రఫేల్‌ ప్లాంట్‌లో రక్షణ మంత్రి

Nirmala Sitharaman Visits Rafale Manufacturing Facility in France - Sakshi

రాహుల్‌ అబద్ధాలకోరు: బీజేపీ

విశేషణాలు వద్దు..నిజాలు చెప్పండి: కాంగ్రెస్‌

పారిస్‌: ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం రఫేల్‌ యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. పారిస్‌ సమీపంలోని ఈ ఉత్పత్తి కేంద్రంలో ఫ్రెంచ్‌ కంపెనీ డసో ఏవియేషన్‌ తయారుచేసే విమానాలనే భారత్‌కు సరఫరా చేయనున్నారు. ఈ సందర్భంగా డసో కంపెనీ ప్రతినిధులతో ముచ్చటించిన నిర్మలా సీతారామన్, విమానాల తయారీ పురోగతిని పరిశీలించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నుంచి పలు దశల్లో రఫేల్‌ విమానాలు భారత్‌కు అందుతాయి. అంతకుముందు, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లేతో సమావేశమైన నిర్మలా సీతారామన్‌..ఇరు దేశాల వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతంపై చర్చించారు. వీరి మధ్య రఫేల్‌ ఒప్పందం ప్రస్తావనకు వచ్చిందో? రాలేదో? తెలియరాలేదు.

ఆగని విమర్శలు, ప్రతివిమర్శలు..
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అబద్ధాలకోరు, వదంతుల సృష్టికర్త అని బీజేపీ మండిపడింది. రఫేల్‌ ఒప్పందంపై ఆయన తరచూ చెబుతున్న అబద్ధాలు నిజాన్ని కప్పిపుచ్చలేవని పేర్కొంది. డసో ఏవియేషన్‌ సీఈఓ ఎరిక్‌ ట్రాపియర్‌ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..ఫ్రాన్స్‌ ప్రభుత్వం రాహుల్‌ మాటల్లోని డొల్లతనాన్ని బహిర్గతంచేసిందని, ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సూచించారు. మరోవైపు, బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. రఫేల్‌ ఒప్పందంపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని, ఎవరు అబద్ధాలు చెబుతున్నారో అప్పుడే తెలుస్తుందని పేర్కొంది. గోయల్‌ చేసిన ఆరోపణలకు కాంగ్రెస్‌ నాయకుడు పవన్‌           ఖేరా స్పందిస్తూ ‘వాస్తవాల ఆధారంగానే మేము ప్రశ్నలు అడిగాం. మీరు కూడా వాస్తవాలతో కూడిన సమాధానాలు ఇవ్వాలి. దేశానికి నిజాలు కావాలి. రాహుల్‌కు మీరు ఆపాదిస్తున్న విశేషణాలు కాదు. అప్పుడు ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు అబద్ధాలాడుతున్నారు? అన్నది ప్రజలు నిర్ణయిస్తారు’     అని అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top