గోప్యతకు ఫేస్‌బుక్‌ రక్షణ | Sakshi
Sakshi News home page

గోప్యతకు ఫేస్‌బుక్‌ రక్షణ

Published Wed, Jan 31 2018 1:35 AM

Facebook protection for privacy - Sakshi

వాషింగ్టన్‌ : సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ తొలిసారిగా తన గోప్యతా నిబంధనలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా ఫేస్‌బుక్‌ ఉపయోగిస్తుండగా, ఈ సంస్థ ఇప్పటివరకు ఇలాంటి నిబంధనలను ప్రకటించలేదు. ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ప్రారంభించేందుకు వినియోగదారులకు నిర్దేశించే నియమ, నిబంధనలకు ఇవి భిన్నమైనవి. ఈ మాధ్యమాన్ని ఉపయోగించేవారు తాము ‘యాక్సెస్‌’ చేసే అంశాలపై నియంత్రణకు వీటిని అమల్లోకి తెస్తున్నట్టు ఫేస్‌బుక్‌ తెలిపింది.

ఫేస్‌బుక్‌ యూజర్స్‌కు వారి గోప్యతపై నియంత్రణ కల్పించడంతో పాటు, వారు షేర్‌ చేసే సమాచారాన్ని సొంతం చేసుకునేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడతాయని పేర్కొంది. వినియోగదారులు వారి సమాచారాన్ని ఏవిధంగా పరిరక్షించుకోవచ్చో వివరించే వీడియోలను ఫేస్‌బుక్‌ త్వరలోనే విడుదల చేయనుంది. ఫేస్‌బుక్‌ వినియోగించే వారందరూ తమ సమాచారాన్ని అందరితో పంచుకోవాలని (తమ సంస్థతో సహా) కోరుకోవడం లేదని గుర్తించినట్టు తెలిపింది.

జీడీపీఆర్‌ చట్టం నేపథ్యంలో...
యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) తీసుకొచ్చిన నూతన డేటా పరిరక్షణ చట్టం జీడీపీఆర్‌ (జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌) మే 25 నుంచి అమలుకానుంది. జీడీపీఆర్‌ చట్టాన్ని అనుసరించడంలో భాగంగానే ఫేస్‌బుక్‌ తాజా చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

వినియోగదారులు తమ డేటాను ఎలా మేనేజ్‌ చేసుకోవచ్చు, పాత పోస్ట్‌లను ఏ విధంగా తొలగించవచ్చు, అకౌంట్‌ను పూర్తిగా తొలగించినప్పుడు డేటా ఏమవుతుందన్న విషయాలను వివరించనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. గతంలో ఆన్‌లైన్‌ కార్యకలాపాలను ట్రాక్‌ చేసే విషయంలో ఈయూ పర్యవేక్షకుల దర్యాప్తులను ఫేస్‌బుక్‌ ఎదుర్కొంది. జీడీపీఆర్‌ ప్రకారం.. ఏవైనా కంపెనీల డేటా చోరీకి గురైతే ఆ విషయాన్ని ఆయా కంపెనీలు 72 గంటల్లోనే ప్రకటించాలి. వినియోగదారులు డేటాను పంపేందుకు/తొలగించేందుకు కంపెనీలు అనుమతించాల్సి ఉంటుంది.


గోప్యత నిబంధనలు ఇవే...
తమ డేటాను ఫేస్‌బుక్‌ యూజర్స్‌ నియంత్రించుకునేందుకు దోహదపడేలా ఈ నిబంధనలను ప్రకటిస్తున్నట్లు చీఫ్‌ ప్రైవసీ ఆఫీసర్‌ ఎరిన్‌ ఎగన్‌ చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
♦ వినియోగదారుల గోప్యతపై వారికే నియంత్రణ కల్పిస్తున్నాం. ఈ నియంత్రణలేమిటో వారే తెలుసుకుని తదనుగుణంగా వ్యవహరించాలి. ఉదాహరణకు... మా ఆడియన్స్‌ సెలక్టర్‌ టూల్‌ వినియోగదారులు ప్రతి పోస్ట్‌ను ఎవరితో షేర్‌ చేసుకోవాలనే దానిని నిర్ణయించే అధికారాన్ని కల్పిస్తుంది.
 డేటాను ఫేస్‌బుక్‌ ఎలా ఉపయోగిస్తుందన్నది యూజర్స్‌ అర్థం చేసుకునేలా సహాయపడతాం. రోజువారీ ఫేస్‌బుక్‌ వినియోగంలో భాగంగా ఎడ్యుకేషన్, టూల్స్‌ వంటి వాటిని జతచేశాం.
 సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు కష్టపడి పనిచేస్తున్నాం. ప్రతి ఫేస్‌బుక్‌ ప్రొడక్ట్‌లోనూ భద్రతాంశాన్ని పొందుపరుస్తున్నాం. దీనికోసం ‘టూ ఫాక్టర్‌ అథెంటికేషన్‌’ అనే సెక్యూరిటీ టూల్‌ను కూడా అందుబాటులోకి తెచ్చాం.
 వినియోగదారులు తమ సమాచారాన్ని వారే తొలగించవచ్చు. ఎవరితో ఏమి షేర్‌ చేయాలన్నది వారే నిర్ణయించవచ్చు. వినియోగదారులు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు సమాచారాన్ని మా సర్వర్ల నుంచి తొలగిస్తాం.

Advertisement

తప్పక చదవండి

Advertisement