అమెరికా సామాజిక కార్యకర్తకు శ్రీలంక క్షమాపణలు

అమరా మజీద్‌ (అమెరికా సామాజిక కార్యకర్త)  - Sakshi

కొలంబో : ఈస్టర్‌ పండుగ సందర్భంగా గత ఆదివారం శ్రీలంకలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో 359 మంది అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ దాడులతో అప్రమత్తమైన శ్రీలంక ప్రభుత్వం భద్రతా చర్యలను ముమ్మరం చేసింది. నిందితులను పట్టుకునేందుకు సీఐడీని రంగంలోకి దింపింది. ఈనేపథ్యంలో పేలుళ్లతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఆరుగురు అనుమానితుల పేర్లు, ఫొటోలను శ్రీలంక ప్రభుత్వం గురువారం రాత్రి విడుదల చేసింది. ఇందులో ముగ్గురి మహిళల పాత్ర ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ ఫొటోల విషయంలో శ్రీలంక ప్రభుత్వం ఘోర తప్పిదం చేసింది. ఒకరి ఫొటోకు బదులు మరొకరి ఫొటో ప్రచురించి చేతులు కాల్చుకుంది. తీరా ఈ విషయంపై సదరు వ్యక్తి నిలదీయడంతో తప్పును గుర్తించి క్షమాణలు కోరింది. 

శ్రీలకం ప్రభుత్వం ప్రకటించిన అనుమానస్పదుల జాబితాలో ఫాతిమా ఖాదీయా ఉగ్రవాదికి బదులు అమెరికా సామాజిక కార్యకర్త అమరా మజీద్‌ ఫొటోను ప్రచురించింది. ఈ విషయాన్ని గుర్తించిన అమరా మజీద్‌ ట్విటర్‌ వేదికగా తనేలాంటి ఉగ్రదాడుల్లో పాలుపంచుకోలేదని, అనవసరంగా నా ఫొటోను ఎందుకు ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఈ ఉదయం శ్రీలంక ప్రభుత్వం ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాల్లో నా ఫొటోను గుర్తించాను. ఈస్టర్‌ పండుగ నాడు శ్రీలంకలో జరిగిన దాడులతో నాకేమి సంబంధం లేదు. ఇప్పటికే మా ముస్లిం వర్గం నిఘా అధికారుల తప్పుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరోసారి ఇలాంటి తప్పుడు నిందారోపణలు చేయవద్దు. ఒక సారి పున:సమీక్ష జరపండి. దయచేసి ఈ మారణహోమంతో నాకు అంటగడుతూ నిందలు మోపడం ఆపండి. ఇలాంటి సమాచారాన్ని అందించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే తప్పుల వల్ల అమయాకుల కుటుంబం, కమ్యూనిటీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది’ అని వరుస ట్వీట్లతో శ్రీలంక ప్రభుత్వాన్ని నిలదీసింది.

ఈ ట్వీట్లతో మేల్కొన్న శ్రీలంక ప్రభుత్వం సామాజిక కార్యకర్తైనా అమరా మజీద్‌కు క్షమాపణలు కోరుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘ ఈ రోజు మీడియాకు విడుదల చేసిన ఆరుగురు అనుమానస్పద ఉగ్రవాదుల విషయంలో ఘోర తప్పిదం చోటుచేసుకుంది. సీఐడీ అందించిన సమాచారం మేరకు మేం ఫాతిమా ఖాదీయా అనే ఉగ్రవాది ఫొటోను ప్రచురించడం జరిగింది. అయితే ప్రస్తుతం సీఐడీ అందించిన సమాచారం ప్రకారం ఆ ఫొటో ఫాతిమా ఖాదీయాది కాదు. అమెరికాకు చెందిన సామాజిక కార్యకర్తది. ఈ పొరపాటుకు చింతిస్తున్నాం. ఆమె ఫొటోను వెంటనే తొలగిస్తున్నాం.’ అని పేర్కొంది. ఈ విషయాన్ని అమరా మజీదే ట్విటర్‌ వేదికగా తెలియజేసింది. తన ఫొటోను ఆ జాబితా నుంచి తొలిగించారని పేర్కొంది.  ఏది ఏమైనప్పటికి దాడులకు ఏమాత్రం సంబంధం లేని ముస్లిం మహిళను ఉగ్రవాదుల జాబితాలో ప్రకటించడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ముస్లిం పేరు కనిపిస్తే ఉగ్రవాదులేనన్నట్లు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top