చైనాకు పోటీ: అమెరికా, భారత్‌ 'ఐపీఈసీ' | US, India To Revive 'New Silk Road' To Counter China's Belt And Road Project | Sakshi
Sakshi News home page

చైనాకు పోటీ: అమెరికా, భారత్‌ 'ఐపీఈసీ'

May 24 2017 5:17 PM | Updated on Apr 4 2019 3:25 PM

చైనాకు పోటీ: అమెరికా, భారత్‌ 'ఐపీఈసీ' - Sakshi

చైనాకు పోటీ: అమెరికా, భారత్‌ 'ఐపీఈసీ'

దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో చైనా చేపట్టిన వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌(ఓబీఓఆర్‌)కు గట్టి పోటీ నిచ్చేందుకు అమెరికా న్యూ సిల్క్‌ రోడ్‌(ఎన్‌ఎస్‌ఆర్‌), ఇండో-పసిఫిక్‌ కారిడార్‌(ఐపీఈసీ) ప్రాజెక్టులను పునరుద్ధరించనుంది.

వాషింగ్టన్‌: దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో చైనా చేపట్టిన వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌(ఓబీఓఆర్‌)కు గట్టి పోటీ నిచ్చేందుకు అమెరికా న్యూ సిల్క్‌ రోడ్‌(ఎన్‌ఎస్‌ఆర్‌), ఇండో-పసిఫిక్‌ కారిడార్‌(ఐపీఈసీ) ప్రాజెక్టులను పునరుద్ధరించనుంది. అయితే, దీని వల్ల భారత్‌కు ఏంటి ప్రయోజనం?. 2011లో భారత్‌లో పర్యటించిన అప్పటి సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ హిల్లరీ క్లింటన్‌ ఎన్‌ఎస్‌ఆర్‌, ఐపీఈసీలపై చెన్నైలో ప్రసంగించారు. ఈ ప్రసంగంలో దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల కేంద్రంగా ఈ ప్రాజెక్టులను చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.

ఈ రెండు ప్రాజెక్టుల్లో భారత్‌ కీలక పాత్ర పోషించాలని ఆమె కోరారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రాజెక్టు వైపు అడుగులు పడలేదు. వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ ప్రాజెక్టులతో ప్రపంచంలోని ముఖ్య ప్రాంతాల్లో ఎకనమిక్‌ కారిడార్‌లు తలపెట్టడం అగ్ర రాజ్యానికి అంత రుచించినట్లు లేదు. అందుకే బడ్జెట్‌ ప్రస్తావనలో సిల్క్‌ ప్రాజెక్టుల అంశాన్ని అమెరికా మంగళవారం చర్చించింది. అంతేకాదు త్వరలో ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వ్యూహాన్ని కూడా సిద్ధం చేస్తోంది.

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో రానున్న ఈ ప్రాజెక్టుల్లో భారత్‌ కీలకపాత్ర పోషించనుంది. ఈ మేరకు అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. న్యూ సిల్క్‌ రోడ్‌(ఎన్‌ఎస్‌ఆర్‌) ప్రాజెక్టు ఆప్ఘనిస్తాన్‌ దాని పొరుగు దేశాల గుండా పోతుందని, ఇండో-పసిఫిక్‌ కారిడార్‌(ఐపీఈసీ) దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియాలను కలుపుతుందని వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఆయా దేశాలు, బ్యాంకులు, ప్రైవేటు కంపెనీలతో త్వరలో చర్చిస్తామని తెలిపింది. ఇప్పటికే ఆప్ఘనిస్తాన్‌లో మార్పుకు కృషి చేస్తున్న అమెరికా.. న్యూ సిల్క్‌ రోడ్‌ ద్వారా మరింత మార్పును తెస్తుందని వివరించింది.

అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయం మధ్య ఆసియా దేశాల అభివృద్ధికి తోడ్పడుతుందని ఫారిన్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌ ప్రతినిధి జేమ్స్‌ మెక్‌ బ్రైడ్‌ అన్నారు. చైనా చేపట్టిన వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టు వివాదాస్పద ప్రాంతమైన గిల్గిత్‌ బాల్టిస్తాన్‌ గుండా పోతుండటంతో భారత్‌ ఓబీఓఆర్‌ను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీంతో చైనా ప్రాజెక్టుకు ధీటుగా ప్రారంభించనున్న ఎన్ఎస్‌ఆర్‌, ఐపీఈసీలకు భారత్‌ సంపూర్ణ మద్దతు తెలిపే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్టుల్లో భారత్‌ కీలక భాగస్వామి కావడం వల్ల టర్క్‌మన్‌ గ్యాస్‌ ఫీల్డ్స్‌ నుంచి భారత్‌కు అవసరమవుతున్న ఇంధనాలను సులభంగా తెచ్చుకునే వీలు కలుగుతుంది. తాజిక్‌ కాటన్‌ భారత్‌కు అందుబాటులోకి వస్తుంది. ముంబై మార్కెట్‌ పెద్ద ఎత్తున విస్తృతమయ్యే అవకాశం కలుగుతుంది. అయితే, మరి ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామి అయ్యేందుకు భారత్‌ అంగీకరిస్తుందా? అన్న విషయం తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement