రియల్‌ దోపిడీ

agricultural lands turns as real estate flats - Sakshi

ప్లాట్లుగా వ్యవసాయ భూములు

డీటీసీపీ అనుమతి లేకుండానే విక్రయాలు

రూ.2కోట్ల సామాజిక స్థలాలు మాయం

గ్రామ పంచాయతీ హెచ్చరిక బోర్డులూ తొలగింపు

ప్రభుత్వ ఖాజానాకు భారీగా గండి

కరీంనగర్‌ రూరల్‌: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఆగడాలకు అడ్డులేకుండాపోతోంది. వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు. అమాయకులను మోసంచేస్తూ.. కోట్లు గడిస్తున్నారు. అనుమతి లేదని పంచాయతీ అధికారులు బోర్డులు ఏర్పాటు చేస్తున్నా.. పట్టించుకోకుండా అక్రమమార్గంలో ప్లాట్లు విక్రయిస్తున్నారు. గ్రామపంచాయతీ, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారి అనుమతి లేకున్నా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.

నిబంధన లే‘అవుట్‌’...
కరీంనగర్‌ నగర శివారు గ్రామాల్లో స్ధానిక ప్రజాప్రతినిధుల అండదండలతో రియల్‌ దందా అక్రమంగా సాగుతోంది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలనూ వదలకుండా.. విక్రయిస్తున్న రియల్టర్లు భారీ సొమ్ము చేసుకుంటున్నారు. శివారు గ్రామాలైన బొమ్మకల్, గుంటూరుపల్లి, తీగలగుట్టపల్లి, ఆరెపల్లి, సీతారాంపూర్, చింతకుంట, రేకుర్తి, మల్కాపూర్‌ గ్రామాల్లో రియల్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. కార్పొరేషన్‌లో శివారు గ్రామాలు విలీనమవుతాయనే విస్తృత ప్రచారంతో ప్లాట్ల క్రయవిక్రయాలు  ఇటీవల ఊపందుకున్నాయి. జిల్లాకేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న బొమ్మకల్‌లో రియల్టర్ల దోపిడీకి అంతులేకుండా పోయింది. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ప్లాట్లను విక్రయిస్తున్నారు.

ఇవీ నిబంధనలు
ప్రభుత్వ ఉత్తర్వు నంబరు– 67 ప్రకారం వ్యవసాయభూమిని ప్లాట్లుగా చేయాలంటే ముందుగా వ్యవసాయేతర భూమిగా (నాలా) రెవెన్యూశాఖ నుంచి మార్పిడి చేసుకోవాలి. అనంతరం ఆ స్థలాన్ని ప్లాట్లుగా విభజించి గ్రామపంచాయతీ, డీటీసీపీ నుంచి లేఅవుట్‌ అనుమతి పొందాల్సి ఉంటుంది. లేఅవుట్‌ చేసిన స్థలంలో 33 అడుగుల అంతర్గత రోడ్ల నిర్మాణంతోపాటు సామాజిక అవసరాల కోసం 10 శాతం స్థలాన్ని గ్రామపంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాల్సి ఉంటుంది. కానీ.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మాత్రం ఈ నిబంధలను తుంగలో తొక్కుతున్నారు.

రూ.2కోట్ల సామాజిక స్థలాల విక్రయం
బొమ్మకల్‌లోని సర్వే నంబర్లు–44, 45, 76 పరిధిలోని 25 ఎకరాల్లో కొంతమంది రియల్‌ వ్యాపారులు మహాలక్ష్మి రియల్‌ ఎస్టేట్‌ పేరిట ప్లాట్లుగా చేసి రెండేళ్ల క్రితం విక్రయించారు. లేఅవుట్‌ మ్యాప్‌లో సామాజిక అవసరాల కోసం కేటాయించిన దాదాపు రూ. 2కోట్ల విలువైన 30గుంటల స్థలాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల అండదండలతో కలిసి అమ్ముకున్నారు. ఈ వ్యవహారంపై స్ధానికులు జిల్లా కలెక్టర్, డీపీవోకు ఫిర్యాదు చేయగా.. ఆర్నేళ్లక్రితం డీపీవో నారాయణరావు మోఖాపైకి వెళ్లి స్థలాలను పరిశీలించారు. అక్రమ లేఅవుట్‌గా నిర్ధరించి గ్రామపంచాయతీ, డీటీసీపీ అనుమతి లేదని, ప్లాట్లను కొనుగోలు చేయరాదని పేర్కొంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. వారం రోజుల తర్వాత నుంచే రియల్టర్లు స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో బోర్డులను తొలగించి యథావిధిగా తమ దందాను నడిపిస్తున్నారు. పంచాయతీ బోర్డులను తొలగించినప్పటికీ రియల్టర్లపై అధికారులు ఇంతవరకు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ప్లాట్లుగా వ్యవసాయభూమి
రజ్వీచమన్, సిటిజన్‌ కాలనీ సమీపంలోని సర్వేనంబర్లు–40, 41లోని 6 ఎకరాల వ్యవసాయ భూమిని ఇటీవల కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్లాట్లుగా విభజించారు. వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేయకుండా.. గ్రామపంచాయతీ, డీటీసీపీ అనుమతి లేకుండానే ప్లాట్ల విక్రయాలు చేపట్టారు. నగర పరిధిలో ఉండటంతో ఒక్కో ప్లాట్‌ను రూ.10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు స్థానిక నాయకుల అండదండలుండటంతో అధికారులు సైతం చర్యలకు వెనుకంజ వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

హెచ్చరిక బోర్డులు పెట్టించాం
మహాలక్ష్మి రియల్‌ ఎస్టేట్‌కు గ్రామపంచాయతీ, డీటీసీపీ అనుమతిలేదు. గతంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు తొలగించడంపై డీపీవోకు సమాచారమిచ్చాం. మళ్లీ బోర్డులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సర్వే నంబర్లు–40, 41లోని 6 ఎకరాల్లో అక్రమంగా చేసిన ప్లాట్లకు సంబంధించి హద్దురాళ్లను తొలగించాం. – పంచాయతీ కార్యదర్శి శ్రీధర్‌

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top