థాయ్‌ ఆపరేషన్‌ సాగిందిలా..!

Thai Rescue Operation Details - Sakshi

మే సాయ్‌ : థాయ్‌లాండ్‌లో థామ్‌ లువాంగ్‌ గుహలో చిక్కుకున్న 13 మందిని సహాయక బృందాలు మంగళవారం క్షేమంగా బయటకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మూడు రోజులుగా థాయ్‌లాండ్‌ నౌకాదళ సిబ్బందితో కలసి వివిధ దేశాల నిపుణులు చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతమైంది. 18 రోజుల నరకయాతన తర్వాత మొత్తం 13 మంది గుహ నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

చివరి క్షణంలో అనుకోని ప్రమాదం...
అయితే చివరి పిల్లవాడిని కాపాడిన తర్వాత నీటిని బయటకు తోడే మోటర్లలో ప్రధాన మోటార్‌ చెడిపోయిందంట. ఆ సమయంలో డైవర్స్‌, మరికొందరు సహాయక సిబ్బంది ఇంకా గుహ లోపలనే ఉన్నారు. ఈ విషయం గురించి సహాయక సిబ్బంది సభ్యుడొకరు చెబుతూ.. ‘మేమంతా గుహ ప్రధాన ద్వారానికి 1.5 కిమీ దూరాన ఉన్నాం. మోటార్‌ చెడిపోవడంతో నీటి ప్రవాహం పెరిగింది. మేమే కాక మరో 100 మంది గుహ ప్రధాన ద్వారం వద్ద ఉన్నారు. నీటి ప్రవాహం పెరగడంతో వారంతా బయటకు వెళ్లి పోయారు. మేము నలుగురం మాత్రమే లోపల మిగిలి పోయాము. ఆ సమయంలో మేమంతా ప్రాణాల మీద ఆశ వదులుకున్నాము. కానీ చివరకు క్షేమంగా బయటకు వచ్చాం’ అని తెలిపారు.

సబ్‌మెరైన్‌ ఆచరణ సాధ్యం కాదు...
పూర్తి ఆపరేషన్‌ ఎలా సాగిందనే విషయాన్ని కూడా తొలిసారి బయటకు వెల్లడించారు. పిల్లలు ఉన్న చోటకు ప్రవేశ ద్వారానికి మధ్య 3 కిలోమీటర్ల దూరం ఉంది. పిల్లల ఆచూకీ తెలిసిన తర్వాత వారి కోసం ఆహారం, మందులు సరఫరా చేశారు. ఇంతలో గుహలో ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గడంతో, ఆక్సిజన్‌ సిలిండర్లు అమర్చాలని భావించారు. అందుకోసం సమన్‌ గుణన్‌ అనే డైవర్‌ లోపలికి వెళ్లాడు. కానీ దురదృష్టవశాత్తు అతను మరణించడంతో ప్రమాద తీవ్రత  ప్రపంచానికి తెలిసింది. దాంతో సబ్‌మెరైన్‌ను వాడదామనుకున్నారు. కానీ అది కూడా సాధ్యపడదని తేలింది. దాంతో చివరకూ డైవర్లనే గుహ లోపలికి పంపించి పిల్లలను బయటకు తీసుకురావాలని భావించారు.


(ఊహాచిత్రాలు బీబీసీ సౌజన్యంతో)

ప్రమాదకర దారిలో ప్రయాణం...
జూన్‌ 30న వచ్చిన ఆస్ట్రేలియా డైవర్లు ప్రమాద తీవ్రతను పరీక్షించారు. ప్రవేశ ద్వారం నుంచి పిల్లలు ఉన్న చోటుకు చేరడం అంత తేలిక కాదు అనే విషయం వారికి అర్ధమయ్యింది. ఎందుకంటే ఆ మార్గం అంతా బురదతో నిండి పోయి ఉండటమే కాక కొన్ని చోట్ల కేవలం 70 సెంటీ మీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. మరికొన్ని చోట్ల ఎగుడుదిగుడుగా ఉంది. పిల్లలున్న ప్రాంతానికి కొద్ది దూరంలో గుహ చాలా కోసుగా ఉంది. అది దాటి కాస్తా ముందుకు వెళ్తే 30 మీటర్ల లోతు ఉంది. గుహ లోపలికి చేరుకోవాలంటే డైవర్లు కూడా ఆక్సిజన్‌ సిలిండర్‌లను ధరించాల్సిందే. మనిషి పట్టడమే కష్టంగా ఉన్న చోట ఆక్సిజన్‌ సిలిండర్‌తో పాటు మనిషి ప్రయాణం చేయడం అస్సలు సాధ్యమయ్యే పని కాదు. కానీ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వారంతా అసాధ్యాన్ని సుసాధ్యం చేసే అసమాన్యులు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 19 మంది డైవర్లు పాల్గొన్నారు. వీరిలో కేవలం ముగ్గురికి మాత్రమే లోపలికి వెళ్లడానికి అవకాశం ఉంది.

ఒక్కో పిల్లవాన్ని కోసం 8 గంటలు...
ఈ ముగ్గురిలో ఇద్దరు డైవర్లు, ఒకరు వైద్యుడు. పిల్లలున్న చోటు నుంచి గుహ ప్రవేశ ద్వారం వరకూ మొత్తం మార్గాన్ని మూడు చాంబర్లుగా విభజించారు. పిల్లలను తీసుకు రావడానికి వెళ్లే ముగ్గురు డైవర్లు కాక మిగతా అందరూ రెండో చాంబర్లో మానవహారంగా నిల్చున్నారు. లోపలికెళ్లిన ముగ్గురు డైవర్లు ఒక్కోసారి ఒక పిల్లవాన్ని తమతో పాటు తీసుకొచ్చారు. ఒక డైవర్‌ ఆక్సిజన్‌ ట్యాంక్‌ని పట్టుకుంటే అతని వెనుక భాగాన బాలుడిని కట్టారు. మరో డైవర్‌ బాలుడి వెనకాల ఇంకో ఆక్సిజన్‌ ట్యాంక్‌ పట్టుకుని పిల్లాడు ఎలా ఉన్నాడో జాగ్రత్తగా గమనించారు. ముగ్గురు ఆక్సిజన్‌ సిలిండర్లు ధరించి ఉంటారు. వెడల్పు తక్కువగా ఉన్న ప్రాంతానికి రాగానే సిలిండర్లను తొలగిస్తారు. ఒక్కొక్కరుగా రెండో చాంబర్‌లోకి వస్తారు.


(ఊహాచిత్రాలు బీబీసీ సౌజన్యంతో)

అక్కడికి రాగానే అప్పటికే అక్కడ మానవహారంగా నిలబడిన డైవర్లు ఒకరి తర్వాత ఒకరిగా బాలున్ని బయటకు చేర్చుతారు. ఇలా ఒక్కో పిల్లవాన్ని బయటకు తీసుకురావడానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. అంతసేపు రెండో చాంబర్లో ఉన్న డైవర్లు అలా బురదలోనే నిల్చుని ఉండాలి. ఏ ఒక్కరు కాస్తా ఏమరుపాటుగా ఉన్న అంతే సంగతులు. చాంబర్‌ 3 చాంబర్‌ 2 వరకూ రావడానికి మొదట 5 గంటల సమయం పట్టేది. అయితే నీటిని నిరంతరం బయటకు పంపిచడంతో ఓ గంట సమయం కలిసి వచ్చింది.  డైవర్లు ప్రతీ బాలుడి ముఖానికి మాస్క్‌ తొడిగారు. ఈదేటపుడు వెట్‌ సూట్‌ వేశారు. బూట్లు వేసి, హెల్మెట్‌ పెట్టారు.

రిచర్డ్‌ హరీ ధైర్యం అసామన్యం...
అయితే డైవర్లతో పాటు వెళ్లిన డాక్టర్‌ రిచర్డ్‌ హరీస్‌ ధైర్యసాహసాలను ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. పిల్లలందరిని బయటకు తీసుకొచ్చేవరకూ రిచర్డ్‌ డైవర్లతోనే ఉన్నారు. బుధవారం మరో విషాదం చోటుచేసుకుంది. ఆ రోజు రిచర్డ్‌ నాన్న గారు మరణించారు. కానీ రిచర్డ్‌ ఆ బాధను దిగిమింగి రోజులానే గుహలోకి వెళ్లి పిల్లలను కాపాడారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top