చైనాలో మిరాకిల్‌కే మిరాకిల్ | Sakshi
Sakshi News home page

చైనాలో మిరాకిల్‌కే మిరాకిల్

Published Mon, Feb 8 2016 7:05 PM

చైనాలో మిరాకిల్‌కే మిరాకిల్

బీజింగ్: చైనాలో అద్బుతం చోటుచేసుకుంది. చనిపోయాడని వైద్యులు నిర్ధారించిన ఓ నెల రోజులు కూడా నిండని బాలుడు తిరిగి బతికి వైద్యులను ఖిన్నులను చేశాడు. అది కూడా గడ్డగట్టే శీతలగదిలో 15 గంటలపాటు ఉండి. ఓ పక్క ఇలాంటి మిరాకిల్ ఎలా సాధ్యమైందబ్బా అని వైద్యులు ఆలోచిస్తుండగా అప్పటికే ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లిన ఆ పసి బాలుడి తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. చైనాలో జిన్ హువా లూ అనే వ్యక్తికి నెలలు నిండకుండా ఓ రెండు నెలలు ముందుగా బాలుడు జన్మించాడు. అయితే, అతడిని 23 రోజులపాటు ఇంక్యూబేటర్లో పెట్టారు.

అనంతరం ఇప్పుడు ఆ పసిబిడ్డ పూర్తి ఆరోగ్యంగా కోలుకున్నాడని వైద్యులు చెప్పడంతో అతడిని ఇంటికి తీసుకెళ్లారు. కానీ, పసిబిడ్డను ఇంటికి తీసుకెళ్లిన రెండు రోజులకే తిరిగి అనారోగ్యంతో కనిపించడంతో అతడిని పరీక్షించిన వైద్యులు బాలుడి గుండె ఆగిపోయినట్లు గుర్తించారు. అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో ఆ బాలుడిని రెండు దుప్పట్లో చుట్టేసి మైనస్ 12 డిగ్రీల సెల్సియస్ శీతల శవాల గదికి మార్చారు. 15గంటల అనంతరం అతడిని ఖననం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఏర్పాట్లు పూర్తయ్యాయి. అతడిని పూడ్చిపెట్టేందుకు వారు తీసుకురావడానికి దుప్పట్లు విప్పగా అందులో నుంచి కేర్ మని బాలుడు గట్టిగా ఏడ్చాడు. ఈ ఘటన చూసి అక్కడి వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. వైద్యులు చనిపోయాడని నిర్థారించిన కొన్ని గంటల తర్వాత ఆ పసిబాలుడు బ్రతకడం ఒక మిరాకిల్ అయితే, మైనస్ 12 డిగ్రీల సెల్సియస్లో ఆ బాబు 15గంటలపాటు ఉండి బ్రతకడం మిరాకిల్కే మిరాకిల్.

Advertisement
Advertisement