హెచ్‌ఐవీని పూర్తిగా నిరోధించే టీకా! | Strain of HIV virus found in monkeys is cleared by vaccine | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీని పూర్తిగా నిరోధించే టీకా!

Sep 13 2013 2:12 AM | Updated on Sep 1 2017 10:39 PM

ప్రాణాంతక ఎయిడ్స్ వైరస్ ‘హెచ్‌ఐవీ’ని శరీరం నుంచి పూర్తిగా నిరోధించగల ఓ సమర్థమైన టీకాను ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు.

కోతుల్లో పరీక్షలు విజయవంతం
వాషింగ్టన్: ప్రాణాంతక ఎయిడ్స్ వైరస్ ‘హెచ్‌ఐవీ’ని శరీరం నుంచి పూర్తిగా నిరోధించగల ఓ సమర్థమైన టీకాను ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. కోతుల్లో హెచ్‌ఐవీని ఈ టీకాతో పూర్తిగా నిర్మూలించగలిగామని, మనుషుల్లో కూడా ఇది సత్ఫలితాలనిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుతం హెచ్‌ఐవీ సంక్రమించినవారికి యాంటీవైరల్ మందులు ఉపయోగిస్తూ చికిత్సలు చేస్తున్నా.. చాలా తక్కువ మందిలో మాత్రమే ఫలితం కనిపిస్తోంది. అయితే తాము రూపొందించిన ఈ టీకా కోతుల్లో ఎయిడ్స్‌కు కారణమయ్యే ‘సిమియన్ ఇమ్యూనోడెఫీషియెన్సీ వైరస్ (ఎస్‌ఐవీ)’ని పూర్తిగా నిర్మూలించగలిగిందని వర్సిటీ పరిశోధకులు లూయిస్ పికర్ వెల్లడించారు.
 
సైటోమెగాలో వైరస్(సీఎంవీ) అనే సాధారణ వైరస్‌ను జన్యుమార్పిడి చేసి ఈ టీకాను తయారుచేశామని, కోతుల్లో ఎస్‌ఐవీ కణాలను తెల్లరక్త కణాలు (టీ-సెల్స్) గుర్తించి హతమార్చేందుకు తోడ్పడుతోందన్నారు. కోతులకు ముందుగా ఈ టీకా ఇచ్చి.. తర్వాత ఎస్‌ఐవీని ఎక్కించగా కొంతకాలానికి వాటి శరీరాల్లోంచి ఎస్‌ఐవీ పూర్తిగా తొలగిపోయిందని తెలిపారు. సీఎంవీని జన్యుమార్పిడి చేసి మనుషుల్లో హెచ్‌ఐవీ నిర్మూలనకు ఉపయోగపడే టీకాను కూడా తయారుచేయవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement