ప్రపంచమంతా ఇదే తీరు..

World Elder Abuse Awareness Day On June 15th - Sakshi

పెద్దవాళ్లను గౌరవించడం భారత సంస్కృతి నేర్పే తొలి పాఠం. ఇది ఎంతమంది బుర్రలకు ఎక్కిందో తెలియదు కానీ...ముదిమి మీదపడ్డ పండుటాకులను వీధులపై వదిలేసే వాళ్లను.. కని పెంచిన తల్లిదండ్రులను ఆస్తి కోసం, డబ్బు కక్కుర్తితో రకరకాల హింస పెట్టే వాళ్లనూ..మనం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. ప్రభుత్వాలా పట్టించుకోవు.. న్యాయస్థానాలు అప్పుడప్పుడు కొరడా ఝళిపిస్తాయి కానీ.. మళ్లీ అవే ఘటనలు.. అందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితులు! ఇదంతా ఎందుకంటే... ఈ అంశంపై అవగాహన ఎంత పెరిగితే..పండుటాకులకు అంత మేలు కాబట్టి! పైగా రేపు వరల్డ్‌ ఎల్డర్స్‌ అబ్యూస్‌ అవేర్‌నెస్‌ డే కూడా!

ప్రపంచమంతా ఇదే తీరు..
వృద్ధులపై హింస, అకృత్యాలు ఒక్క భారత్‌కే పరిమితం కాదు. ప్రపంచమంతా ఇదే తీరు. 2017 నాటి లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అరవై ఏళ్ల పైబడ్డ ప్రతి ఆరుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన హింస, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇంటర్నేషనల్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ ద ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఎల్డర్‌ అబ్యూస్‌ (ఐఎన్‌పీఈఏ) 2006లో ఏటా జూన్‌ 15న ఎల్డర్స్‌ అబ్యూస్‌ అవేర్‌నెస్‌ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. ఐక్యరాజ్యసమితి దీన్ని 2011లో గుర్తించింది కూడా. ఐరాస సభ్యదేశాలు, పౌర హక్కుల సంఘా లు, స్వచ్ఛంద సంస్థలు ఈ సమస్య పరిష్కారానికి తమదైన రీతిలో కృషి చేయాలని ఐరాస పిలుపునిచ్చింది. 2017లో సుమారు 28 దేశాల్లో నిర్వహించిన 52 అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే.. ఆరవై ఏళ్లపైపడ్డ వారిలో 15.7 శాతం మంది ఏదో ఒక రూపంలో హింసను ఎదుర్కొంటున్నారు. మానసిక హింస అంటే తిట్టడం, చులకన చేయడం వంటివి సుమారు 11.6%మంది.. వృద్ధుల సొమ్ము లాగేసుకోవడం, దొంగిలించడం వంటివి 6.8% మంది ఎదుర్కొంటున్నారు.

ఇక నిర్లక్ష్యానికి గురయ్యే వారు 4.2% కాగా, కొట్టడం, గాయపరచడం వంటివి ఎదుర్కొంటున్న వారు 2.5% మంది. ఇవి చాలవన్నట్లు దాదాపు ఒక శాతం వృద్ధులు లైంగిక హింసనూ ఎదుర్కోవాల్సి వస్తుండటం శోచనీయమైన అంశం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వయోవృద్ధులపై హింస ఘటనలు అందరికీ తెలిసే అవకాశాలు చాలా తక్కువ. హింసకు పాల్పడే వాళ్లు ఎక్కువగా కుటుంబ సభ్యులే కావడం ఒక కారణం. ప్రస్తుత కరోనా మహమ్మారి కారణంగానూ వృద్ధులపై హింసాత్మక ఘటనలు పెరిగిపోవడంతోపాటు, ఆర్థిక వ్యవస్థ మందగమనం వల్ల చాలాచోట్ల వారి ఆదాయం, పెన్షన్లు కూడా తగ్గిపోతున్నట్లు సమాచారం. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లపైబడ్డ వారి సంఖ్య కనీసం 200 కోట్లకు చేరుకుంటుందని, వృద్ధుల హక్కుల రక్షణకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోని పక్షంలో వారిపై హింస మరింత పెరిగే అవకాశముందని ఐరాస హెచ్చరిస్తోంది.

ఇవన్నీ ఆ వర్గంలోనే...
1. భౌతిక హింస.. కొట్టడం, తన్నడం, తోసేయడం, తగు రీతిలో ముందులు వాడకపోవడం, పరిమితులు విధించడం.
2. మానసిక, ఎమోషనల్‌ హింస.. తిట్టడం, బెదిరించడం, అగౌరవపరచడం, నిర్బంధించడం, ఏకాంతంలో ఉంచడం, కట్టడి చేయడం.
3. లైంగిక హింస.. అనుమతి లేకుండా లైంగిక చర్యలకు పాల్పడటం
4. ఆర్థిక పీడన.. వృద్ధుల ఆస్తులు, సొమ్మును దుర్వినియోగం చేయడం, తస్కరించడం.
5. నిర్లక్ష్యం చేయడం, వదిలేయడం... కూడు, గూడు, నీడ కల్పించకపోవడంతోపాటు వైద్యం అందించకపోవడం. ఈ సంఘటనలు ఒక్కసారి కాకుండా పదే పదే జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. 
వృద్ధులపై హింస ప్రధానంగా రెండు వర్గాల నుంచి ఎదురవుతోంది.

వృద్ధులపై హింస ప్రధానంగా రెండు వర్గాలనుంచి ఎదరవుతోంది
ఒకటి  : కుటుంబ సభ్యులు..
రెండు :  90 శాతం మంది ఆరోగ్యసేవలు అందించేవాళ్లు (నర్సులు, ఆసుపత్రి సిబ్బంది)
ఈ అంశానికి సంబంధించిన సమాచారం చాలా తక్కువ. అమెరికాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. నర్సింగ్‌ హోమ్‌లు, ఆసుపత్రుల్లోనూ ఈ హింస ఎక్కువగానే ఉంది. 

ఫిర్యాదులు 4 శాతమే ఎందుకు?
వృద్ధులు తమపై జరిగే హింసపై ఫిర్యాదు చేసేది చాలా తక్కువ. అవమానంగా భావించడం ఇందుకు ఒక కారణమైతే, ఫిర్యాదు చేస్తే ప్రతి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం రెండోది. అలాగే తమను హింసించిన వారు (కుటుంబ సభ్యులు) సమస్యల్లో చిక్కుకుంటారన్న ఆందోళన, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియకపోవడం కూడా కారణాలే.

సగం దేశాల్లో వ్యవస్థలే లేవు...
వృద్ధులపై జరిగే హింసను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉండగా... 60 శాతం దేశాల్లో ఇలాంటి ఏర్పాట్లే లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కేవలం 17 శాతం దేశాలు తమ దేశాల్లో వృద్ధుల పరిస్థితి ఏమిటన్న విషయంపై సర్వే నిర్వహించాయి. భారత్‌లో ఏజ్‌వెల్‌ ఇండియా అనే సంస్థ కొంత కాలం క్రితం ఈ అంశంపై ఒక సర్వే నిర్వహించింది. దాని ప్రకారం వృద్ధులపై హింసకు సామాజిక, ఆర్థిక స్థాయిలకు సంబంధం లేదు. అన్ని వర్గాల కుటుంబాల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు... సుమారు 71% వృద్ధులు తమ కుటుంబ సభ్యులు, బంధువుల చేతుల్లోనే హింసకు గురవుతున్నారు. అవహేళనకు గురవుతున్నారు. కుటుంబం ఆర్థిక స్థితి, ఇరుకిరుకు ఇళ్లు, వ్యక్తిగత సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు వృద్ధులపై హింసకు ప్రధాన కారణాలుగా ఈ సర్వే గుర్తించింది.

పడిపోతున్న నైతిక విలువల మాట సరేసరి అని చెప్పింది. వృద్ధులపై భౌతిక హింస కారణంగా అమెరికాలోనే ఏటా దాదాపు 53 లక్షల డాలర్ల వ్యయం అవుతున్నట్లు ఒక అధ్యయనం స్పష్టం చేసింది. నిజానికి ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వాలు చేయాల్సింది చాలా ఉంది. ఆరోగ్య రంగంతోపాటు ఇతర రంగాల్లోనూ సామాజికంగా, ఆరోగ్యపరంగా జరిగే నష్టాన్ని వివరించడం ఇందులో ఒకటి. అలాగే వృద్ధులపై హింసను ప్రజారోగ్య సమస్యగా గుర్తించడంతోపాటు ఏదైనా సమస్య ఎదురైతే సంప్రదించేందుకు వీలుగా ఒక అధికారిని నియమించడం, హింస నివారణకు తగిన చట్టాలు చేయడం, చర్యలు తీసుకోవడం కూడా ప్రభుత్వాల బాధ్యతే. 

భారత్‌లో పరిస్థితి కొంత మెరుగు!
భారత్‌లో ప్రస్తుతం అరవై ఏళ్ల పైబడ్డ వారు సుమారు పది కోట్ల మంది ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. జీవన ప్రమాణాలు, ఆరోగ్య సౌకర్యాలు పెరుగుతున్న కారణంగా 2030 నాటికి దేశంలో వృద్ధుల సంఖ్య 38 శాతం పెరుగుతుందని అంచనా. వీరిపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం వృద్ధులను కాపాడేందుకు కొద్దోగొప్పో చట్టాలను చేసింది కూడా. 2017లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రకారం హింసకు దిగుతున్న పిల్లలను ఇంట్లోంచి వెళ్లగొట్టే అధికారం తల్లిదండ్రులకు సంక్రమించింది. ఆస్తి సొంతానిది కాకపోయినా, చట్టపరంగా అధీనంలో ఉన్నదైతే చాలు. ఈ చట్టం కారణంగా చాలామంది వృద్ధులకు సొంతిల్లు లేదా తమ అధీనంలో ఉన్న ఇంట్లోనే బిడ్డల దయాదాక్షిణ్యాలపై ఉండాల్సిన అవసరం తప్పుతుంది. తల్లిదండ్రులు, సీనియర్‌ సిటిజన్ల పోషణ విషయంపై భారత ప్రభుత్వం 2007లో చేసిన చట్టం కూడా వృద్ధులను హింస నుంచి రక్షించేదే.

తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులదని 2007నాటి చట్టంలో పేర్కొనగా 2013లో పోషణ విషయమైన తల్లిదండ్రులు సంతానానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయవచ్చునని సవరించారు. 2018లో ఇంకో సవరణ చేస్తూ పోషణభారం కేవలం కొడుకులు, కోడళ్లపైనే కాకుండా కూతుళ్లు, అల్లుళ్లకూ ఉంటుందని కూడా విస్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి జిల్లాలోనూ వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసేందుకు, నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఈ చట్టం అనుమతిచ్చింది. తల్లిదండ్రులు తమ నెలవారీ ఖర్చుల కోసం సంతానానికి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఈ చట్టం కల్పిస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించిన పిల్లలకు రూ.ఐదు వేల వరకూ జరిమానా, 3 నెలల జైలుశిక్ష, లేదా రెండు శిక్షలు కలిపి విధించవచ్చు. ఈ చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల చాలామంది వృద్ధులు హింసను సహిస్తున్నారని అంచనా.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top