బినామీలకే ట్రాక్టర్లు..?

giving high preference to trs members in Tractor subsidy scheme - Sakshi

కేటాయింపుల్లో గులాబీ శ్రేణులకు ప్రాధాన్యం 

పెనుబల్లి : రైతుల సాగు ఖర్చు తగ్గించేందుకు, యాంత్రీకరణ ద్వారా వ్యవసాయం చేసి, ఆర్థిక చేయూత నందించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలులో అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో దారి తప్పుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పెనుబల్లి మండలంలో 2016–2017కు యాంత్రీకరణ పథకం ద్వారా 33 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు మంజూరు చేస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. మండల వ్యాప్తంగా 68 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా వాటిలో 54 మంది అర్హులుగా నిర్ధారించారు. 14 మంది  ట్రాక్టర్లు ఉండి గతంలో వ్యవసాయ ట్రాక్టర్‌ సామగ్రి సబ్సిడీపై పొందడం వల్ల అనర్హులుగా తేల్చిన వ్యవసాయాధికారులు నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. ట్రాక్టర్‌ పొందాలంటే నిబంధనల ప్రకారం 2.5 ఎకరాల పట్టా భూమి పాస్‌బుక్‌ గానీ, మీ సేవ పహాణీ గానీ కలిగి ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలి.

రెవెన్యూ అధికారులను గులాబీ నేతలు ఒత్తిళ్లకు గురిచేసి, భూమిలేని వారికి సైతం మాన్యువల్‌ పహాణీపై భూమి ఉన్నట్లు రాయించి..దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవంగా కాస్రా పహాణీ , 1970కు ముందు 1బీ రిజిస్టర్‌లో నమోదైన రైతులకే మాన్యువల్‌ పహాణీలు రెవెన్యూ అధికారులు సరిచూసి జారీ చేయాల్సి ఉంది. ఈ నిబంధనను తుంగలో తొక్కి రెవెన్యూ అ«ధికారులు ఇష్టానుసారం మాన్యువల్‌ పహాణీలు జారీ చేశారని రైతుల ప్రధాన ఆరోపణ. 54 మంది రైతులు వ్యవసాయాధికారుల సూచన మేరకు రెండు రోజుల్లోనే దరఖాస్తులు సమర్పించారు. గులాబీ నాయకులు సూచించిన వారి పేర్లను ముందుగా జాబితాలో చేర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు విచారణ చేయిస్తే..లొసుగులు బయట పడతాయని పలువురు రైతులు కోరుతున్నారు.

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top