్వాత మురళికి కాల్‌ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాను. ఆ సమయంలో మురళి నాతో ఒక విషయం చెప్పాలన్నాడు. తాను ఒక ఏడాదిపాటు పడ్డ మానసిక క్షోభ గురించి అన్నాడు. అన్నా నేను ఒక అమ్మాయి చేతిలో మోసపోయాను.

ఆ అమ్మాయి నీకు తెలుసు అన్నాడు. నాకు ఒక్క క్షణంలో ఆ ఆమ్మాయి నేను ప్రేమించిన ఆమ్మాయే అనే అనుమానం వచ్చింది. వాడి మాటలు పూర్తిగా విన్నాక నా సందేహం నిజమైంది. ఆ తర్వాత మరోసారి ఈ లోకం చీకటిగా మారినట్టు తోచింది. నా గుండెలో ఏడుపు ఆగలేదు. నిన్ను వద్దు అంటూ.. నాపైన ప్రేమ కురిపించి ఎటువంటి ఆలోచనలు లేని నా మనస్సును తెగిపోయిన గాలిపటంలా చేసిందని మురళి బోరుమని విలపించాడు. పోటీ పరీక్షల మీద శ్రద్ధ చూపలేకపోతున్నాని చెప్పాడు. ప్రేమ రుచి చూపి తర్వాత లవ్‌ చేయలేదంటూ మోసం చేసిన తన గురించి చెప్పాడు. మురళి ఫోన్‌ పెట్టేసిన తర్వాత నాకు ఆ అమ్మాయి మీద కోపం, ద్వేషం పెరిగింది. ఎందుకంటే.. నిజాయితీగా ప్రేమించే అబ్బాయిని ప్రేమించలేదు. అసలు ప్రేమంటే ఎంటో కూడా తెలియని వాడికి ప్రేమ రుచి చూపి గుండెకు గాయం చేసిందని.
- వి. కుమార స్వామి(పేర్లు మార్చాం)


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top