
ఎంత పని చేశావు చైనా..!
వంద మంది నేరస్తులు తప్పించుకున్నా సరే.. ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడకూడదనేది భారత న్యాయ సూత్రం.
బీజింగ్: వంద మంది నేరస్తులు తప్పించుకున్నా సరే.. ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడకూడదనేది భారత న్యాయ సూత్రం. అందుకే మరణ శిక్షల విషయంలో మన కోర్టులు ఆచితూచి వ్యవహరిస్తాయి. అదే పొరుగు దేశం చైనాలో 'క్యాపిటల్ పనిష్ మెంట్'ల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాయో ఈ కథనం చదివితే అర్థమవుతుంది.
21 ఏళ్ల కిందట ఓ అమాయకుడికి వేసిన మరణ శిక్షకు సంబంధించి, చైనా ఉన్నత న్యాయస్థానం శుక్రవారం పునః సమీక్షించింది. ఓ యువతిపై అత్యాచారం చేసి హత్య చేశాడన్న ఆరోపణలతో నీ షుబిన్(21)ను 1995లో దోషిగా తేల్చి మరణ శిక్ష అమలు చేశారు. అయితే అతని మరణం తర్వాత సరిగ్గా 11 ఏళ్లకు వాంగ్ షూజిన్ అనే వ్యక్తి ఆ నేరం చేసింది తానే అని అంగీకరించాడు. దీంతో అదే కేసును తిరిగి విచారణ ప్రారంభించారు. తమ విచారణలో నీ షుబిన్ నిర్ధోషి అని తేలింది. నీ షుబిన్కు మరణ శిక్ష విధించడానికి సరిపడే సాక్షాధారాలు అంత ఖచ్చింతంగా కూడా లేవని కోర్టు తేల్చింది.
యువతిపై అత్యాచారం, హత్య జరిగిన కొన్ని రోజులకు నీషుబిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత పోలీసులు పెట్టే వేధింపులు భరించలేక తానే ఆ నేరాన్ని చేశానని కోర్టు ముందు ఒప్పుకున్నాడు. వేరే దారి లేక నీ షుబిన్ తరపు న్యాయవాది కూడా ఒత్తిడిలో ఆ నేరాన్ని చేశాడని ఆ రోజు కోర్టు ఎదుట తెలిపారు.
అయితే నీషుబిన్ నేరాంగీకారం వెనక అనుమానాలున్నాయని శుక్రంవారం కోర్టు అభిప్రాయపడింది. నేరం జరిగిన ప్రదేశంలో లభించిన ఆధారాలతో పోల్చిచూస్తే అతను నేరం చేశాడనడానకి అంత కచ్చిమైన మిగతా ఆధారాలు ఏవీ లభించలేదని కోర్టు తేల్చింది. చివరగా నీషుబిన్ మరణించిన 21 ఏళ్ల తర్వాత శుక్రవారం కోర్టు అతన్ని నిర్దోషిగా తేల్చేసింది.
కోర్టు నా కుమారున్ని నిర్ధోషిగా తేల్చంది, కానీ చాలా ఆలస్యమైందని నీషుబిన్ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ తీర్పు అతని కుటుంబ సభ్యులకు కాస్త ఊరట నిచ్చినా నీషుబిన్ బతికుంటే ఈ పాటికి ఎలా ఉండే వాడో అనే మరో ఆలోచన రాకుండా ఎలాగుంటుంది.
విచారణ పేరిట నిందితులపై పోలీసుల టార్చర్ చైనాలో ఇంకా కొనసాగుతోందని ఆమ్నేస్టీ తాజా నివేధికలో వెల్లడైంది. మానవ హక్కుల సంఘాల లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా మరణ శిక్షలు అమలు చేస్తున్న దేశంగా చైనా మొదటి స్థానంలో ఉంది.
'ఎన్నో ఏళ్ల కిందట దోషిగా తేల్చిన వ్యక్తిని తిరిగి నిర్ధోషిగా తేల్చడం శుభపరిణామం. చైనా కోర్టులు తామే ఇచ్చిన తీర్పులను పునఃసమీక్షించి తిరిగి తీర్పు వెలువరించడానికి సుముఖంగానే ఉన్నాయనడానికి ఈ తీర్పు నిదర్శనమని' పరిశోధకుడు విలియం నీ తెలిపారు. అయితే ఈ కేసును పరిశిలిస్తే ప్రస్తుతం కూడా చైనాలో విధిస్తున్న మరణ శిక్షల్లో క్షేత్రస్థాయిలో సాక్ష్యాధారాలను పరిశీలించడంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. నీషుబిన్వంటి ఎంతో విషాదకరమైన కేసుల్లో మరణ శిక్ష విధించినంత సులువుగా తిరిగి అతని జీవితాన్ని కోర్టులు ప్రసాధించలేవని విలియం పేర్కొన్నారు. అందుకే తాను మరణ శిక్షను పూర్తిగా రద్దు చేయాలని కోరుకుంటున్నాని స్పష్టం చేశారు.