హసీనాదే బంగ్లా పీఠం!

Sheikh Hasina wins new term as prime minister - Sakshi

భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్న అధికార పార్టీ

పోలింగ్‌ సందర్భంగా చెలరేగిన హింస..17 మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్‌ ప్రధానిగా షేక్‌ హసీనా నాలుగోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్‌ భారీ మెజారిటీ దిశగా సాగుతున్నట్లు తెలిసింది. 299 స్థానాలకు పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కడపటి వార్తలందే సరికి అవామీ లీగ్‌ అభ్యర్థులు 90 చోట్ల, ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బీఎన్‌పీ) అభ్యర్థులు మూడు చోట్ల గెలుపొందారు. మరోవైపు, ఫలితాల సరళిని బీఎన్‌పీ నాయకత్వంలోని విపక్ష కూటమి తోసిపుచ్చింది. అధికార పార్టీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిందని, తాత్కాలిక తటస్థ ప్రభుత్వం నేతృత్వంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. అంతకుముందు,  పోలింగ్‌ సందర్భంగా చెలరేగిన హింసలో 17 మంది చనిపోయారు. ముఖ్యంగా అవామీ లీగ్, బీఎన్‌పీ కార్యకర్తల మధ్య పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.  

హసీనా రికార్డు విజయం..
అవామీ లీగ్‌ విజయం దాదాపు ఖాయమైనట్లేనని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. అవామీ లీగ్‌ మరో 62 చోట్ల, బీఎన్‌పీ రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌ అధికారులు తెలిపారు. గోపాల్‌ గంజ్‌ నియోజకవర్గంలో ప్రధాని హసీనా..బీఎన్‌పీ అభ్యర్థి పై రికార్డు మెజారిటీతో గెలుపొందారు. హసీనాకు 2 లక్షల పైచిలుకు ఓట్లు రాగా, ఆమె సమీప ప్రత్యర్థికి కేవలం 123 ఓట్లే దక్కాయి. ఢాకాలో ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత హసీనా మాట్లాడుతూ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మంచి జీవితం బంగ్లాదేశ్‌ ప్రజలు మళ్లీ తమకు పట్టం గడతారని చెప్పారు.

బీఎన్‌పీ అధినేత్రి ఖలేదా జియా జైలుకు వెళ్లడంతో పార్టీని ముందుండి నడిపించిన ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రూల్‌ ఇస్లాం థాకూర్‌గావ్‌ నియోజక వర్గం నుంచి గెలుపొందారు. మొత్తం 299 స్థానాల్లో 1,848 మంది పోటీచేశారు. అభ్యర్థి మరణించడంతో ఒక స్థానంలో ఎన్నిక వాయిదాపడింది. సోమవారం ఉదయానికి పూర్తిస్థాయి ఫలితాలు వెలువడనున్నాయి. అవామీ లీగ్‌ గెలిస్తే షేక్‌ హసీనా రికార్డు స్థాయిలో నాలుగోసారి ప్రధాని అవుతారు. మరోవైపు, అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలేదా జియా పాక్షిక పక్షవాతానికి లోనైన సంగతి తెలిసిందే. దీంతో తాజా ఫలితాలతో ఆమె క్రియాశీల రాజకీయ జీవితంపై సందిగ్ధం ఏర్పడింది.

పెచ్చరిల్లిన హింస..
పోలింగ్‌ రోజున దేశవ్యాప్తంగా 8 జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో పోలీసు సహా 17 మంది మరణించారు. అధికార, ప్రతిపక్ష కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో 13 మంది మృతిచెందగా, ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు చనిపోయారు. విపక్ష కార్యకర్తల దాడిలో ఓ పోలీసు మృతిచెందాడు. మృతుల్లో ఎక్కువ మంది అవామీ లీగ్‌ కార్యకర్తలే ఉన్నారని     పోలీసులు నిర్ధారించారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top