అమెరికాలో ఎంబీఏకు గడ్డుకాలం

Steep Drop in MBA Applications in USA - Sakshi

గణనీయంగా తగ్గిపోయిన దరఖాస్తులు

ఇమ్మిగ్రేషన్‌ విధానంలో మార్పులు, చైనాతో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాలోని ప్రఖ్యాత బిజినెస్‌ స్కూల్స్‌ విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. దీంతో ఈ ఏడాది ఆయా బిజినెస్‌ స్కూళ్లలో విద్యార్థుల అడ్మిషన్లు గణనీయమైన సంఖ్యలో తగ్గిపోయాయి.

హార్వర్డ్‌ యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తదితర అమెరికా అగ్రస్థాయి విద్యాసంస్థల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వీటి అనుబంధ బిజినెస్‌ స్కూళ్లలో ప్రతి ఏడాది అడ్మిషన్‌ దరఖాస్తుల సంఖ్య తగ్గిపోతోంది. డార్ట్‌మౌత్‌ కాలేజీకి చెందిన టక్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో దరఖాస్తుల సంఖ్య ఏకంగా రెండంకెల శాతానికి పడిపోయింది.
చదవండి: హెచ్‌-1బీ వీసాలు: ట్రంప్‌కు సంచలన లేఖ

వరుసగా ఐదో ఏడాది కూడా అమెరికాలో ఎంబీఏ కోర్సు దరఖాస్తుల సంఖ్య పడిపోయింది. గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్స్‌ కౌన్సిల్‌ విశ్లేషణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. బిజినెస్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ అయిన ఈ స్వచ్ఛంద సంస్థ.. జీమ్యాట్‌ అడ్మిషన్స్‌ టెస్టు నిర్వహిస్తుంది. ప్రస్తుత వేసవికాలంలో ముగిసే విద్యా సంవత్సరానికిగాను అమెరికా బిజినెస్‌ స్కూళ్లకు విద్యార్థుల నుంచి 1,35,096 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో సంప్రదాయ ఎంబీఏ కోర్సు దరఖాస్తులు కూడా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే గత ఏడాది కన్నా దరఖాస్తులు 9.1శాతం పడిపోయాయి. గత ఏడాది కూడా బిజినెస్‌ కోర్సుల దరఖాస్తుల్లో 7శాతం తగ్గుదల నమోదైంది.

ఒకప్పుడు విదేశీ విద్యార్థులు పెద్దసంఖ్యలో అమెరికాలో ఎంబీఏ కోర్సు చేసేందుకు ఉత్సాహం చూపేవారు. అగ్రరాజ్యంలో ఎంబీఏ చేస్తే.. ఆ దేశ ప్రముఖ కంపెనీల్లో అత్యున్నత మేనేజ్‌మెంట్‌ హోదాలో ఉద్యోగం సంపాదించవచ్చునని, తద్వారా కంపెనీ నాయకత్వ దశకు ఎదుగుతూ.. భారీ వేతనాలు అందుకోవచ్చునని ఆశించేవారు. కానీ, ఇటీవల చేపట్టిన ఇమ్మిగ్రేషన్‌ విధానంలో మార్పులు, చైనాతో రాజకీయ, వాణిజ్య ఘర్షణలు, టెక్నాలజీ పరిశ్రమ ఉద్యోగాలు ఎక్కువ ఆకర్షణీయంగా ఉండటంతో అమెరికాలో ఎంబీఏ చేసే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతూ వస్తోంది. రెండేళ్ల ఎంబీఏ కోర్సుకు అంతగా డిమాండ్‌ లేకపోవడం, ఉద్యోగావకాశాలు క్రమంగా తగ్గడం, దీనికితోడు అండర్‌ గ్రాడ్యుయేట్‌ రుణభారాలతో మినినీయల్స్‌ సతమతమవుతుండటంతో ఒకింత ఖరీదైన ఎంబీఐ కోర్సును చేసేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top