అన్ని ఇమిగ్రేషన్‌ వీసాలపై తాత్కాలిక నిషేధం 

Moratorium On All Immigration Visas Says Donald Trump - Sakshi

త్వరలో ఉత్తర్వులపై సంతకం చేస్తా: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికాలోకి అన్ని రకాల వలసలపై తాత్కాలికంగా నిషేధం విధించే అధికారిక ఉత్తర్వులపై త్వరలో సంతకం చేయనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అదృశ్య శత్రువైన కరోనా వైరస్‌ దాడి నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు, అమెరికన్ల ఉద్యోగాలకు భద్రత కల్పించేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం రాత్రి ట్వీట్‌ చేశారు. ట్రంప్‌ తాజా నిర్ణయంపై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కరోనాను అదుపు చేయడంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ఉద్దేశంతోనే ట్రంప్‌ ఆ నిర్ణయం తీసుకున్నారని డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్‌ సెనేటర్‌ కమల హారిస్‌ సహా పలువురు నేతలు విమర్శించారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యతను పక్కనబెట్టి, దేశానికి వలసదారులు అందిస్తున్న సేవలను విస్మరించి, ఈ విషయాన్ని ట్రంప్‌ రాజకీయం చేస్తున్నారని నేషనల్‌ ఇమిగ్రేషన్‌ ఫోరం డైరెక్టర్‌ అలీ నూరానీ ఆరోపించారు.

హెచ్‌1బీ పైనా ప్రభావం 
ట్రంప్‌ సంతకం చేయనున్న ఉత్తర్వుల్లో ఏం ఉండబోతోందన్నది, ఆ ఉత్తర్వులపై ఆయన ఎప్పుడు సంతకం చేయనున్నారన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఇమిగ్రేషన్‌ వీసాలపైననే తాత్కాలిక నిషేధం విధించబోతున్నట్లు ట్రంప్‌ ట్వీట్‌ చేసినప్పటికీ.. అమెరికన్ల ఉద్యోగ భద్రతపై కూడా ఆ ట్వీట్‌లో ప్రస్తావించినందువల్ల నాన్‌– ఇమిగ్రంట్‌ వీసా అయిన హెచ్‌1బీ పైనా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే.. విదేశీయులపై ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. గత అధ్యక్ష ఎన్నికల సమయం నుంచి యూఎస్‌ ఇమిగ్రేషన్‌ వ్యవస్థను ట్రంప్‌ లక్ష్యంగా చేసుకున్నారు. ఆ తరువాత కూడా పలు సందర్భాల్లో వీసా విధానాన్ని మార్చాలన్న తన ఆలోచనను ఆయన వెల్లడించారు.

నిపుణులైన విదేశీయులకే అమెరికా స్వాగతం పలుకుతుందని స్పష్టం చేశారు. ఇమిగ్రేషన్‌ వీసాల నిషేధంపై కూడా ఆయన చాన్నాళ్లుగా ఆలోచిస్తున్నట్లు ఒక ఉన్నతాధికారి ఎన్‌బీసీ న్యూస్‌కు వెల్లడించారు. నిషేధ ప్రణాళిక, ఏయే దేశాలపై ప్రభావం చూపనుందనేది త్వరలో తెలుస్తుందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికా ఇప్పటికే యూరోప్, చైనా, కెనడా, మెక్సికోల నుంచి విదేశీయులెవరూ దేశంలోకి రాకుండా నిషేధం విధించింది. అన్ని వీసా సేవలను నిలిపేసింది. కరోనా కారణంగా అమెరికా ఆర్థికంగా భారీగా దెబ్బ తిన్నది. ఇప్పటికే 2.2 కోట్ల మంది అమెరికన్లు నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top