ప్రధాని మోదీపై డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసల వర్షం

WHO Chief Praises PM Modi For Help Poor Over Covid 19 Lockdown - Sakshi

జెనీవా: మహమ్మారి కరోనా వ్యాప్తి కట్టడికై లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ గేబ్రియేసస్‌ ప్రశంసించారు. బలహీన వర్గాలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. పేద ప్రజలకు ఆహార ధాన్యాల పంపిణీ సహా ఉచితంగా వంటగ్యాసు అందించడం, నగదు బదిలీ వంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌లో ప్రజల కష్టాలు తీర్చలేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్న టెడ్రోస్‌... భారత్‌ మాత్రం సంక్షేమ పథకాలను సజావుగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.(కరోనా : డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక!)

ఈ మేరకు... ‘‘ భారత్‌లోని బలహీన వర్గాల ప్రజలకు కోవిడ్‌-19 సంక్షోభం నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 24 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీ ప్రకటించినందుకు ఆయనను అభినందిస్తున్నా. 800 మిలియన్‌ మందికి ఉచిత రేషన్‌,204 మిలియన్‌ మంది మహిళలకు నగదు బదిలీ.. 80 మిలియన్‌ మంది గృహావసరాల కోసం ఉచిత వంటగ్యాసు ఇస్తున్నారు’’ అని టెడ్రోస్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అదే విధంగా ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా చూసుకుంటేనే ప్రజలను ఆదుకుంటూ సంఘీభావం ప్రకటించాలని ప్రపంచ దేశాలకు సూచించారు.( భారత్‌ ‘కరోనా’ ప్యాకేజీ)

కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడకుండా రూ.1.7 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకు రానున్న మూడు నెలలపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు, వంటగ్యాస్‌ పంపిణీ చేయడంతోపాటు మహిళలు, సీనియర్‌ సిటిజన్లకు ఆర్థికంగా చేయూత అందివ్వడం వంటి చర్యలను అమలు చేయనున్నట్లు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top