ప్రతి మందుకూ ఓ రేటు ఉంటుంది. దానిని ఉత్పత్తిదారుడు నిర్ణయిస్తాడు. అవసరమైనప్పుడు రోగులు.. ధర చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. అది వ్యాపారం. నైతికమైనది. అయితే కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు.. కొందరు రిజిష్టర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్‌ఎంపీ)లకు సైతం ధరను నిర్ణయించాయి. రోగులను తీసుకొస్తే వారి బిల్లులో 30 శాతం కమీషన్ ఇస్తామని ప్రకటించాయి. మంచి ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. కర్నూలు బస్టాండ్ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రుల అనైతిక వ్యాపారమిది. వీటి వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉండడంతో చర్యలు తీసుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జంకుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆర్‌ఎంపీలు ప్రాథమిక చికిత్స మినహా వైద్యం చేయకూడదంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. నేరుగా రంగంలోకి దిగి ఆర్‌ఎంపీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో వైద్యం చేసేందుకు అవకాశం లేని నేపథ్యంలో.. మీ వద్దకు చిన్న సమస్యలతో వచ్చే ప్రతీ రోగిని తమ వద్దకు తీసుకురావాలంటూ ఆర్‌ఎంపీలను సదరు ఆసుపత్రుల యజమానులు కోరినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కర్నూలులోని ఒక స్టార్ హోటల్‌లో ఏకంగా సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం. ప్రధానంగా కర్నూలు బస్టాండుకు సమీపంలోని ఆసుపత్రులు ఈ సమావేశాలను ఏర్పాటు చేశాయని తెలుస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రులు విడిగా ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో ప్రధానంగా ఆర్‌ఎంపీలకు మొత్తం మెడికల్ బిల్లులో 30 శాతంతో పాటు గోవా యాత్రకు కూడా పంపుతామని ఆఫర్లు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి సదరు ప్రైవేటు ఆసుపత్రులకు భారీగా రోగులను ఆర్‌ఎంపీలు తరలిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ ఆదేశాలతో...!
వాస్తవానికి సరైన శిక్షణ లేకుండా, వైద్యం తెలియకుండా కొద్ది మంది గ్రామాల్లో డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. అంతేకాకుండా ఏకంగా నకిలీ డిగ్రీలతో ఆసుపత్రులను కూడా నెలకొల్పుతున్నారు. ఇటువంటి నకిలీ డాక్టర్లను.. విజిలెన్స్ అధికారులు దాడులు జరిపి పట్టుకున్నారు. ఇటువంటి ఘటనలు కర్నూలు, ఆదోనితో పాటు గుడూరులో కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. కేవలం ప్రాథమిక చికిత్స ..అది కూడా సరైన శిక్షణ తీసుకున్న వారు మాత్రమే చేయాలని నవంబరు ఆఖరి వారంలో జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాకుండా వైద్యం అందించకూడదని... మెడికల్ షాపులను నిర్వహించకూడదని తెలిపింది.
ఆర్‌ఎంపీలు రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేయకూడదని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలతో కనీస వైద్యం అందించేందుకు కూడా ఆర్‌ఎంపీలు జంకుతున్నారు. దీంతో వారి ఆదాయం భారీగా పడిపోయింది. ఈ పరిస్థితులల్లో ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్ ఆసుపత్రులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఆదాయం పడిపోయిన ఆర్‌ఎంపీలకు ఇప్పటివరకు ఇస్తున్న 10 నుంచి 20 శాతం పర్సంటేజీ కాకుండా ఏకంగా 30 శాతం పర్సంటేజీ ఇస్తామని ఆఫర్లు ప్రకటించాయి. అదేవిధంగా ఏ చిన్న సమస్యతో రోగి వచ్చినా తమ వద్దకు పంపించాలని పేర్కొంటున్నాయి. తద్వారా సదరు రోగి నుంచి పరీక్షల పేరుతో భారీగా వసూలు చేసి... ఆ బిల్లులో 30 శాతం ఇవ్వడంతో పాటు గోవా టూరుకు కూడా పంపిస్తామని ఆశలు కల్పిస్తున్నాయి.
కిటకిటలాడుతున్న ఆస్పత్రులు..
ఆర్‌ఎంపీలకు ఆశ కల్పించి తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు కర్నూలు బస్టాండు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులు విడివిడిగా నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశాల అనంతరం సదరు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య 20 నుంచి 30 శాతం పెరిగినట్టు సమాచారం. అంతేకాకుండా కేవలం జ్వరంతో బాధపడుతున్న రోగిని కూడా డెంగ్యూ టెస్టుల పేరిట భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో సదరు ఆసుపత్రులపై వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా వెనకంజవేస్తున్నారు.


