
అమ్మాయిలను అమ్ముతున్న ఐసిస్!
‘అందమైన కన్య. వయసు 12 ఏళ్లు. ధర 12,500 డాలర్లకు చేరింది. తొందరలోనే అమ్ముడుపోతుంది.
టెలిగ్రామ్ యాప్‌లలో ప్రకటన
ఖాన్కే(ఇరాక్) : ‘అందమైన కన్య. వయసు 12 ఏళ్లు. ధర 12,500 డాలర్లకు చేరింది. తొందరలోనే అమ్ముడుపోతుంది. త్వరపడండి’... ఐసిస్ ఉగ్రవాద సంస్థ అమ్మాయిలను సెక్స్ బానిసలుగా అమ్మేస్తూ ‘టెలిగ్రామ్’ యాప్ ద్వారా అరబిక్ భాషలో ఇచ్చిన వికృత ప్రకటన ఇది. మైనారిటీ యాజిదీ వర్గానికి చెందిన కార్యకర్త దీన్ని అసోసియేటెడ్ ప్రెస్ సంస్థకు పంపారు. యాజిదీ మహిళలను, పిల్లలను ఈ ఉగ్రవాద సంస్థ సెక్స్ బానిసలుగా బంధించింది. ఓవైపు తన భూభాగాన్ని కోల్పోతున్న ఐసిస్, తన వద్ద బందీలుగా ఉన్న 3వేల మంది మహిళలు, పిల్లలపై తన పట్టును బిగిస్తోంది. మహిళలను వస్తువులను అమ్మినట్లు స్మార్ట్‌ఫోన్ ద్వారా విక్రయిస్తోంది.
ఐఎస్ చెక్‌పాయింట్స్ నుంచి వారు పారిపోకుండా వారి ఫొటోలతో పాటు, యజమానుల పేర్లను కూడా షేర్ చేస్తోంది. వారిని రక్షించేందుకు యత్నించిన స్మగ్లర్లను చంపేస్తోంది. కుర్దిష్ మాట్లాడే మైనారిటీలను అంతమొందించే ఉద్దేశంతో 2014లో ఐసిస్ ఉగ్రవాదులు వందలాది మంది కుర్దిష్ మహిళలను, చిన్నారులను బంధించారు. అప్పటి నుంచి అరబ్, కుర్దిష్ స్మగ్లర్లు నెలకు సగటున 134 మందిని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించగలిగారు. అయితే కుర్దిస్తాన్ స్థానిక ప్రభుత్వ వివరాల ప్రకారం మే నెలలో ఈ సంఖ్యను ఐఎస్ 39కి పరిమితం చేసింది. గత రెండు మూడు నెలల నుంచి ఉగ్రవాదుల ఖైదు నుంచి పారిపోవడంప్రమాదకరంగా మారింది.
మరిన్ని దాడులు ముందున్నాయి: ఐసిస్
ఢాకా : ఢాకా దాడి కేవలం చిన్నది మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని దాడులు తప్పవని ఐసిస్ హెచ్చరించింది. బంగ్లా, ప్రపంచవ్యాప్తంగా షరియత్ చట్టం అమలయ్యేంత వరకు దాడులు చేస్తూనే ఉంటామని బంగ్లా భాషలో ఓ వీడియోను విడుదల చేసింది. ఢాకా రెస్టారెంట్‌పై దాడికి పాల్పడి 22 మంది(అత్యధికులు విదేశీయులు)ని పొట్టన పెట్టుకున్న ఘటన జరిగి కొద్దిరోజులు కూడా గడవకముందే ఈ వీడియో వెలువడింది. ముగ్గురు ఐఎస్ ఉగ్రవాదులు మాట్లాడుతూ హెచ్చరికలు జారీ చేశారు. ‘ఢాకా ఘటన రవ్వంతే. ఇలాంటివి మరెన్నో పునరావృతమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా షరియత్ చట్టం ఏర్పాటయ్యే వరకూ దాడులు ఆగబోవు. మీరు ఓడిపోయి.. మేం గెలిచేవరకూ ఇవి కొనసాగుతాయి’ అని అందులో పేర్కొన్నారు.