
నెటిజన్లను కదిలించిన పాక్ మహిళ కథ
సామాజిక అనుసంధాన వేదికలు కేవలం కాలక్షేప క్షేత్రాలుగా కాకుండా గొప్ప మానవత వేదికలుగా నిలుస్తున్నాయని చెప్పేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ.
లాహోర్: సామాజిక అనుసంధాన వేదికలు కేవలం కాలక్షేప క్షేత్రాలుగా కాకుండా గొప్ప మానవత వేదికలుగా నిలుస్తున్నాయని చెప్పేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ. పాకిస్థాన్లోని ఓ మహిళ అనుభవిస్తున్న వేదన నెటిజన్ల హృదయాలను కదిలించింది. ఆమెకు తాము అండగా ఉంటామని ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ముందుకొచ్చేలా చేసింది. లాహోర్కు చెందిన మహిళ తాను కట్టుకున్న భర్త మంచివాడు కాకపోవడంతో అతడితో విడిపోయింది. ఆమెకు ఓ రెండేళ్లపాప ఉంది. అయితే, ఆమెకు హెపటైటీస్ సీ అనే వ్యాధి ఉన్నట్లు ఇటీవలె తెలిసింది. దీంతో ఆమెకు ఆశ్రయం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
పైగా వైద్యం చేయించుకునే స్తోమత ఆమెకు లేదు. ఈ కథ తెలుసుకున్న న్యూయార్క్లోని 'హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్' అనే ఫేస్బుక్ పేజీ ఆమె కథనాన్ని ప్రచురించింది. అందులో ఆమె ధీనగాథను వెల్లడించింది. తాను ఎన్ని రోజులు బతుకుతానో తెలియదని, తన కూతురును దత్తత తీసుకునేందుకు ఎవరైనా ముందుకు రావాలని తెలిపింది. ఇది తెలుసుకున్న ఓ యువకుడు ముందుకొచ్చాడు. అయితే, అతడు సంపాధించే పైకం ఆమెకు వైద్యం చేయించడానికి సరిపోని పరిస్థితి. పైగా ఆ యువకుడికి త్వరలో నిశ్చితార్థం. ఇదే విషయాన్ని మరోసారి అదే హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్ ప్రచురించగా విపరీతమైన స్పందన వచ్చింది. ఆమెకు వైద్యం చేయిస్తామని, ఆమె బిడ్డకు కూడా తోడుగా ఉంటామని పలువురు మానవతా వాదులు ముందుకొచ్చారు. దీంతో ఆ లాహోర్ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.