పుల్వామా ఘటన దారుణం

Pulwama incident was brutal says Trump - Sakshi

ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు సాయమందిస్తాం: ట్రంప్‌

వాషింగ్టన్‌: ఇటీవల పాక్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ పుల్వామాలో జరిపిన దాడిని చాలా దారుణమైనదిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు తమ పాలనావ్యవస్థ మొత్తం భారత్‌కు సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ హేయమైన చర్యకు కారకులను శిక్షించాల్సిం దిగా పాకిస్తాన్‌కు సూచించారు. ఈ నెల 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన దాడి కారణంగా 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. దీంతో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైట్‌హౌస్‌లో ట్రంప్‌ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్‌ల మధ్య స్నేహపూర్వకమైన సంబంధాలు నెలకొంటే చాలా అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు.

పుల్వామాలో ఉగ్రదాడి చాలా హేయమైనదని, దీనిపై తమకు నివేదికలు అందాయని చెప్పారు. ‘ఈ ఘటనను చూశాను. దీనిపై చాలా నివేదికలు నాకు అందాయి. సరైన సమయంలో దీనిపై స్పందించాల్సి ఉంది’అని చెప్పారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాదు.. భారత్‌కు మద్దతు కూడా ఇస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ‘ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో అంతం చేసేందుకు భారత్‌కు అన్ని విధాలా సాయం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నాం’అని విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి రాబర్ట్‌ పల్లాడినో తెలిపారు. పాకిస్తాన్‌తో కూడా ఈ విషయంపై మాట్లాడామని, ఉగ్రదాడికి సంబంధాలున్న వారిని కఠినంగా శిక్షించాల్సిందిగా పాకిస్తాన్‌కు సూచించామని పేర్కొన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top