హెచ్‌-1బీ వీసాలు: ట్రంప్‌కు సంచలన లేఖ

Let in More High Skilled Foreign Workers, Business school leaders Appeal to Trump - Sakshi

ఇమ్మిగ్రేషన్‌ విధానంలో సత్వరమే మార్పులు తేవాలి

ప్రతిభావంతులైన విదేశీ వర్కర్స్‌ను పెద్ద ఎత్తున దేశంలోకి అనుమతించాలి

50 బిజినెస్‌ స్కూల్స్‌ డీన్స్‌ బహిరంగ లేఖ

న్యూయార్క్‌: అమెరికా ఇమ్మిగ్రేషన్‌ (వలస) విధానంలో సత్వరమే మార్పులు తీసుకురావాలని, మంచి నైపుణ్యం గల విదేశీ వర్కర్స్‌ను మరింతగా దేశంలోకి అనుమతించాలని, అమెరికా ఆర్థిక వృద్ధికి, భవిష్యత్‌ సాంకేతిక రంగ పునర్నిర్మాణానికి ఇది  అత్యవసరమని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆ దేశ బిజినెస్‌ విశ్వవిద్యాలయాలు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కోరాయి. మంచి నైపుణ్యం గల వర్కర్స్‌ను ఆకర్షించేవిధంగా దేశ ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని సమీక్షించాలని ట్రంప్‌తోపాటు అమెరికా చట్టసభ నాయకులను అభ్యర్థిస్తూ 50 బిజినెస్‌ స్కూళ్ల డీన్స్‌ ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను వాల్‌స్ట్రీట్‌ జనరల్‌ బుధవారం ప్రచురించింది. యేల్‌, కొలంబియా, స్టాన్‌ఫోర్డ్‌, డ్యూక్‌, న్యూయార్క్‌ యూనివర్సిటీ వంటి ప్రఖ్యాత వర్సిటీల అధిపతులు ఈ లేఖపై సంతకం చేశారు. వివిధ దేశాలకు ఇస్తున్న వీసాల మీద పరిమితులు ఎత్తివేయాలని, అత్యున్నత నైపుణ్యం గల వ్యక్తులు అమెరికాకు వచ్చేందుకు వీలుగా హెచ్‌-1బీ వీసా విధానంలో సంస్కరణలు తీసుకురావాలని, స్కిల్డ్‌ వర్కర్స్‌ అమెరికా రాకను ప్రోత్సహించేందుకు ‘హార్ట్‌ల్యాండ్‌ వీసా’ లాంటి విధానాన్ని అమల్లోకి తీసుకురాలని వారు తమ లేఖలో కోరారు.

కాలం చెల్లిన చట్టాలు, ఇమ్మిగ్రేషన్‌పై ప్రాంతాల వారీగా విధిస్తున్న పరిమితులు, ఇటీవలి అస్థిర వాతావరణం వంటి కారణాలు.. అత్యున్నత నైపుణ్యంగల వలసదారులను దేశంలోకి రా​కుండా అడ్డుకుంటున్నాయని, దేశ ఆర్థిక వృద్ధికి వారి రాక కీలకమని డీన్స్‌ పేర్కొన్నారు. గత మూడేళ్లుగా అమెరికా యూనివర్సిటీల్లో, బిజినెస్‌ స్కూళ్లలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గిందని తాము చేపట్టిన విశ్లేషణలో వెల్లడయిందని డీన్స్‌ పేర్కొన్నారు. ప్రతిభను, నైపుణ్యాన్ని గుర్తించకపోతే అది దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేటు తెస్తుందని డీన్స్‌ హెచ్చరించారు.
చదవండి: అమెరికాలో ఎంబీఏకు గడ్డుకాలం

అమెరికా విధించిన పరిమితుల కారణంగా హెచ్‌-1బీ వీసాలు గణనీయంగా తగ్గిపోయాయని, 2004లో లక్ష95వేల హెచ్‌-1బీ వీసాలు జారీచేయగా.. ప్రస్తుతం 85వేల వీసాలు మాత్రమే జారీచేస్తున్నారని, డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో హెచ్‌-1బీ వీసాల తిరస్కరణ గణనీయంగా పెరిగిందని, 2015లో 6శాతం వలసదారులకు మాత్రమే ఈ వీసాలు తిరస్కరించగా.. 2019లో అది ఏకంగా 32శాతానికి ఎగబాకిందని తెలిపారు. అంతేకాకుండా హెచ్‌-1బీ వీసాల కోసం వస్తున్న దరఖాస్తులు కూడా గణనీయంగా తగ్గిపోయాయని, 2017లో రెండు లక్షల 36వేల హెచ్‌-1బీ వీసా దరఖాస్తులు రాగా, 2018కి అవి లక్షా 99వేలకు పడిపోయాయని డీన్స్‌ వెల్లడించారు. ట్రంప్‌ సర్కారు ఆలాపిస్తున్న వలస వ్యతిరేక రాగం.. తీవ్ర ప్రభావం చూపుతోందని, దీంతో విదేశీ వలసదారుల్లో ఒకరకమైన భయం ఆవరించిందని వారు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top