
సచివాలయం గేటు వద్ద భద్రతా సిబ్బందితో మాట్లాడుతున్న రైతులు
సాక్షి అమరావతి బ్యూరో: కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమకు మాయమాటలు తమ అసైన్డ్ భూములను కారు చౌకగా కొని ఇప్పుడు కోట్ల రూపాయలకు విక్రయించి లాభాలు గడిస్తున్నారని రాజధాని పరిధిలోని కురగల్లు, యర్రబాలెం రైతులు వాపోయారు. సీఎం చంద్రబాబు కల్పించుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ రెండు గ్రామాలకు చెందిన 60 మంది రైతులు మంగళవారం సచివాలయానికి చేరుకున్నారు. సెక్రటేరియట్ ఎంట్రెన్స్ గేట్ వద్దకు చేరుకుని తమనులోనికి పంపించాలంటూ భద్రతా సిబ్బందిని కోరారు. వారు నిరాకరించడంతో గేట్ ఎదుట నిరసనకు దిగారు.
మోసం చేసి భూములుకొనుగోలు చేశారు
ఆందోళనలో పాల్గొన్న రైతులు మాట్లాడుతూ రెండేళ్ల కిందట తమ భూములను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులతో సంబంధం ఉన్న కొంతమంది దళారులు మోసం చేసి కొనుగోలు చేశారని ఆరోపించారు. రాజధాని ప్రకటన తర్వాత ఇక్కడున్న అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వకుం డానే ప్రభుత్వం లాగేసుకుంటుందని, ప్యాకేజీ ఇవ్వదని భయపెట్టడతో మభ్యపెట్టడంతో వారు ఎంత ఇస్తే అంతే తీసుకుని భూములు విక్రయించామని తెలిపారు. అసైన్డ్ భూముల విక్రయాలు పూర్తికావొచ్చిన సమయంలో సీఎం చంద్రబాబు వాటికి కూడా పరిహారం ఇస్తామంటూ ప్రకటించారని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే కొంతమంది అధికార పార్టీ నాయకులకు తమ భూముల కొనుగోలులో ప్రమేయం ఉన్నట్లు కనిపిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.
600 ఎకరాలను కొనుగోలు చేసిన వైనం
కురగల్లు, యర్రబాలెం రెండు గ్రామాల్లో సుమారు 750 ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. ఒక్క కురగల్లు గ్రామంలోనే 600కిపైగా ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ రెండు గ్రామాల్లో కలిపి సుమారు 600 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలకు చెందిన వారు కొనుగోలు చేశారు. వారికి స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. తమ వద్ద ఎకరా రూ.20 లక్షలకు కొని ఇప్పుడు రూ.కోట్లకు అమ్ముకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కోసం పరిహారం ఇవ్వకుండానే తమ అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంటుందనేభయంతో విక్రయించామని, భూములను అమ్ముకునేంత అవసరం తమకు లేదని రైతులు వివరించారు.
రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో..
ఈ రెండు గ్రామాల రైతులు ల్యాండ్ పూలింగ్‌కు తమ భూములను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే ఇది వరకే వీరికి కొంతమంది దళారులు తక్కువ మొత్తం ముట్టజెప్పి తమ పేరిట ఒప్పంద పత్రాలు రాయించుకున్నారు. ప్రస్తుతం భూముల రేటు పెరగడంతో పాటు అసైన్డ్ భూములకు ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో రైతులు తాము మోసపోయామని గ్రహించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ భూములకు సంబంధించి ఇటు రైతులు, అటు దళారులు తమకే ప్యాకేజీ ఇవ్వాలని పట్టుబట్టడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సీఆర్‌డీఏ అధికారులు పెండింగ్‌లో పెట్టారు.
సీఆర్‌డీఏ ఆఫీస్‌కు రైతులు
సచివాలయం వద్ద సుమారు రెండు గంటల పాటు రైతులు నిరసన వ్యక్తం చేయడంతో స్పందించిన అధికారులు వారిలో ముగ్గురిని మధ్యాహ్నం 3 గంటలకు లోనికి అనుమతించారు. గ్రీవెన్స్ సెల్‌లో తమ సమస్యను వినతిపత్రం ద్వారా అక్కడి అధికారులకు అందజేసి న్యాయం చేయాలని కోరారు. ఆ తర్వాత విజయవాడకూ వెళ్లి అక్కడి సీఆర్‌డీఏ కార్యాలయంలో కమిషనర్ శ్రీధర్‌ను కలుసుకోవాలని చూసిన రైతులకు నిరేశే ఎదురైంది. ఆయన బెంగళూరుకు వెళ్లడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు.