విమానంలో జగడం షికాగోకు దారి మళ్లింపు | Passenger feud over reclining seat leads to unscheduled landing | Sakshi
Sakshi News home page

విమానంలో జగడం షికాగోకు దారి మళ్లింపు

Aug 27 2014 3:04 AM | Updated on Sep 2 2017 12:29 PM

ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం గొడవ పడటం.. మాటా మాటా పెరిగి చివరికి కొట్టుకునేదాకా వెళ్లడమూ మనకు అప్పుడప్పుడూ అనుభవంలోకి వచ్చేదే.

న్యూయార్క్: ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం గొడవ పడటం.. మాటా మాటా పెరిగి చివరికి కొట్టుకునేదాకా వెళ్లడమూ మనకు అప్పుడప్పుడూ అనుభవంలోకి వచ్చేదే. అయితే, బస్సుల్లోనే కాదు.. విమానాల్లో సైతం ఇలాంటి చిల్లర గొడవలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. తాజాగా ఆదివారం అమెరికాలో న్యూయార్క్ నుంచి డెన్వర్‌కు వెళుతున్న యునెటైడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య జగడం వల్ల ఆ విమానాన్ని షికాగోకు దారిమళ్లించాల్సి వచ్చింది. ఆనక వారిని షికాగోలోనే దించేసి విమానం గంటన్నర ఆలస్యంతో తిరిగి డెన్వర్‌కు బయలుదేరింది. విమానంలో వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి తన ముందు సీటును వెనక్కి వాల్చేందుకు వీలుకాకుండా ‘నీ డిఫెండర్’ అనే పరికరాన్ని బిగించాడు.

దీంతో ముందు కూర్చున్న ఓ మహిళ తన సీటును వాల్చేందుకు ప్రయత్నించి, పరికరాన్ని చూసింది. విమానాల్లో అలాంటి పరికరాలు నిషిద్ధమని, దానిని తొలగించాలని విమాన సిబ్బంది కూడా నచ్చచెప్పారు. అయినా వినకుండా.. తనకు ల్యాప్‌టాప్ పెట్టుకోవడానికి స్థలం కావాలంటూ అతడు మొండిపట్టు పట్టాడు. కోపంతో ఊగిపోయిన ఆ మహిళ గ్లాసులో నీళ్లు తీసుకుని అతడి ముఖంపై విసిరికొట్టింది. ఇంకేం.. ఇద్దరి అరుపులతో విమానం దద్దరిల్లిపోయింది. వారి గొడవ ఆగే పరిస్థితి కనిపించకపోవడంతో విమానాన్ని అర్ధంతరంగా సమీపంలోని షికాగోకు మళ్లించి దింపేశారు. బిలబిలమంటూ పోలీసులు, విమానాశ్రయ అధికారులు పరుగెత్తుకొచ్చారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారినక్కడే వదిలేసి విమానం డెన్వర్‌కు చేరుకుంది. ఇది వినియోగదారుల వ్యవహారం కావడంతో వారిపై కేసులు పెట్టలేదట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement